నాలుగో జాబితాపై జగన్ కసరత్తులు... జనాల్లోకి ఎప్పుడంటే...?
ఈ క్రమంలో ప్రస్తుతం నాలుగో జాబితాపై జగన్ కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది.
By: Tupaki Desk | 17 Jan 2024 12:09 PM GMTసార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అభ్యర్థుల ఎంపికలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గెలుపే లక్ష్యంగా దాదాపు మెజారిటీ నియోజకవర్గాల్లో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇన్ ఛార్జ్ ల మార్పు, చేర్పులకు గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం నాలుగో జాబితాపై జగన్ కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది.
అవును... రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న జగన్... నియోజకవర్గాల్లోని అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీలలో ముగ్గురికి మాత్రమే ఆ టిక్కెట్లు కన్ ఫాం చేసి మిగిలినవారందరినీ మార్చేస్తున్నారు. ఇందులో భాగంగా అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, నందిగాం సురేష్ లకు మాత్రమే సిట్టింగుల్లో స్థానాలు ఇచ్చారని చెబుతున్నారు.
ఇక చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలతో పాటు స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఇన్ ఛార్జ్ లను ప్రకటిస్తున్నారు జగన్. ఈ క్రమంలో నాలుగో జాబితా ప్రకటనపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి నాలుగో జాబితా పండుగ ముందే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ... ఐదారు స్థానాలలోని మార్పుల విషయంలో స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఆ జాబితా వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకూ 59 స్థానాలకు ఇన్ ఛార్జ్ లను మార్చింది అధికార వైసీపీ. ఇందులో భాగంగా తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్ ఛార్జిలను మార్చింది. అందుకు గల కారణాలను సిట్టింగులకు స్పష్టంగా చెబుతుంది. అభ్యర్థుల మార్పుకు గల కారణాలను సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తుంది.
ఈ విషయాలపై ఇటీవల స్పందించిన జగన్... 175కు 175 సీట్లు గెలవాలని.. ఆ ప్రయత్నం చేయాలని.. ఈ క్రమంలో ఏ నియోజకవర్గంలో అయినా అభ్యర్థి బలహీనంగా ఉంటే.. పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయని.. అందుకు అంతా సహకరించాలని.. రాబోయే రోజుల్లో వారికీ తగిన గుర్తింపు ఉంటుందని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నెల 25 నుంచి జనాల్లోకి జగన్!:
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైసీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా... వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ నుంచి రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా.. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో.. నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నారు.