Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం... కుల గణన మార్గదర్శకాలివే!

ప్రధానంగా రాష్ట్రంలో ప్రజల సామాజిక ఆర్ధిక పరిస్థితులును బేరీజు వేసి సంక్షేమ పథకాల రూపకల్పన, అమలుకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఈ కుల గణన చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:17 AM GMT
జగన్  ప్రభుత్వం కీలక నిర్ణయం... కుల గణన మార్గదర్శకాలివే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో దశాబ్దాల తర్వాత కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రజల సామాజిక ఆర్ధిక పరిస్థితులును బేరీజు వేసి సంక్షేమ పథకాల రూపకల్పన, అమలుకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఈ కుల గణన చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇదే సమయంలో వారం రోజుల్లో (ఈ నెల 27న నుంచి డిసెంబరు 3) పూర్తి చేసేలా కసరత్తులు స్టార్ట్ చేసింది! ఈ కులగణనపై ఇప్పటికే పలువురు హర్షం వ్యక్తం చేశారు!

అవును... రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కుల గణన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తుంది. శ్రీకాకుళం, డా.అంబేడ్కర్‌ కోనసీమ, ఎన్టీఆర్‌, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో సచివాలయంలో పైలట్‌ ప్రాజెక్టు కింద సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.

ఇక ఈ సర్వే కోసం వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తారు. అయితే... ఈ సమయంలో వాలంటీర్లు ఇళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నా, కుటుంబసభ్యులు ఇళ్ల దగ్గర లేకపోయినా, అలాంటి వారి వివరాల నమోదు కోసం సర్వే పూర్తయిన తర్వాత మరో వారం రోజులు గడువు ఇవ్వనున్నారు. ఆ సమయంలో సంబంధిత కుటుంబసభ్యులే సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాలి.

ఈ కుల గణన సర్వేలో వివరాల నమోదుకు సంబంధించి వాలంటీర్ల సెల్‌ ఫోన్‌ లో ప్రత్యేక యాప్‌ ను పొందుపరిచారు. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత ఒకే సెల్ ఫోన్ ను మాత్రమే సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీరు వినియోగించాలి. ఈ క్రమంలో వివరాలు సేకరించేటప్పుడు గానీ, పూర్తి అయిన తరవాత గానీ.. స్క్రీన్‌ షాట్‌ లేదా వీడియో రికార్డింగ్‌ చేసేందుకు వీలు లేకుండా ఆ యాప్‌ ను డిజైన్‌ చేశారు.

ఈ సర్వేలో భాగంగా సుమారు 20కి పైగా అంశాలపై సమాచారం సేకరిస్తారని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా... చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, వైవాహిక స్థితి, కులం, ఉప కులం, మతం, రేషన్‌ కార్డు నెంబరు, విద్యార్హత, ఇంటి రకం, నివాస స్థల విస్తీర్ణం, మరుగుదొడ్డి రకం, వంట గ్యాస్‌, వ్యవసాయ భూమి విస్తీర్ణం, తాగునీటి సదుపాయం వివరాలు, పెంచుకుంటున్న పశువుల సంఖ్య మొదలైన వివరాలను సేకరిస్తారు.