బ్రహ్మాండమైన హామీతో జనం ముందుకు జగన్....?
మాట ఇస్తే జగన్ వెనక్కి పోరాని, అప్పులు చేసి అయినా వాటిని నెరవేరుస్తారు అన్న పేరు అయితే సంపాదించుకున్నారు.
By: Tupaki Desk | 8 Oct 2023 12:30 AMముఖ్యమంత్రి జగన్ అన్ని సామాజిక వర్గాలను ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు రానున్న ఆరు నెలల కాలాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటారని అంటున్నారు. మరో వైపు వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టో తయారు చేసే పని జోరుగా సాగుతోంది అంటున్నారు. మూడు పేజీలకు మించకుండా ఈ ఎన్నికల ప్రణాళిక ఉంటుందని అంటున్నారు.
ఈ ఎన్నికల ప్రణాళికలో మరోసారి తమ ప్రభుత్వం వస్తే తాము చేయబోయే వాటిని హామీల రూపంలో ఇస్తారని అంటున్నారు. 2019 ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నూటికి 99 శాతం అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. జనాలు కూడా డే వన్ నుంచి అనేక పధకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని నమ్ముతున్నారు.
మాట ఇస్తే జగన్ వెనక్కి పోరాని, అప్పులు చేసి అయినా వాటిని నెరవేరుస్తారు అన్న పేరు అయితే సంపాదించుకున్నారు. ఇల తొలి అయిదేళ్ల పాలననే గీటు రాయిగా చూపించి మరిన్ని హామీలతో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా వైసీపీ మేనిఫెస్టో తయారు చేస్తున్నారు అని అంటున్నారు.
ఈసారి ఎన్నికల ప్రణాళికలో రైతుల రుణ మాఫీ అనే బ్రహ్మాండమైన హామీని ముందు ఉంచుతారు అని అంటున్నారు. నిజానికి ఈ హామీని 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చి భారీగా లబ్ది పొందింది. ఏపీలో అరవై డెబ్బై లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి. వారందరినీ నాడు టీడీపీ ఈ హామీ ద్వారా ఆకట్టుకుంది.
అయితే నాడు 87 వేల కోట్ల రైతు రుణాల మాఫీ ఉంటే టీడీపీ అయిదేళ్ల పాలనలో కేవలం పాతిక వేల కోట్ల రూపాయల మేరకు మాత్రమే మాఫీ చేసింది అని వైసీపీ విమర్శిస్తూ ఉంటుంది. తాము అలా కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి రుణ మాఫీ చేస్తామని అంటోంది. నాడు వైఎస్ జగన్ ఈ హామీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.
అప్పటితో పోలిస్తే ఇపుడు ఏపీలో ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. చంద్రబాబు టైం లో అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం ఉంటే అది వైసీపీ హయాంలో తొంబై వేల కోట్ల రూపాయల దాకా పెరిగింది అంటున్నారు. రానున్న రోజులలో ఆదాయం ఇంకా పెరుగుతుందని, వచ్చే అయిదేళ్ళూ ఏపీ అభివృద్ధి దిశగా నడుస్తుంది కాబట్టి రైతు రుణ హామీని వైసీపీ నెరవేర్చగలదని అంటున్న చెబుతున్నారు.
అదే విధంగా మధ్య తరగతి వర్గాలను విద్యావంతులను పట్టణ వాసులను ఆకట్టుకోవడానికి కూడా వైసీపీ హామీలను ఇవ్వనుంది అంటున్నారు. ఇక మహిళల కోసం పలు పధకాలను వచ్చే మేనిఫెస్టోలో పెట్టనున్నారు అని తెలుస్తోంది. పేద వర్గాలకు బడుగులకు కూడా పథకాలలో చోటు కల్పించడమే కాకుండా అగ్ర వర్ణాల వారి విషయంలో కూడా అనేక హామీలు ఉంచబోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో డ్యాం ష్యూర్ గా మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడానికి వైసీపీ వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు.