జగన్ నోట.. 'ఎన్నికల ఫలితాల్నిచూశాక హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా' మాటలు!
ప్రజాతీర్పు ఆయన్ను ఎంతటి వెదనకు గురిచేసిందన్న విషయాన్ని ఇటీవల పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా జగన్ నోటి నుంచి వచ్చింది.
By: Tupaki Desk | 29 Jun 2024 4:11 AM GMTవైనాట్ 175? గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించాం. ఈసారి దానికి మించిన సీట్లు సాధిస్తామన్న నమ్మకం.. భరోసా.. ఎన్నికలకు ముందు మాత్రమే కాదు.. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దానికి భిన్నంగా ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చిన వైనం ఆయనపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? అదెలాంటి షాక్ కు గురి చేసింది? ఆ దారుణ ఓటమి వేళ.. జగన్ మైండ్ సెట్ ఎలా ఉండింది? ఆయన ఎలాంటి ఆలోచనలు చేశారు? లాంటి ప్రశ్నలకు తాజాగా జవాబు లభించింది.
ఎన్నికల్లో ఘోర ఓటమి గురైన గంటల వ్యవధిలోనే ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చేందుకు వీలుగా ఒక వీడియోను రికార్డు చేసి.. దానిని మీడియాకు.. సోషల్ మీడియాలోనూ పంపిన జగన్.. తాను నమ్మిన అవ్వతాతలు.. సంక్షేమ పథకాల లబ్థిదారుల ప్రేమాభిమానాలు ఏమైపోయాయంటూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఒకలాంటి అక్రోశాన్ని తన మాటలతో సున్నితంగా చెప్పేశారు. ప్రజాతీర్పు ఆయన్ను ఎంతటి వెదనకు గురిచేసిందన్న విషయాన్ని ఇటీవల పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా జగన్ నోటి నుంచి వచ్చింది.
దానికి సంబంధించిన వివరాలు కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చాయి. పార్టీవర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్నికల్లో ఓటమి జగన్ ను తీవ్రమైన షాక్ కు గురి చేశాయని చెప్పాలి. ఎన్నికల ఫలితాలపై జగన్ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని తాజావ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ‘‘ఫలితాలు చూశాక.. షాక్ అయ్యా. ఇదేంటి? ఇంత చేస్తే ఈ ఫలితాలు ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది. నిజంగానే వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్ లో నుంచి బయటకు రావటానికి రెండు.. మూడు రోజులకు పైనే పట్టింది. కానీ.. ఎన్నికల్లో సీట్లు రాకున్నా 40శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి. అంటే.. అంతపెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాక.. మనం నిలబడాలి’’ అనిపించిందంటూ తన మనసులోని మాటల్ని పంచుకున్నట్లుగా తెలిసింది.
మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించిందన్న జగన్.. దాంతో మెల్లగా ఫలితాల నుంచి బయటకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ‘‘ఫలితాల ఎందుకు అలా వచ్చాయన్న అనుమానాలు.. కారణాలు ఏమి ఉన్నా.. మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలి. సర్వేలు చేయించాం. వాటిల్లో ఎక్కడా వ్యతిరేకత రాలేదు. అందువల్లే నమ్మకంగా ఉన్నాం. కానీ.. ఫలితాలు మరోలా వచ్చాయి. వాటిని చూసినప్పుడు నా పరిస్థితే ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో మీకూ ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను బయటకు వచ్చినట్లే.. మీరు ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి బయటకు రండి. ప్రజలకు.. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే కార్యక్రమాలకు సిద్ధం కండి’’ అంటూ పార్టీ నేతలకు ఉద్బోధ చేశారు. ఎన్నికల ఓటమిపై జగన్ మనసు ఎంతటి షాక్ కు గురైందన్న విషయం తాజా వ్యాఖ్యలు కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.