టీడీపీ సేనకు షాకిచ్చేలా జగన్...!?
అయితే జగన్ అనకాపల్లిని ఎంచుకోవడానికి రాజకీయ కారణాలు వ్యూహాలూ ఉన్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 1 March 2024 3:51 AM GMTఅనకాపల్లి జిల్లాకు మార్చి 7న ముఖ్యమంత్రి జగన్ రానున్నారు. ఆ రోజున ఆయన ప్రభుత్వ పధకాలకు సంబంధించిన విడుదల కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అయితే జగన్ అనకాపల్లిని ఎంచుకోవడానికి రాజకీయ కారణాలు వ్యూహాలూ ఉన్నాయని అంటున్నారు. అనకాపల్లి ఈ మధ్య రాజకీయంగా బాగా నలుగుతోంది.
జనసేన కీలక నేత నాగబాబు అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. అలాగే వైఎస్ ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగి మంత్రిగా పనిచేసి ఆ మీదట వైసీపీలో చేరి కీలక స్థానంలో ఉన్న మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అనకాపల్లి నుంచి పదిహేనేళ్ల తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు
ఇక టీడీపీ కూడా అనకపాల్లి జిల్లాలో తన పట్టుని పెంచుకోవడానికే జనసేనకు రంగంలోకి దింపిందని అంటున్నారు. కాపులు గవరలు కలిస్తే అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీటు కూడా దక్కుతుందని లెక్క వేసుకుంటోంది.
దాంతో నాగబాబుని అక్కడ నుంచి కూటమి తరఫున పోటీ చేయిస్తున్నారు అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అనకాపల్లి జిల్లాలో మొత్తానికి మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఈసారి కూడా టోటల్ గా స్వీప్ చేయాలని చూస్తోంది. టీడీపీ ఈసారి అనకాపల్లి నుంచి ఎక్కువ సీట్లను గెలుచుకోవడం ద్వారా అధికారం అందుకోవాలని చూస్తోంది.
అలా రెండు పార్టీలూ మోహరించిన నేపధ్యం ఉంది. ఇపుడు జగన్ అనకాపల్లి రావడం ద్వారా అక్కడ రాజకీయాన్ని మలుపు తిప్పాల్ని చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా సాఫ్ట్ వేర్ ఇంజనీరు కాపు సామాజిక వర్గానికి చెందిన కొత్త ముఖం మలసాల భరత్ కుమార్ కి టికెట్ ఇస్తున్నారు.
ఎంపీ సీటు అయితే ఇంకా డిసైడ్ చేయలేదు. అయితే బూడి ముత్యాల నాయుడు పేరు పరిశీలనలో ఉంది అని అంటున్నారు. డిప్యూటీ సీఎం గా ఉంటూ మాడుగుల నుంచి రెండు సార్లు గెలిచిన బూడి వెలమ సామాజిక వర్గం బీసీ నేత. ఆయన్ని పోటీలో దింపడం ద్వారా పక్కా లోకల్ కార్డు తో పాటు బీసీ నినాదంతో అనకాపల్లి ఎంపీ సీటు ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.
ఈ క్రమంలో సరైన రాజకీయ వ్యూహాలను రూపిందించడానికి వీలైతే కొన్ని చేరికలను కూడా వైసీపీలోకి తీసుకుని రావడానికి జగన్ టూర్ ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అదే విధంగా ఈసారి టూర్ లో జగన్ రాజకీయ విమర్శలు చేయడమే కాదు వైసీపీ రూట్ ఏంటో జనాలను చెబుతారని అంటున్నారు. దాంతో మార్చి ఏడున అనకాపల్లి చూడు అని వైసీపీ చేస్తున్న నినాదం ఆసక్తిని రేపుతోంది. ఆ రోజున సీఎం జగన్ సభ ఎలా సాగుతుంది ఆయన ఏ విధంగా ప్రసంగం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.