బొత్సకు చాన్స్ ఇచ్చిన జగన్
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. చివరికి సీనియర్ నేత బొత్స పేరుని ఖరారు చేశారు.
By: Tupaki Desk | 2 Aug 2024 9:39 AM GMTఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున అభ్యర్థి ఖరారు అయ్యారు. సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు జగన్ చాన్స్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ ఆఫీసులో విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో శుక్రవారం జగన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. చివరికి సీనియర్ నేత బొత్స పేరుని ఖరారు చేశారు. విశాఖ ఎమ్మెల్సీ పదవికి 2021 నవంబ 27న వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మొత్తం లోకల్ బడీస్ లో వైసీపీకి బలం ఉండడం వైసీపీ అధికారంలో ఉండటంతో ఆనాడు టీడీపీ పోటీకి పెట్టలేదు. అదే ఏడాది డిసెంబర్ 8న వంశీ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు.
ఇక ఆయన 2023లో జనసేనలో చేరారు. దాంతో ఆయన మీద అనర్హత వేటు పడింది. అయితే వంశీ జనసేన నుంచి విశాఖ దక్షిణం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా ఉంటే ఈ ఎమ్మెల్సీ పదవికి ఆగస్టు 30న పోలింగ్ జరగనుంది. ఫలితాలు సెప్టెంబర్ 3న వెల్లడవుతాయి.
మొత్తం లోకల్ బాడీస్ ఓట్లు 830 ఉంటే ఇందులో వైసీపీకి 615 టీడీపీ కూటమికి 215 ఉన్నాయి. అయితే వైసీపీ నుంచి ఫిరాయింపులు జరుగుతున్న నేపధ్యంలో కూటమి ముందుకు దూసుకుని వస్తోంది. అంగబలం అర్ధబలం కలిగిన వారు ఈ పదవికి పోటీ చేస్తే అధికార కూటమిని తట్టుకుని నిలబడతారు అని భావించి జగన్ బొత్సను ఎంపిక చేశారు అని అంటున్నారు.
ఈ పదవి కోసం పోటీ చేసేందుకు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాధ్, బూడి ముత్యాల నాయుడు, విశాఖ వైసీపీ అధ్యక్షుడు కోలా గురువులు రేసులో ఉన్నారు. అయితే జగన్ బొత్స పేరుని ప్రకటించడం విశేషం. బొత్స అయితేనే ఇపుడున్న పరిస్థితులల్లో కూటమిని దూకుడుని తట్టుకుని నిలబడతారు అని జగన్ భావించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే విశాఖ జిల్లా రాజకీయాలలో విజయంగరం నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వడం మీద వైసీపీలో చర్చ సాగుతోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా విశాఖ ఎంపీ పదవిని విజయనగరం జిల్లాకు చెందిన బొత్స ఝాన్సీకి ఇచ్చారు. ఇపుడు బొత్సను ఎమ్మెల్సీ పదవికి అభ్యర్ధిగా ఖరారు చేశారు. దాంతో విశాఖ వైసీపీ నాయకులు అసంతృప్తి చెందుతున్నట్లుగా చెబుతున్నారు. విశాఖ జిల్లాలో నేతలు లేనట్లుగా పక్క జిల్లాకు చెందిన వారికి చాన్స్ ఇవ్వడమేంటని అంటున్నారు.
విజయనగరం జిల్లాలోనూ ఒక ఎమ్మెల్సీ పదవి స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అవుతోందని అంతగా బొత్స మీద గురి ఉంటే ఆ పదవికి ఆయనను పోటీకి పెట్టవచ్చు కదా అని కూడా అంటున్నారు. అయితే టీడీపీ కూటమి రాజకీయాలను ఎదుర్కోవడం కత్తి మీద సాము లాంటి వ్యవహారమని అందుకే జగన్ అన్నీ ఆలోచించే బొత్సను బరిలోకి దింపారని అంటున్నారు. ఈ పదవిలో కనుక నెగ్గితే బొత్స 2027 డిసెంబర్ దాకా కొనసాగుతారు.