Begin typing your search above and press return to search.

క్రిష్ణ క్రిష్ణ : కేంద్రంపై జగన్ పోరాటం ఫలిస్తుందా....?

కానీ జగన్ అయితే మెత్తగా అడుగుతున్నారు తప్ప గట్టిగా పోరాటం చేయడంలేదు అన్న విమర్శ ఉంది.

By:  Tupaki Desk   |   9 Oct 2023 5:05 PM GMT
క్రిష్ణ క్రిష్ణ : కేంద్రంపై జగన్ పోరాటం ఫలిస్తుందా....?
X

ఇప్పటిదాకా కేంద్రం మీద ఏపీ ప్రభుత్వం పెద్దగా ఏ విషయంలోనూ పోరాటం చేయలేదని ఒక ఘాటు విమర్శ ఉంది. అది ప్రత్యేక హోదా అయినా లేక రాజధాని ఒకటీ లేక మూడు అయినప్పటికీ నిధుల విడుదల అయినా. పోలవరం అయినా విభజన హామీలు అయినా తెలంగాణా నుంచి అస్తుల పంపిణీ అయినా తెలంగాణా ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు అయినా ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ జగన్ అయితే మెత్తగా అడుగుతున్నారు తప్ప గట్టిగా పోరాటం చేయడంలేదు అన్న విమర్శ ఉంది.

అయితే ఇపుడు మరో అంశం ముందుకు వచ్చింది. కృష్ణా జలాలపై కేంద్రం తాజా విధివిధానాలు జారీ నేపథ్యంలో ఏపీకి తీరని అన్యాయం జరగనుంది అనంది జల వనరుల నిపుణులతో పాటు మేధావుల మాట. అదెలా అంటే క్రిష్ణా జలాలు నాలుగు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. మహారాష్ట్రలో పుట్టి కర్నాటకలో మెట్టి తెలంగాణా మీదుగా ఏపీకి ఈ జలాలు వస్తాయి. ఇక ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు 800 టీఎంసీలకు పైగా క్రిష్ణా జలాలు ఏపీ వాటాగా ఉంది.

అయితే విభజన తరువాత ఏపీకి 500 చిల్లర, తెలంగాణాకు 214 టీఎంసీ కేటాయించారు. ఇది తమకు అన్యాయం అని తెలంగాణా గడచిన కాలం అంతా పోరాడుతోంది. ఇన్నాళ్ళూ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న కేంద్రంలోని బీజేపీ తాజగా మాత్రం కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని వల్ల ఏపీ నష్టపోతూంటే తెలంగాణా లాభపడుతోంది.

పైగా తెలంగాణాలో తన రాజకీయ ప్రయోజనం చూసుకునే బీజేపీ ఇలా చేసింది అన్న విమర్శలు ఉన్నాయి. ఒకవేళ కేటాయింపులు చేయాలంటే నాలుగు రాష్ట్రాల మధ్య అది కొత్త విభజనగా జరగాలి. అలా కాకుండా కేవలం ఏపీ తెలంగాణాల మధ్యనే ఈ వాటా పంపిణీ అనడం అన్యాయంగా ఉందని అంటున్నారు.

దీంతో జగన్ ఇపుడు తప్పనిసరిగా పోరాడాల్సి ఉంది అని అంటున్నారు. దీనిమీద తాజగా ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలన్న నిర్ణయం ఈ సమావేశంలో తీసుకున్నారు. దీని మీద నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయనిపుణులతో సీఎం భేటీ అయి ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుంది అని చర్చించారు అంతే కాదు కృష్ణా నదీ జలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపైనా సమగ్రంగా చర్చించిన జగన్ న్యాయ పోరాటం ద్వారా తేల్చుకోవాలని నిర్ణయించారు.

అంతే కాదు, కేడబ్ల్యూడీటీ 2 తీర్పు ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ ఏపీకి జరిగే నష్టం జరిగిన అంశంపైనా చర్చ సాగింది. ఇక ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమంటూ సమావేశంలో భావించారు. అదే విధంగా రాష్ట్ర విభజన చట్టాన్ని దాటి మరీ ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

ఇకో అవిపు చూస్తే కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని అధికారులు ముఖ్యమంత్రిని వివరించారు. అలాగే సెక్షన్‌ 89 లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెప్తుందని, ఇప్పుడు దాన్ని ఉల్లంఘించేలా కేంద్రం ఉందని అంటున్నారు.

ఇక ఈ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్‌ ఉండగా కూడా గెజిట్‌ విడుదల చేశారని అలాగే, అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టంలో కాలులను కూడా ఉల్లంఘించి ఈ విధివిధానాలు జారీచేశారని నిపుణులు అంటున్నారు. అలాగే చూసుకుంటే 2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా దీనికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు ఉన్నాయని అంటున్నారు.

అలాగే గోదావరి నదీజలాల కేటాయింపుల్లో ఇంకో బేసిన్‌కు తరలించుకోవచ్చన్న వెసులుబాటుతో మన రాష్ట్రం పోలవరం నుంచి తరలించే నీటిని పరిగణలోకి తీసుకుని ఆ మేరకు తెలంగాణకు కృష్ణానదిలో అదనపు కేటాయింపులు చేయడం సమంజసం కాదని జల వనరుల నిపుణులు అంటున్నారు. ఇది ముమ్మాటికీ ఏపీకి నష్టమని అంటున్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అంతే కాదు, రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజీ వద్దని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. ఇక కేంద్రం మార్గదర్శకాలపై గెజిట్‌ వెలువడిన నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాయాలని కూడా అధికారులకు జగన్ ఆదేశించారని అంటున్నారు.

ఈ విధంగా చూస్తే క్రిష్ణా జలాల విషయంలో ఏపీ సర్కార్ పోరాట బాటనే ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకూ కేంద్రాన్ని ప్రభావితం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.