"చంద్రబాబుకు కడుపు మంట.. 20 టాబ్లెట్లు వేసుకున్నా తగ్గదు"
అయితే.. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆయన నోటీసులు ఇచ్చింది.
By: Tupaki Desk | 8 April 2024 3:34 AM GMTఏపీ సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సరికొత్త వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వలంటీర్లను చూసి చంద్రబాబు కడుపు మండిపోతోందని.. ఈ కడుపు మంట తగ్గాలంటే.. 20 జెల్యూసిల్ టాబ్లెట్లు వేసిన సరిపోవని వ్యాఖ్యానించారు. ``మేమంతా సిద్ధం `` పేరుతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర ఆదివారం రాత్రి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం పరిధిలోని కొనకనమిట్లలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
తాను వస్తేనే మళ్లీ ప్రభుత్వ పథకాలు అమలవుతాయని జగన్ చెప్పారు. తనను గెలిపించకపోతే.. పథకాలు ఆగిపోతాయని.. దీనికివలంటీర్లను ఇటీవల పింఛన్ల పంపిణీ నుంచి దూరం చేయడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. వలంటీర్ వ్యవస్థను లేకుం డా చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉందని సీఎం జగన్ విమర్శించారు. ``మీకు ఇప్పుడు అందుతున్న పథకాలు.. గతంలో ఎవరూ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పథకాలు అందకుండా చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. అందుకే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో ఫిర్యాదు చేయించి.. వలంటీర్లను ఆపేయించారు. రేపు ఆయన అధికారంలోకి వస్తే.. పథకాలను కూడా ఆపేయిస్తాడు`` అని జగన్ వ్యాఖ్యానించారు.
అయితే.. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆయన నోటీసులు ఇచ్చింది. అయితే.. నోటీసులు అందుకున్న విషయం ఆయనకు గుర్తుందో లేదో కానీ.. మరోసారి చంద్రబాబుపై గత విమర్శలే చేశారు. చంద్రబాబును శాడిస్టు, నరహంతకుడు అంటూ సంబోధించారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు జరిగాయని.. ఇప్పుడు పింఛన్ల కోసం వచ్చిన వారిని చచ్చిపోయేలా చేశాడని.. అందుకే తాను శాడిస్టు అంటున్నానని జగన్ సమర్థించుకున్నారు. ప్రజలు వైసీపీ వైపు ఉన్నారన్న అసూయ, ద్వేషంతో చంద్రబాబు ఆయన కూటమి నేతలు రగిలిపోతున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
``చంద్రబాబు కడుపు రగిలిపోతోంది. ఎందుకో తెలుసా? మీ బిడ్డకు మీకు ఇంత మేలు చేస్తున్నాడనే. ఆయన కడుపు మంటకు 20 జెల్యూసెల్ టాబ్లెట్లు ఇచ్చినా ఆ మంట తగ్గదు`` అని జగన్ అన్నారు. అవ్వాతాతలకు పింఛన్లు అందకుండా చేసి.. నరహంత కుడిగా చంద్రబాబు మారారని జగన్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇలాంటి వ్యాఖ్యలపైనే తాజాగా ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు ఇచ్చింది. మూడు పార్టీల కూటమికి ఓటేస్తే.. పేదలకు అందుతున్న పథకాలు అందబోవని, వాటిని వెంటనే ఆపేస్తారని.. జగన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా సీఎం జగన్ ప్రసంగం అంతా.. వలంటీర్లు-సంక్షేమ పథకాల చుట్టూ తిరగడం గమనార్హం.