ఎన్నికలకు ముందు జగన్ భారీ తాయిలం!!
మరో నెల రోజుల్లో కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉద్యోగులకు భారీ తాయిలం ప్రకటించారు
By: Tupaki Desk | 7 March 2024 11:30 AM GMTమరో నెల రోజుల్లో కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉద్యోగులకు భారీ తాయిలం ప్రకటించారు. ఇప్పటి వరకు నాలుగున్నరేళ్లకుపైగా డిమాండ్ చేస్తున్నా పరిష్కరించని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు దీనిని పరిష్కరించడం గమనార్హం. అదే.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇది గత 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీ. దీంతోనే వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీ దక్కించుకుంది. ఉద్యోగుల మనసు కూడా దోచుకుంది.
అయితే.. అధికారంలోకి వచ్చినా నాలుగున్నరేళ్లుగా ఈ హామీపై సీఎం సహా ఎవరూ పట్టించుకోలేదు. అనేక సందర్భాల్లో ఉద్యోగులు ఉద్యమం చేసినా.. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపినా ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు వేతనాలు కూడా సరిగా ఇవ్వకపోవడం.. పీఆర్ సీ లేటవుతున్న నేపథ్యంలో వారికి ఐఆర్ అయినా ఇవ్వాల్సి ఉండగా.. దానిని కూడా ఇచ్చేది లేదనిచెప్పడంతో ఉద్యోగులు రగిలి పోతున్నారు. ఈ క్రమంలో వారు యాంటీగా మారుతున్నారనే సంకేతాలు వచ్చాయి.
ఆ వెంటనే స్పందించిన వైసీపీ ప్రభుత్వం.. తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రియల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో అర్హులైన 2,146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు.
ప్రజారోగ్యం, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురిని క్రమబద్దీకరణ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ క్రమబద్దీకరణ చేశారని ఆఫ్ దిరికార్డుగా అధికారులు సైతం పేర్కొనడం గమనార్హం. దీనిపై ఉద్యోగుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.