ఈ జగన్ భూములు ఇస్తాడు.. కానీ, లాక్కోడు: ఏపీ సీఎం స్ట్రాంగ్ కౌంటర్
గత నాలుగు రోజులుగా ప్రధాన ప్రతిపక్షాలు సహా కొన్ని మీడియా సంస్థలు కూడా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువచ్చాయి.
By: Tupaki Desk | 1 May 2024 1:34 PM GMTఎన్నికల సమయంలో ఏపీలో తీవ్ర గందరగోళానికి దారి తీసిన.. 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్'పై ఏపీ సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత నాలుగు రోజులుగా ప్రధాన ప్రతిపక్షాలు సహా కొన్ని మీడియా సంస్థలు కూడా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఈ విషయాన్ని రాజకీయంగా ప్రచార సభల్లో పెద్ద ఎత్తున ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. ఉమ్మడి మేనిఫెస్టోలోనూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని పేర్కొన్నాయి. ఇక, దీనిపై వారు చేస్తున్న ప్రచారం కూడా.. ప్రజల్లోకి జోరుగా వెళ్లింది.
విపక్షాలు ఏం చెబుతున్నాయంటే..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రచారం మేరకు ఏపీ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈచట్టంతో రాష్ట్రంలోని భూములు, సాగు నేలలపై యాజమాన్యం లేకుండా పోతుందని.. అన్ని అధికారాలు ప్రభుత్వానికి వెళ్లిపోతాయని చెబుతున్నారు. తద్వారా.. రేపు ప్రభుత్వం ఈ భూములను అమ్మేసినా.. తాకట్టు పెట్టినా.. గుట్టు చప్పుడు కాకుండా ఉంటుందని.. ప్రజల ఆస్తులకు రక్షణ, భద్రత కూడా ఉండదని.. దీనిని ఎదిరించాలని వారు పిలుపునిచ్చారు. మరో అడుగు ముందుకు వేసిన పవన్ కల్యాణ్.. రేపు మన ఆడపిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే.. ఏం ఇస్తామని ప్రశ్నించారు. జగన్, ఆయన కోటరీలోని నలుగురు రెడ్లు ప్రజల భూములు లాగేసుకనేందుకు.. ఈ యాక్ట్ తీసుకువచ్చారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక, దీనికి మరింతగా కొన్ని మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి.
జగన్ కౌంటర్ ఇదీ..
నాలుగు రోజులుగా జరుగుతున్న టైటిలింగ్ యాక్ట్ దుమారంపై ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరణ ఇచ్చారు. ఇది కోర్టు పరిధిలో ఉందని.. దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేసిన తర్వాత.. లేదా కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే దీనిని అమలు చేస్తామని చెప్పారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం ప్రచారం ఆపడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ అనకాపల్లిలో నిర్వహించిన సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ``మీ జగన్.. భూములు ఇవ్వడమే కానీ.. లాక్కోడు`` అంటూ చెప్పారు. ఈ విషయం తెలిసి కూడా.. ప్రతిపక్షాలు రాద్ధాం తం చేస్తున్నాయని అన్నారు. ``భూముల పై యజమానులకు సర్వ హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ప్రముఖ ఉద్దేశం`` అని తెలిపారు.
భూముల సమగ్ర సర్వే ద్వారా.. యజమాలను సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో రాష్ట్రంలో భూముల సర్వే జరిగిందని.. ఆ తర్వాత.. ఇప్పటి వరకు అది జరగలేదని అన్నారు. అసలు భూసర్వే జరగాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. భూముల కొలతలు అందుబాటులో లేకపోవడంతో యజమానులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. కోర్టుల్లోనూ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ ఇబ్బందులు తప్పించే ఉద్దేశంతోనే తాను యాక్ట్ తీసుకువచ్చినట్టు చెప్పారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నా.. ప్రతిపక్షాలు ఓర్చుకోలేక పోతున్నాయని అన్నారు.
వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది.. రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 2022లోనే చేసిన చట్టం. కొసమెరుపు ఏంటంటే.. 2030 నాటికి దీనిని అమలు చేయాలనేది కేంద్రం పెట్టిన డెడ్‌లైన్.