Begin typing your search above and press return to search.

జగన్ గ్రాఫ్ పడిపోతోందా ?

ఏపీ మాజీ సీఎం జగన్ భారీ ఓటమిని మూటకట్టుకున్నాక ఆయన గ్రాఫ్ సంగతి ఏమిటి అన్నది తెరపైకి వస్తోంది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 3:42 AM GMT
జగన్ గ్రాఫ్ పడిపోతోందా ?
X

ఏపీ మాజీ సీఎం జగన్ భారీ ఓటమిని మూటకట్టుకున్నాక ఆయన గ్రాఫ్ సంగతి ఏమిటి అన్నది తెరపైకి వస్తోంది. ఓటమి తరువాత ఎంతటి నేతకు అయినా వాస్తవాలు తెరుస్తాయి. వారు చుట్టూ ఉన్న మబ్బు తెరల లాంటి వైభోగాలు మసకబారుతాయి. దాంతో వారికీ జనాలకు మధ్య ఉన్న పొరలు తొలగి అంతా కనిపిస్తుంది.

అపుడే గ్రాఫ్ కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. జగన్ విషయంలో ఆయన వ్యతిరేక మీడియా ఎన్నడూ లేని విధంగా టార్గెట్ చేస్తోంది. ఆయన కదిలినా కదలక పోయినా కూడా వార్తే అంటోంది. ఆయన తాడేపల్లిలో ఉంటే ప్యాలెస్ లో ఉన్నారని రాస్తుంది. పులివెందుల వెళ్తే క్యాడర్ సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తుంది అని రాస్తుంది.

బెంగళూరు వెళ్తే కాంగ్రెస్ తో విలీనం అని రాస్తుంది. ఆయన ఎక్కడా ఉండలేరని కుదురుగా రాజకీయం చేయలేరని కూడా రాస్తుంది. ఇలా ఒక వైపు పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తుంది. మరో వైపు అధికార కూటమి చేసే విమర్శలను హైలెట్ చేస్తూ పలుచన చేయడానికి చూస్తోంది.

ఈ విషమ పరిస్థితిని ఎదుర్కొనే మెకానిజం అయితే వైసీపీ దగ్గర లేకపోతోంది. మరోవైపు చూస్తే వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే క్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తోంది. వ్యూహాత్మకమైన పొరపాట్లు చేస్తోంది. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశాక అక్కడే ఉండి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రమాణాలు చేసిన తరువాత వెళ్తే బాగుండేది. అలాగే స్పీకర్ ఎన్నికల వేళ ఆయన సభకు హాజరైతే ఇంకా బాగుండేది. ఇక ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన అన్నీ తెలిసి లేఖలు రాసి ఇబ్బంది పడ్డారు అని అంటున్నారు. ఇది సెల్ఫ్ గోల్ అని అంటున్నారు.

ఎటూ అధికార కూటమి హోదా ఇవ్వదని తెలిసి ఈ లేఖ రాయడం వల్ల వచ్చే సానుభూతి ఏమీ లేదు సరికదా జగన్ మళ్లీ తగ్గి వెళ్లాల్సి ఉంటుంది.అలా కాదు అని అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే మొదటికి మోసం వస్తుంది.ఎన్నుకున్న ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అని అంటున్నారు.

చట్ట సభలలో తన గళం జగన్ వినిపించాలి.ఆయన ఎమ్మెల్యేల చేత అదే చేయించాలి. ప్రజలు ఆ బాధ్యతలు అప్పగించారు. దాన్ని కాదని జగన్ బయటకు వస్తే పలాయనవాదం అనే అంటారు. దానికి వైసీపీ నుంచి కూడా సరైన సమాధానం సైతం ఉండదని అంటున్నారు

ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద కూడా వైసీపీ ఒక స్టాండ్ తీసుకుందా అన్నది తెలియడం లేదు. జాతీయ స్థాయిలో రెండు కూటములు ఉంటే దేనికీ చెందకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయిన వైసీపీ ఇపుడు ఎన్డీయేకు స్పీకర్ అభ్యర్ధి విషయంలో మద్దతు ఇవ్వడం ద్వారా తన గ్రాఫ్ తగ్గించుకుందని అంటున్నారు.

చిత్తుగా ఓడించిన ఎన్డీయేకు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అంటే సొంత కారణాలనే జనాలు ఊహిస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రం ఇందులో ఉన్నాయని అనుకోరు. కేసుల భయమో లేక మరే ఇతర కారణాలో అనుకుంటారు.

ఏపీలో చూస్తే ఎన్డీయే ప్రభుత్వం ఉంది.వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి దేశంలో ఎన్డీయేకు మద్దతు ఇస్తే జనాలు ఎలా నమ్ముతారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం మీద వైసీపీ రాజకీయ దారి అయోమయంలో ఉంది. రిజల్ట్స్ వచ్చిన తరువాత వరసగా తీసుకుంటున్న నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయి. అవి అంతిమంగా జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయని అంటున్నారు.