Begin typing your search above and press return to search.

మరో ఇరవై వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ కి గెలుపు ఈజీ అయి ఉండేది..!

అదే సమయంలో రోడ్లు అధ్వానం అన్న మాట తొలి ఏడాది నుంచి జనంలో స్థిరంగా నిలిచిపోయింది. దాంతోనే కాస్తా ఆలోచించాల్సింది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 May 2024 4:30 PM GMT
మరో ఇరవై వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ కి గెలుపు ఈజీ అయి ఉండేది..!
X

ఏపీలో ఎంతో చేశామని జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. ఆయన మొదట్లో ఎక్కువగా సంక్షేమ పధకాల గురించే చెప్పారు. ఆ తరువత అభివృద్ధి ని కూడా జోడించారు. జగన్ పాల్గొన్న ప్రతీ ఎన్నికల సభలో దాదాపుగా గంట పాటు కేవలం తన పాలనలో ఏమి చేశాను అన్న దాని మీదనే జనాలకు వివరించే ప్రయత్నం చేసేవారు.

ఇక లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నగదుని బదిలీ చేసే కార్యక్రమం కింద వివిధ పధకాలకు సంబంధించి నేరుగా రెండు లక్షల డెబ్బై అయిదు వేలకు పైగా నగదు జమ చేసింది. అలాగే మరో రెండు లక్షల కోట్లు ఇతర కార్యక్రమాల రూపేనా వెచ్చించింది. ఇవన్నీ కలసి నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని లెక్క తేలుతోంది.

డీబీటీ కింద లక్షల మొత్తాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. ఇక నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం చదువులు, పాఠశాల విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం ఇలా స్కూల్ డెవలప్మెంట్ కి ఖర్చు చేసింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. చెప్పుకోవడానికి కూడా సరిగ్గానే ఉంటాయి.

కానీ అసలు విషయం ఏమిటీ అంటే ప్రజలకు నేరుగా కళ్ళకు కనిపించేవి రోడ్డు, ఇరిగేషన్ ప్రాజెక్టులే అని అంటున్నారు. జగన్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినవి కూడా వీటి మీదనే కావడం విశేషం. జగన్ ప్రభుత్వం రోడ్ల విషయంలో ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే కనుక ఆయన పాలనలో జరిగిన అభివృద్ధి విషయం కూడా జనాలకు బాగా ఎక్కేది అని అంటున్నారు.

అంతే కాదు రైతులకు వివిధ రకాలైన పని ముట్ల కింద మరో అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అవి కూడా కంటికి కనిపించేవి అని అంటున్నారు. వీటికి అయ్యే ఖర్చు ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే వీటిని కనుక పెట్టి ఉంటే జగన్ కి అసలు ఈసారి ఎన్నికల్లో తిరుగులేని విధంగా ఉండేదన్న మాట వినిపిస్తోంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉన్న వైసీపీకి ఈ రెండు పనులు చేసి ఉంటే ఎవరూ టచ్ చేసే సీన్ అనేది ఉండేది కాదు అని అంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే విపక్షాలు రోడ్లు బాగులేవు అని గత అయిదేళ్ళలో చేసిన నిరసన కార్యక్రమాలు ఎక్కుపెట్టిన విమర్శలకు లెక్క అయితే లేదు.

పవన్ రోడ్లు బాగులేవు అని ఆందోళన చేపడితే రైతులు తమకు పని ముట్లు సరిగ్గా లేవని చెపుకుని వాపోయారు. అప్పులు తెచ్చి మరీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్ ప్రభుత్వం మరో ఇరవై వేల కోట్ల రూపాయలను కనుక పెట్టి ఉంటే ఈసారి ఎన్నికల్లో తిరుగులేని విధంగా ఉండేది అన్న భావన అయితే ఉంది మరి.

ప్రజలకు కంటికి కనిపించే అభివృద్ధి మౌలిక సదుపాయాలు. ఎవరైనా ఏ ఊరికైనా వెళ్ళినపుడు రోడ్లనే ముందు చూస్తారు. ఒక రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు సైతం చూసి మాట్లాడేది రోడ్లను గురించే. ప్రభుత్వం చేసే ఇతర కార్యక్రమాల గురించి వారు తెలుసుకునే అవకాశం ఉండదు, కానీ రోడ్లు మాత్రం పాలనకు అద్దం పడతాయి. ఇది ఎవరికైనా బోధపడే విషయమే.

కానీ ఇంత చిన్న లాజిక్ ని వైసీపీ అధినాయకత్వం అయిదేళ్ల పాలనలో ఎలా మిస్ అయింది అన్నదే అంతా చర్చించుకుంటున్న విషయం. ప్రజలకు అవసరం అయిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలే ఎక్కువ ఫలితాలు కూడా ఇస్తాయని అంటున్నారు. మరి జగన్ ప్రభుత్వం మాత్రం సంక్షేమానికి పెద్ద పీట వేయడమే కాదు ఆకాశాన్నే కొలమానంగా చేసుకుంది.

అదే సమయంలో రోడ్లు అధ్వానం అన్న మాట తొలి ఏడాది నుంచి జనంలో స్థిరంగా నిలిచిపోయింది. దాంతోనే కాస్తా ఆలోచించాల్సింది అని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే వైసీపీ తన బలాన్ని ఇంతకు ఇంతా పెంచుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకో మరో ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు ఆలోచించిందా అన్నదే చర్చగా ఉంది మరి. అదే ఇపుడు ఒక డిస్కషన్ గా కూడా సాగుతోంది.