జగన్ ఆ ‘మూడ్’ నుంచి బయటకు వస్తేనే!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు.
By: Tupaki Desk | 17 Aug 2024 9:15 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదనేది సగటు వైసీపీ కార్యకర్తల అభిప్రాయమని అంటున్నారు. జగన్ చెప్పుకున్నట్టు.. చెప్పుకుంటున్నట్టు దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు జేసినా ప్రజలు ఈ స్థాయిలో (కేవలం 11 సీట్లకే పతనం) ఎన్నికల్లో చాకిరేవు ఎందుకు పెట్టారో వాస్తవ కారణాలను ఆయన విశ్లేషించుకోలేకపోతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఎన్నికల్లో హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేసేయాలని జగన్ డిమాండ్లు వినిపిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే జగన్ ఉండి ఉంటే ఈపాటికే ఆ పథకం కింద, ఈ పథకం కింద నిధులు జమ అయ్యేవని ఆయన చెప్పుకుంటున్నారు. ప్రతి చోటా ఆయన ఇదేపాట పాడుతున్నారు. హత్యకు గురయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండకు వెళ్లినప్పుడు కూడా అసలు విషయాన్ని ‘జగన్ ఉండి ఉంటే’ అంటూ అదే పల్లవిని ఎత్తుకున్నారని గుర్తు చేస్తున్నారు.
సహజంగానే జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.1000 పింఛన్ పెంచడానికి ఐదేళ్లు తీసుకున్న నువ్వు సంక్షేమం గురించి మాట్లాడమేమిటంటూ జగన్ పై ట్రోల్స్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో రూ.2000గా ఉన్న పింఛన్ ను జగన్ హయాంలో రూ.3 వేలు చేయడానికి ఐదేళ్లు సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏడాదికి రూ.250 చొప్పున పెంచారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.3000 పింఛన్ ను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు చేసింది. ఇదే విషయాన్ని కూటమి నేతలు ఎత్తిచూపుతున్నారు.
జగన్ వ్యవహారశైలిపై వైసీపీలోనే అంతర్గతంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడానికి అసలు కారణాలు, లోపాలను గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం వంటివి ఏమీ ఆయనలో కనిపించడం లేదనేది వారి ఆవేదనగా కనిపిస్తోందని చెబుతున్నారు.
రాష్ట్రంలో ఓటర్లంతా తనకే ఓట్లు వేశారని.. అయితే ఈవీఎంలతో చంద్రబాబు ముఠా మోసం చేయడం వల్లే తాను ఓడిపోయానని ఇప్పటికీ జగన్ భ్రమల్లోనే జీవిస్తున్నారని అంటున్నారు. కళ్లు మూసుకుంటే ఐదేళ్లూ ఇట్టే గడిచిపోతాయని.. చంద్రబాబు పాపాలు శిశుపాలుడి పాపాల్లా పండుతాయంటూ పదే పదే జగన్ చేస్తున్న వ్యాఖ్యలపైనా ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఐదేళ్లు జగన్ ప్రజలకు దూరమైపోయి.. ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని తిరగడం వల్లే ఓటమి పాలయ్యామని వైసీపీ నేతలు భావిస్తున్నారు. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను సైతం కలవకుండా ఏదైనా సమస్య ఉంటే రీజినల్ కోఆర్డినేటర్లతో మాట్లాడుకునేట్టు చేశారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
ఎన్నికల్లో చిత్తుగా ఓడాక కూడా స్వీయ పరిశీలన, స్వీయ విమర్శ చేసుకోకుండా.. వారంలో రెండు మూడు రోజులు బెంగళూరుకు వెళ్లిపోవడం.. వీక్ డేస్ లో రాష్ట్రానికి రావడం, అది కూడా ట్విట్టర్ లో పోస్టులు చేయడం మినహా జగన్ చేస్తున్నదేమీ లేదనేది వైసీపీ నేతల అంతర్గత ఆందోళనగా ఉందని అంటున్నారు.
కనీసం ఒక ఆరు నెలలు కొత్త ప్రభుత్వానికి అవకాశమిచ్చి.. వారు హామీల అమలులో విఫలమైతే అప్పుడు ప్రజా పోరాటాలపైన దష్టి పెట్టాలని కోరుతున్నారు. అలా కాకుండా చీకటి తర్వాత వెలుగు వస్తుందని, ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయని, ఈవీఎంలతో మోసం చేశారని.. ఇలా తన తప్పులను, లోపాలను కప్పిపుచ్చుకుని భ్రమల్లో జీవించేయడంపైనే సెటైర్లు పడుతున్నాయి.
2019 ఎన్నికల్లో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఓడిపోతానని అనుకోలేదు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అయితే చంద్రబాబు వెంటనే వాస్తవంలోకి వచ్చారు. మళ్లీ ప్రజలకు దగ్గరవుతామని.. వారి ఆదరణ పొందుతామని.. తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేతప్ప ‘చంద్రబాబు ఉండి ఉంటే’.. అని ఆయన అనలేదు.
కానీ జగన్ మాత్రం ప్రజలకు దగ్గరయ్యే పనులు చేయకుండా ‘జగన్ ఉండి ఉంటే’.. అంటూ అదే పల్లవి ఎత్తుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంత తొందరగా జగన్ ఈ మూడ్ నుంచి బయటకు వస్తే వైసీపీకి అంత మంచిదని అంటున్నారు.