Begin typing your search above and press return to search.

కోస్తాలో చిల్లు పెడుతున్న జగన్...సీమలో సీన్ ఏంటి...!?

రాయలసీమలో జగన్ తన పట్టుని అలా కాపాడుకుంటూనే కోస్తాలో టీడీపీ కూటమికి చిల్లు పెడుతున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2024 2:30 AM GMT
కోస్తాలో చిల్లు పెడుతున్న జగన్...సీమలో సీన్ ఏంటి...!?
X

ఈసారి ఎన్నికల్లో 2014 ఫలితాలు రిపీట్ అని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే తన సభలలో చెబుతూ వస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో అలా ఉందా అంటే లేదు అన్న మాట వస్తోంది. ఎందుకంటే 2014 నాటికి జగన్ కేవలం రాయలసీమ నాయకుడు మాత్రమే. ఆ తరువాత ఆయన కోస్తాలో తన పార్టీ రాజకీయ పలుకుబడి విస్తరించుకున్నారు. ఆయన పాదయాత్ర ఫలితంగా అందరికీ చేరువ అయ్యారు.

ఇక అయిదేళ్ల పాటు ఏపీ సీఎం గా జగన్ కోస్తా ప్రాంతాల ప్రజలకు కూడా కీలక నేతగా మారారు. అదే ఇపుడు వైసీపీకి అడ్వాంటేజ్ గా మారబోతోంది. అందుకే సర్వే ఫలితాలు కోస్తాలో వైసీపీకి కొంత సానుకూలంగా వస్తున్నాయని అంటున్నారు. రాయలసీమలో జగన్ తన పట్టుని అలా కాపాడుకుంటూనే కోస్తాలో టీడీపీ కూటమికి చిల్లు పెడుతున్నారు అని అంటున్నారు.

ఇది 2014 నాటికి పూర్తి విరుద్ధం అని అంటున్నారు. 2014లో విభజన ఏపీలో రీజియన్ల వారీగా ఫలితాలు తేడాగా వచ్చాయి. ఆనాడు రాయలసీమ వైసీపీకి పట్టం కడితే కోస్తా టీడీపీకి అధికారం ఇచ్చింది. కోస్తాలోని ఏడు ఉమ్మడి జిల్లాలోని 101 సీట్లలో తొంబై శాతం సీట్లు టీడీపీకి నాడు దక్కాయి. దాంతో జగన్ 67 సీట్ల దగ్గర ఆగిపోయారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 88కి 21 సీట్ల తేడా అన్న మాట.

ఈ పదేళ్లలో జగన్ పలుకుబడి కోస్తా జిల్లాలలో బాగా పెరిగింది. టీడీపీకి ఒకనాడు కంచుకోటలుగా భావించే ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీ తన ప్రభావాన్ని పెంచుకుంది. అలాగే గుంటూరు క్రిష్ణా జిల్లాలు టీడీపీకే పట్టం కడతాయని పరిస్థితి నుంచి వైసీపీకి తన వాటాను అందుకునేలా జగన్ చేయగలిగారు. అలాగే గోదావరి జిల్లాలలో వార్ వన్ సైడ్ ని న్యూట్రల్ చేయగలిగారు. దీంతోనే వైసీపీలో గెలుపు ధీమా పెరిగింది అని అంటున్నారు.

అదెలా అంటే రాయలసీమలో ఇపుడున్న పరిస్థితుల్లో మొత్తం 52 సీట్లకు గానూ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి 35 సీట్లకు తగ్గకుండా వస్తాయని అంటున్నారు. అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న 22 సీట్లలో సగం సీట్లు వస్తాయని లెక్క వేస్తున్నారు. అంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో 46 సీట్లు వైసీపీకి కచ్చితంగా వచ్చేలా ఉన్నాయని అంటున్నారు.

ఇక మ్యాజిక్ ఫిగర్ కి కావాల్సిన 42 సీట్లు కోస్తాలో వైసీపీ గెలుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 101 సీట్లలో 42 సీట్లు అంటే వైసీపీకి ఇది ఈజీ టాస్క్ అనే అంటున్నారు. అదే గ్రేటర్ రాయలసీమలో టీడీపీ కూటమికి 28 సీట్లు దాకా వస్తే మ్యాజిక్ ఫిగర్ కి అవసరం పడే 88లో మిగిలిన 60 సీట్లు 101 ఉన్న కోస్తా నుంచే కొల్లగొట్టాలి. అంటే టీడీపీ పరంగా చూస్తే ఇది బిగ్ టాస్క్ అని అంటున్నారు. నూటికి అరవై సీట్లు అంటే ఏకపక్షంగా వేవ్ ఉంటేనే సాధ్యపడుతుంది.

కానీ ఏపీలో రాజకీయం చూస్తే హోరా హోరీ పోరు ప్రతీ చోటా ఉంది. అందువల్ల మెజారిటీ సీట్లు ఏ ఒక్క పార్టీ సాధించడం కష్టమే అని సర్వే అంచనాలు చూస్తే అర్ధం అవుతుంది.అందుకే తమ వాటాగా కనీసం యాభై దాకా సీట్లు తెచ్చుకున్నా చాలు సింపుల్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్ గా ఉంది.

ఇక్కడే వైసీపీ ధీమా ఏంటో అర్ధం అవుతుంది. ఎంతసేపూ కోస్తాలోనే చూసుకుంటూ గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్న 74 సీట్ల విషయంలో టీడీపీ కూటమి కొంత ఉదాశీనంగా ఉందా అన్న చర్చ వస్తోంది. కూటమి నేతల ఆలోచనలు ఎపుడూ 2014 చుట్టూనే తిరుగుతున్నాయి. ఆనాడు కోస్తాలో భారీ విజయం సాధ్యమైంది. ఈసారి అలా కాదు కోస్తాలో వైసీపీ పట్టు పెంచుకుంది.

అందువల్ల టీడీపీ కూటమి కూడా రాయలసీమలో తమ బలాన్ని పెంచుకుంటే తప్ప ఈసారి అందలం అందదు అని అంటున్నారు. వైసీపీ మాత్రం 2014 నాటి ఫలితాలను గుణపాఠంగా తీసుకుని కోస్తాలో టీడీపీ కూటమికి సవాల్ చేస్తోంది అన్నది రాజకీయ విశ్లేషణగా ఉంది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో ఫలితాలను చూసిన వారు 2024 మార్క్ అనే అంటారు తప్ప 2014 రిపీట్ అని అనకపోవచ్చు అంటున్నారు. అటువంటి విలక్షణమైన తీర్పు ఈసారి వస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.