జగన్ చేసిన తప్పులు: ఆ కులం కులం అంటూ మెచ్యూరిటీ మిస్..!
దీనికి కారణం.. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించిన జగన్‌కు వివేచన, వివేకం లేకపోవడమే.
By: Tupaki Desk | 17 Jun 2024 6:33 AM GMTఒక పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీపై సానుభూతి పెరుగుతుంది. ఒక నాయకుడు ఓడిపోయిన తర్వాత.. అయ్యో అనే జాలి కూడా కలుగుతుంది. అంతేకాదు.. మంచిని కూడా చెప్పుకొంటారు. కానీ, ఎటొచ్చీ.. ఏపీలో దీనికి బిన్నమైన చర్చ సాగుతోంది. వైసీపీ ఓడిపోయిన దరిమిలా.. ఆన్‌లైన్ మీడియా చేస్తున్న సర్వేల్లో వందకు ముగ్గురు సానుభూతి చూపిస్తే.. 97 మంది మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇలా జరుగుతుందని ఊహించామంటున్నారు.
దీనికి కారణం.. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించిన జగన్‌కు వివేచన, వివేకం లేకపోవడమే. జగన్మోహన్ రెడ్డికి ఫలానా కులం నచ్చదు అనే భావన కలిగేలా ఆయన తీసుకున్న చర్యలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ కులం వాళ్లకు లబ్ది జరిగింది అని ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. అలా అంతకు ముందు ఏ రాష్ట్ర స్థాయి నేతా ఓ కులం గురించి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. కరోనా వాక్సిన్ల విషయంలో కూడా ఆ కులం గురించి మాట్లాడారు.
వాటిలో నిజానిజాలు ఏమున్నా రాష్ట్రానికి పెద్దగా ఉన్న ఓ వ్యక్తి నుంచి అలాంటి మాటలు రాకూడదు. జగన్ ఆ మెచ్యూరిటీని ప్రదర్శించలేకపోయారు. ఆయన చేసిన పని.. ఆ కులం కాని వాళ్లు కూడా హర్షించలే కపోయారు. ''కచ్చితంగా వాళ్లని టార్గెట్ చేశారు'' అనే మాట వినిపించేలా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉందా.. లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే జన బాహుళ్యంలో మాత్రం ఆ భావన వచ్చింది. జగన్ ఆ కులానికి, ఆ నాయకులకు వ్యతిరేకం అనే ముద్ర పడిపోయింది.
ఈ రాష్ట్రంలో కమ్మకులం అన్నదే ఉండకూడదు అనే స్థాయిలో జగన్ వ్యవహరించారు. ఫలితంగా వైసీపీ ఎవరూ ఊహించనంతగా అభాసుపాలైంది. దీనికి కారణం.. జగన్ ఎవరినైతే ధ్వేషించారో.. ఎవరినైతే చీదరించుకున్నారో.. ఇప్పుడు ఈ ఎన్నిక్లలో కమ్మ కులం చలిచీమల్లా.. వెంటబడింది. ఒక్కటై.. ముందుకు నడిచింది. ఎక్కడెక్కడ నుంచి వచ్చి.. జగన్ అంతు చూస్తామన్నట్టుగా వ్యవహరించింది. ఫలితం... ఒక వివేకం.. ఒక వివేచన లేకపోవడంతో ప్రతిపక్షంగా కూడా కూర్చునే అర్హత లేకుండా పోయింది.