Begin typing your search above and press return to search.

విశాఖలో ఎమ్మెల్యేలకు ఇళ్ళస్థలాలు జగన్ ఇస్తున్నారా....!?

దీంతో ఇపుడు ఏపీలో జగన్ అదే విధానాన్ని అమలు చేస్తారా అన్న చర్చ మొదలైంది. అయితే ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు అన్నది చాలా మందిలో లోలోపల ఆశగా ఉంది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 4:30 PM GMT
విశాఖలో ఎమ్మెల్యేలకు ఇళ్ళస్థలాలు జగన్ ఇస్తున్నారా....!?
X

వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల కాలం మరి కొద్ది నెలలలో ముగియనుంది. రెండవ టెర్మ్ కూడా తామే అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. వై నాట్ 175 అంటోంది. దాంతో పాటు గా వైసీపీ దూకుడు చేస్తోంది. సిద్ధం పేరుతో సభలను ఎక్కడికక్కడ నిర్వహిస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. మొత్తం 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చామని కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తోంది. జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది.

ఈ నేపధ్యంలో ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఆశలు ఉంటాయి కదా. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు కూడా కోరుతారు కదా. గతంలో అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన సందర్భం ఉంది.

దీంతో ఇపుడు ఏపీలో జగన్ అదే విధానాన్ని అమలు చేస్తారా అన్న చర్చ మొదలైంది. అయితే ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు అన్నది చాలా మందిలో లోలోపల ఆశగా ఉంది. దాన్ని బయట పెట్టింది మాత్రం మంత్రులు. అవును వైసీపీ మంత్రులు ముఖ్యమంత్రి జగన్ ముందు ఇదే విషయాన్ని ప్రస్తావించారు అని అంటున్నారు.

ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం సచివాలయంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలను ఆమోదించారు. అయితే ఇదే సమావేశంలోనే ఎమ్మెల్యేలకు విశాఖలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్‌ను మంత్రులు కోరినట్లుగా తెలుస్తోంది.

అది కూడా మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ముందు కొందరు మంత్రులు ఈ ప్రతిపాదన పెట్టారని అని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తారౌ అని ఆశించిన వారికి నిరాశ కలిగింది అని అంటున్నారు.

సీఎం జగన్ మాత్రం మంత్రులు ఇళ్ల స్థాలల విషయం ప్రస్తావనను విని చూద్దాం అంటూ వెళ్లిపోయినట్లుగా ప్రచారం సాగుతోంది. అంతే కాదు ఈసారి సీఎం జగన్‌ మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు మినహా ఏ విషయాలనూ ప్రస్తావించని వైనాన్ని గుర్తు చేస్తున్నారు. సాధారణంగా మంత్రి వర్గం సమావేశం తరువాత ఇష్టాగోష్టిగా అనేక అంశాలు ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ ఉంటారు.

అదే విధంగా మంత్రులు కూడా అనేక విషయాలు పంచుకుంటారు. కానీ ఈసారి దానికి భిన్నంగా మంత్రివర్గ సమావేశంతోనే ముగించారు అని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖలో ఎమ్మెల్యేలకు ఇళ్ళ స్థలాలు అన్న అంశం మాత్రం ప్రచారంలో ఉంది.

అది ఎంతవరకూ నిజం అన్నది పక్కన పెడితే గతంలో అప్పటి ప్రభుత్వాలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికీ అయిదు వందల గజాల స్థలాన్ని కేటాయించిన నేపధ్యం ఉంది. మరి విశాఖ మీద మోజు అందరికీ ఉంది. ఏపీకి అసలైన రాజధానిగా దాన్ని భావిస్తారు అని అంటున్నారు. అక్కడ కనుక ఇళ్ల స్థలాలు ఇస్తే నిజంగా అది గ్రేటే. మరి సీఎం ఏమీ చెప్పలేదు అంటే ఇక ఈసారికి లేనట్లే అని అంటున్నారు.