Begin typing your search above and press return to search.

జగన్ సాయం వాయు వేగం... హార్బర్ బాధితులకు 48గంటల్లోనే పరిహారం!

అవును... విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే ఏపీ ప్రభుత్వం బాధితులకు పరిహారం చెల్లించింది

By:  Tupaki Desk   |   23 Nov 2023 11:19 AM GMT
జగన్ సాయం వాయు వేగం... హార్బర్  బాధితులకు 48గంటల్లోనే పరిహారం!
X

ఈ నెల 19వ ఆదివారం రాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మత్స్యకారులకు నేనున్నానంటూ భరోసానిచ్చారు. అన్నట్లుగానే 48 గంటల్లో పరిహారం అందించారు!

అవును... విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే ఏపీ ప్రభుత్వం బాధితులకు పరిహారం చెల్లించింది. ఇందులో భాగంగా మొత్తం రూ. 7.11కోట్ల నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో బాధితులకు అందించారు. దీంతో మొత్తం 49మంది బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుందని నేతలు, అధికారులు తెలిపారు.

ఈ ప్రమాధంలో పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు.. 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000 చెల్లించగా.. పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించారు. ఇదే సమయంలో... బోట్లు దగ్ధమవడంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలకు కూడా ఇబ్బంది ఏర్పడిందనే విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం వారికీ సహాయం అందించింది.

ఇందులో భాగంగా... ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్‌ టైం సెటిల్‌ మెంట్‌ కింద రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజు... మత్స్యకారులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటోందని ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తోందని తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారని.. పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారని తెలిపారు. కలాసీలకు పరిహారం ఇవ్వాలని కోరిన వెంటనే 10వేలు చొప్పున ఇవ్వాలని సీఎం చెప్పారని తెలిపారు.