Begin typing your search above and press return to search.

జగన్ ఈ పని ఆనాడే చేసి ఉంటే ?

రాజకీయాల్లో అంతా అయిపోయాక చింతించడం అధినేతలకు అలవాటే.

By:  Tupaki Desk   |   23 Jun 2024 2:47 PM GMT
జగన్ ఈ  పని ఆనాడే చేసి ఉంటే ?
X

రాజకీయాల్లో అంతా అయిపోయాక చింతించడం అధినేతలకు అలవాటే. అధికారం అన్న మత్తు దిగిపోయాకనే వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. అందుకే అన్నారు పెద్దలు. అధికారాంతమున చూడవలే అయ్యగారి సౌభాగ్యముల్ అని.

అధికారం అన్నది కళ్ళకు గంతలు వేస్తుంది. ఏమీ కనిపించకుండా చేస్తుంది. అది అందరి విషయంలోనూ అలాగే ఉంటుంది తాజాగా మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కూడా అధికారాంతముల తరువాత పులివెందుల బాట పట్టారు.

గతంలో జగన్ సీఎం గా పులివెందులకు రాలేదా అంటే చాలా సార్లు వచ్చారు. అదంతా అధికార పర్యటనలుగా సాగిపోయింది. ఆయన చుట్టూ కోటరీ దుర్భేధ్యమైన కోట. ఆ పై విమానాలతో గగన విహారాలు. దాంతో జగన్ వచ్చారు అంటే వచ్చారు. వెళ్లారు అంటే వెళ్లారు అన్నట్లుగానే ఉండేది.

సాదా జనానికి ఆయనను కలిసే భాగ్యం లేకుండా పోయేది. ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరు. పులివెందుల వేరు. జగన్ ని గెలిపించిన సొంత గడ్డ. నిజంగా ఇవ్వాలంటే ఒకింత ఎక్కువ అవకాశం అక్కడ ప్రజలకు ఇవ్వాలి. కానీ జగన్ ఆ పనిచేసినట్లుగా ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆయన జనాలకు బహు దూరం అయిపోయారు. దాంతో పులివెందుల మెజారిటీ కూడా ఈసారి జగన్ కి తగ్గింది.

ఇక అధికారం పోయి తొలిసారి పులివెందుల వచ్చిన జగన్ జనాలతో బాగానే మమేకం అవుతున్నారు. అందరినీ దగ్గరకు తీసుకుంటున్నారు. జనాలతో పులివెందుల క్యాంప్ ఆఫీసు కిటకిటలాడుతోంది.జనాలకు కుర్చీలు వేస్తున్నరు. షామియానాలు వేస్తున్నారు. అందరినీ జగన్ కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది అని జనాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు. ఇక జగన్ కి కడప విమానాశ్రయంలోనే జనాలు స్వాగతం పలికారు. ఆయన కోసం వేలాదిగా జనాలు సిద్ధంగా ఉండడం కూడా కనిపించింది. ఎన్నో ఓదార్పు యాత్రలు చేసిన జగన్ కి జనాలు అలా ఓదార్పు ఇచ్చారు అన్న మాట.

ఇలా జగన్ కోసం పులివెందుల జనం అంతా తరలి వచ్చారు. వారిలో వృద్ధులు యువత, మహిళకు అంతా ఉన్నారు. ఇలా జగన్ కోసం వారు వచ్చారు. జగన్ కూడా జనం కోసం వచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ ఇదే రకంగా అయిదేళ్ల పాటు సీఎం గా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకం అయి ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి.

జగన్ తామేసిన ఓటుతో ఎమ్మెల్యే అయ్యారు. సీఎం అయ్యారు. అయినా తమను కలవలేదే అన్న అసంతృప్తి జనంలో బాగా ఉండేది. వైసీపీకి దక్కిన భారీ ఓటమితో మొత్తం సీన్ మారింది. వచ్చిన జనాలను వచ్చినట్లుగా జగన్ వద్దకు పంపిస్తునారు వైసీపీ నేతలు. జగన్ సైతం ఓపిక చేసుకుని అందరితో మాట్లాడుతున్నారు.

జగన్ ఇపుడు బాగున్నారు. అందరినీ పలకరిస్తున్నారు. ఇదే రకంగా సీఎంగా ఉన్నపుడు చేసి ఉంటే వైసీపీ ఓడిపోయేది కాదు కదా అని ఆ పార్టీ క్యాడర్ అంటోంది. జరిగినది ఏదో జరిగిపోయింది. జగన్ ఇదే తీరున ఆరు నెలల నుంచి ఏడాది పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడేసి రోజుల పాటు పర్యటిస్తే పార్టీకి ఊపొస్తుంది, జనాలకు జగన్ చేరువ అవుతారు అని అంటున్నారు. అంతే తప్ప ఈ టైం లో మళ్లీ పాదయాత్ర ఓదార్పు యాత్రలు అని నిర్వహించడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అంటున్నారు

జగన్ జనం వద్దకు వెళ్తే వారే పార్టీ ఓటమికి అసలైన ఫీడ్ బ్యాక్ ని ఇస్తారని దానిని బట్టే పార్టీని పునర్ నిర్మించుకోవచ్చు అని అంటున్నారు. మరి పులివెందుల వచ్చిన జగన్ ఏపీ అంతా తిరుగుతారా అంటే చూడాల్సి ఉంది. కానీ పార్టీ క్యాడర్ ఇదే కోరుతోంది. పార్టీ క్యాడర్ మాట వినడం ఈ టైం లో అధినాయకునికి అతి ముఖ్యమని అంటున్నారు.