మాజీ సీఎంల కొడుకులలో జగన్ కి ఒకే ఒక ఫ్రెండ్ !
తెలుగు రాష్ట్రాలలో సీఎం కొడుకు సీఎం అవడం అన్నది కేవలం జగన్ విషయంలోనే రికార్డు బ్రేకు గా జరిగింది.
By: Tupaki Desk | 29 April 2024 4:05 AM GMTతెలుగు రాష్ట్రాలలో సీఎం కొడుకు సీఎం అవడం అన్నది కేవలం జగన్ విషయంలోనే రికార్డు బ్రేకు గా జరిగింది. అంతకు ముందు ఎంతో మంది సీఎంలు పనిచేసినా వారి కుమారులు కనీసంగా కూడా సత్తా చాటుకోలేకపోయారు. కొందరు అయితే మంత్రి వరకూ వచ్చినా అత్యున్నత సింహాసనం అయిన సీఎం సీటుని మాత్రం అధిరోహించలేకపోయారు. పీవీ నరసింహారావు కుమారుడు పీవీ రంగారావు మంత్రి వరకూ అయ్యారు. జలగం వెంగళరావు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ఎన్టీయార్ ల కుమారులు ఎమ్మెల్యేలు మంత్రుల దాకా వచ్చారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ మంత్రి అయ్యారు.
ఇక మరో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. డిప్యూటీ స్పీకర్ స్పీకర్ గా మాత్రమే అయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ కి మాజీ సీఎం ల కుమారులతో ఎవరితోనూ పెద్దగా చనువు ఉన్నట్లుగా తోచదు. ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది. అలాంటిది ఆయన ఒక మాజీ సీఎం కుమారుడితో మాత్రం మంచి స్నేహమే చేస్తున్నారు.
ఆయనే దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఈసారి వెంకటరిగి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను గెలిపించాలని మేమంతా బస్సు యాత్ర సందర్భంగా సభా వేదిక నుంచి జనాలకు పరిచయం చేసినపుడు తనకు అతి ముఖ్య స్నేహితుడు అని జగన్ పేర్కొనడం విశేషం.
అంటే జగన్ కి ఈ మాజీ సీఎం కొడుకుతోనే ఎక్కువ ఫ్రెండ్ షిప్ ఉందని అంటున్నారు. అదే జగన్ రాయలసీమకే చెందిన మరో మాజీ సీఎం కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరారు కానీ వైసీపీలోకి రాలేదు. నిజానికి వైఎస్సార్ సీఎం కాకుండా 1989 1994 లలోని కాంగ్రెస్ అధికార కాలంలో ఉమ్మడి ఏపీలో వరసగా సీఎంలు అయింది మర్రి చెన్నారెడ్డి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి. వీరి ముగ్గురుతోనూ నాడు వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉంటూనే పోరాడారు అని చెబుతారు.
ఇక కోట్ల కుమారుడుకి ఎంపీ టికెట్ ని రెండు సార్లు టికెట్ ఇప్పించడంలో వైఎస్సార్ కృషి చేశారు కూడా. ఇక తనయుల వద్దకు వచ్చేసరికి జగన్ తో మాత్రం సూర్య ప్రకాష్ రెడ్డి ఎందుకో దూరం పాటిస్తూ వస్తున్నారు. ఇలా మాజీ సీఎం ల కుమారులలో జగన్ తో సాన్నిహిత్యం నెరుపుతున్న వారు రాం కుమార్ రెడ్డి మాత్రమే కావడం విశేషం. ఆయనకు నిజానికి 2019లోనే వెంకటగిరి నియోజకవర్గం టికెట్ ఇవ్వాల్సింది. లాస్ట్ మినిట్ లో పార్టీలో చేరిన ఆనం రాం నారాయణ రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. ఇపుడు వెంకటగిరి లో టఫ్ గానే పోటీ ఉంది.
గెలిస్తే రాం కుమార్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయినట్లు అవుతుంది. నేదురుమల్లి లెగసీని కంటిన్యూ చేసినట్లు అవుతుంది. ఒక మాజీ సీఎం కుమారుడి ప్రభుత్వంలో మరో మాజీ సీఎం కుమారుడు చేరి భాగం పంచుకున్నట్లు అవుతుంది. చూడాలి మరి వెంకటగిరి ఫలితం ఎలా ఉంటుందో.