Begin typing your search above and press return to search.

చిన్న విషయాల్ని చించి చేట చేస్తున్నోళ్లను కంట్రోల్ చేయరా జగన్?

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుంటే కొన్ని విషయాలు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

By:  Tupaki Desk   |   18 Jun 2024 4:30 AM GMT
చిన్న విషయాల్ని చించి చేట చేస్తున్నోళ్లను కంట్రోల్ చేయరా జగన్?
X

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుంటే కొన్ని విషయాలు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ముఖ్యమంత్రిగా వ్యవహరించే అధినేతలకు పాలనా పరమైన కొన్ని అంశాలు తమకు తెలీకుండానే సాగిపోతాయి. కేసీఆర్ లాంటి శక్తివంతమైన అధినేత సైతం ఇందుకు మినహాయింపు కాదు. కానీ.. అదేమీ పట్టించుకోకుండా ప్రతి విషయానికి లింకు పెట్టి డ్యామేజ్ చేయటం మామూలే. సీఎంగా వ్యవహరించినప్పటికీ.. కొన్ని అంశాలు సదరు అధినేతకు తెలిసే ఉంటాయనుకోవటం పొరపాటే. నిజానికి ఆయన చుట్టూ ఉండే సలహాదారులు.. ముఖ్యమైన వారి తీరుతో విమర్శలు రావటమో.. రాకపోవటమో జరుగుతుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. తేల్చాల్సిన అంశాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంటుందని అనుకోవటం తప్పే అవుతుంది. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు ఏర్పాటు చేసిన ఫర్నీచర్ ను వెనక్కి ఇచ్చేయటం.. కొత్త ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం లాంటి పనుల్ని చూడాల్సింది.. చేయాల్సింది జగన్ కు నమ్మినబంట్లుగా ఉండే ముఖ్యులు. కానీ.. వారు తాము చేయాల్సిన పనుల్ని చేయకుండా ఉండటంతో నిందలు జగన్ మీద పడుతున్న దుస్థితి. గత ప్రభుత్వంలో అలా జరిగింది? సదరు నేతను ఇలా ఇబ్బంది పెట్టారు? అప్పుడు నీతులు చెప్పిన ప్రభుత్వాధినేత.. ఇప్పుడు తప్పులు చేయటం ఏమిటి? అన్న ప్రశ్నలు రావొచ్చు.

కానీ.. ఇదంతా కోటరీ మహత్యంగా చెప్పాలి. అందుకే అంటారు.. కీలక పదవుల్లోకి వెళ్లిన తర్వాత చుట్టూ ఉండే కోటరీ మైండ్ సెట్.. సదరు ముఖ్యనేత మైలేజీని ఎక్కడికి తీసుకెళుతుందో డిసైడ్ చేస్తుందని. మాజీ సీఎం జగన్ విషయంలోనూ ఇదే మాట బలంగా వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో.. జగన్ క్యాంప్ కార్యాలయంలోని ఫర్నీచర్ ను ప్రభుత్వానికి సరెండర్ చేయటమో లేదంటే వాటి ఖరీదు లెక్క చెబితే చెల్లిస్తామన్న లేఖను రాయాల్సింది ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రోజునే. కావాలంటే ఆ విషయాన్ని సోషల్ మీడియాలోనో.. మీడియాలోనో పోస్టు చేస్తే సరిపోయేది. అదేమీ లేకుండా దాని మీద రచ్చ జరిగి.. మీ హయాంలో మీరు చేసిందేంటి? అంటూ అధికార పక్ష నేతలు నిందలు వేయటం షురూ చేసిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు తెర తీయటం తప్పే అవుతుంది.

అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కేటాయించిన ఫర్నీచర్ ను తిరిగి ఇవ్వలేదన్న పేరుతో గత ప్రభుత్వం అప్పట్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మీద చోరీ కేసు నమోదు చేయటం తెలిసిందే. నిజానికి కోడెల శివప్రసాద్ కొత్త ప్రభుత్వం కొలువు తీరినంతనే.. తన దగ్గరున్న ఫర్నీచర్ ను తిరిగి తీసుకోవాలని.. అలా కుదరని పక్షంలో ధర ఎంతో చెబితే చెల్లిస్తానంటూ లేఖల మీద లేఖలు రాసిన తర్వాత కూడా ఆయనపై చోరీ కేసు పెట్టటం.. ఆ తర్వాత ఆయన సూసైడ్ చేసుకోవటం తెలిసిందే.

కట్ చేస్తే.. తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత జగన్ క్యాంప్ ఆఫీసులో కోట్లాది రూపాయిల ఖర్చుతో ఏర్పాటు చేసుకున్న ఫర్నీచర్ ను తిరిగి ఇచ్చేసే విషయంలో జగన్ ముఖ్యులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జగన్ కు సలహాదారులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు? అప్పట్లో ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో నడిపిన వారంతా ఈ రోజున పట్టించుకోవాల్సిన విషయాన్ని పట్టించుకోకుండా గిలికి వదిలేస్తున్న తీరుతో జగన్ విమర్శల పాలవుతున్నారు.

క్యాంప్ ఆఫీసు ఫర్నీచర్ ఎపిసోడ్ లో మాజీ సీఎం జగన్ పై విమర్శల తీవ్రత పెరిగిన వేళ.. పార్టీకి చెందిన లేళ్ల అప్పిరెడ్డి ఒక లేఖ రాస్తూ.. ఫర్నీచర్ ధర ఎంతన్న విషయాన్ని తేలుస్తూ సమాచారం ఇస్తే తాము చెల్లింపులు జరుపుతామని చెప్పటం కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే.. ఇదంతా చర్చ తెర మీదకు రావటానికి ముందు జరగాలి. అందుకు భిన్నంగా స్పందించటం తప్పే అవుతుంది. తనకు సలహాదారులుగా వ్యవహరించిన వారు అదే పనిగా చేస్తున్న తప్పులను జగన్ ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నది ప్రశ్న. తనను విమర్శలకు గురి చేస్తున్న కోటరీతో పాటు.. ఒక వ్యూహం అంటూ లేకుండా లేఖలతో హడావుడి చేస్తున్న లేళ్ల అప్పిరెడ్డి లాంటి వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం జగన్ మీద ఉంది. లేకుంటే.. ఆయన ఇమేజ్ మరింత డ్యామేజ్ కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.