Begin typing your search above and press return to search.

జగన్ ప్రభుత్వానికి ఉన్నది నెల రోజులేనా...!

జగన్ ముఖ్యమంత్రి కోరిక అలా జనాలు తీర్చారు. వైసీపీ నేతలు తాము పాలన సక్రమంగా చేశామని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 3:48 AM GMT
జగన్ ప్రభుత్వానికి ఉన్నది నెల రోజులేనా...!
X

గిర్రున అయిదేళ్ల కాలం తిరిగేసింది. పాదయాత్ర చేసి 2019 ఎన్నికలను వెళ్ళిన జగన్ కి జనాలు బ్రహ్మరధం పట్టారు. 151 సీట్లతో ఆయన అధికారంలోకి వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కోరిక అలా జనాలు తీర్చారు. వైసీపీ నేతలు తాము పాలన సక్రమంగా చేశామని చెబుతున్నారు. పూర్తి విశ్వాసంతో ఎన్నికలకు వెళ్తున్నామని అంటున్నారు. మరోసారి అధికారంలోకి వస్తామని కూడా అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని విపక్షం అంటోంది. చంద్రబాబు అయితే రా కదలిరా సభలలో రోజులతో సైతం లెక్క కట్టి చెబుతున్నారు. మరో రెండు నెలలలో మా ప్రభుత్వం వస్తుంది అని ఆయన ప్రకటిస్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పేది పోలింగ్ తేదీలను. కౌంటింగ్ తేదీలను కాదు, కౌంటింగ్ జరిగి న తరువాతనే కొత్త ప్రభుత్వం వస్తుంది.

ఏపీలో చూసుకుంటే పోలింగ్ కి కౌంటింగ్ కి మధ్య నలభై రోజులకు పైగా సమయం ఉంటుంది. 2019లో కూడా పోలింగ్ ఏప్రిల్ 11న జరిగితే రిజల్ట్ మే 23న వచ్చాయి. అంటే బిగిసి నలభై మూడు రోజులు అన్న మాట. ఈసారి కూడా అలాగే ఉంటుందని ఎన్నికల సంఘం సన్నద్ధతతో పాటు జరుగుతున్న పరిణామాలు చూస్తే అనిపిస్తోంది.

ఇక ఏపీ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు ఎన్నికల ప్రకటనకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసేది మార్చి 10 తరువాత అంటున్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి 10 నడుస్తోంది. దీనిని బట్టి చూస్తే కేవలం నెల రోజుల సమయం మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రభుత్వం అయినా ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. చివరాఖరులో చేసే నిర్ణయాలతో కొన్ని వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు చూస్తుంది.

అలా కనుక ఆలోచిస్తే వైసీపీకి ఉన్న సమయం తక్కువ అనే అంటున్నారు. నెల దగ్గరకు వచ్చేసింది అని అంటున్నారు. ఒకసారి కనుక ఎన్నికల షెడ్యూల్ వెలువడింది అంటే అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఆ మీదట ప్రభుత్వం నామమాత్రం అవుతుంది. అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం గా ఉంటుంది.

విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏ మాత్రం అవకాశం ఉండదు. దాంతో ఎంత చెప్పుకున్నా ఏమి చేసినా వైసీపీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకూ ఉన్న సమయం విలువైనది అని అంటున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్న వర్గాలను గుర్తించి దారికి తెచ్చుకునేందుకు పధకాలు కానీ కార్యక్రమం కానీ ప్రకటించేందుకు అస్కారం ఉంటుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఇదే సరైన సమయం అంటున్నారు.

ఇక చూస్తే వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చివరి అసెంబ్లీ సమావేశాలు ఇటీవలే ముగిసాయి. ఇక కొత్త అసెంబ్లీ అన్నది కొత్త ప్రభుత్వంతోనే మొదలవుతుంది. అదే విధంగా చూస్తే ప్రస్తుతం నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రి వర్గం ఉంది. మార్చి 6న జగన్ నాయకత్వంలో చిట్ట చివరి మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో జరుగుతుంది అని అంటున్నారు. ఆ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. ఆ తరువాత ఎన్నికలకు వెళ్ళడమే మిగిలి ఉంటుంది. సో లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ కి కౌట్ డౌన్ స్టార్ట్ అయింది అన్న మాట.