ఆ ఒక్క ఇంటర్వ్యూతో జగన్ ఓడిపోయారా ?
ఇలా టీఆర్పీ రేటింగ్ లో టాప్ పొజిషన్స్ లో ఉన్న మీడియా చానల్స్ చేతిలో ఉన్నా వైసీపీ తనకు అనుకూలం చేసుకోలేకపోయింది అన్న చర్చ ఉంది.
By: Tupaki Desk | 8 Jun 2024 1:30 PM GMTఎన్నికల వేళ ఇచ్చే ఇంటర్వ్యూలు కానీ పార్టీ ద్వారా వచ్చే వార్తలు కానీ హైప్ క్రియేట్ చేసి సక్సెస్ వైపుగా నడిపించాలి కానీ భారీ ఓటమికి దారి తీయడమేంటి అన్నదే కదా అసలైన చర్చ. వైసీపీకి మొదటి నుంచి మీడియా మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్స్ నే ఉన్నాయి. సొంతంగా మీడియా సంస్థ ఉంది. అలాగే మరో రెండు ప్రముఖ టీవీ చానళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా మారాయి.
ఇలా టీఆర్పీ రేటింగ్ లో టాప్ పొజిషన్స్ లో ఉన్న మీడియా చానల్స్ చేతిలో ఉన్నా వైసీపీ తనకు అనుకూలం చేసుకోలేకపోయింది అన్న చర్చ ఉంది. అదే టైం లో వ్యతిరేకం భారీగా చేసుకుంది అదే చివరికి దెబ్బేసింది అని అంటున్నారు. అదేలా ఉంటే పోలింగ్ కి సరిగా అయిదు రోజులు మాత్రమే టైం ఉన్న వేళ ఒక ప్రముఖ టీవీ చానల్ కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూయే పూర్తిగా పార్టీ కొంప ముంచింది అని అంటున్నారు.
ఆ ప్రముఖ చానల్ లో ప్రసారం అయిన జగన్ ఇంటర్వ్యూను పెద్ద ఎత్తున జనాలు చూశారు. టీఆర్ పీ రేటింగ్ కూడా అదిరిపోయే స్థాయిలో వచ్చింది అంటే ఆసక్తి ఒక రేంజిలో ఉంది అని అర్థం అంటున్నారు. మరి జనమంతా కోట్లాదిమంది చూస్తారు అని తెలిసి కూడా ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు జగన్ ఇచ్చిన సమాధానాలు అతి విశ్వాసాన్ని అహంకార పూరితమైన ధోరణిని కలిగించాయని అంటున్నారు.
యాంకర్ అడిగిన ప్రతీ దానికీ జగన్ వై నాట్ 175 అంటూ వచ్చారు. ఏ ప్రశ్న వేసినా మాకే మొత్తానికి మొత్తం ఏపీలోని అసెంబ్లీ సీట్లు దక్కుతాయని ఆయన చెప్పడం జరిగింది. ఇది క్యాడర్ లో పాజిటివ్ గా ఎంత వరకూ వెళ్ళిందో తెలియదు కానీ చూసిన జనంలో మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ కలుగచేసింది అని అంటున్నారు. ఒక పార్టీ అధినేత వై నాట్ మేమే మళ్ళీ గెలుస్తామని చెప్పడంతో జనాలు ఇంతటి ధీమాకూ ఒక రకంగా చెక్ పెట్టేశారు అని అంటున్నారు.
నిజానికి చాలా సమగ్రమైన ఇంటర్వ్యూగానే అది సాగింది. ప్రజల మనసులలో ఉన్న అనేక ప్రశ్నలను యాంకర్ పట్టుకుని జగన్ కి వాటిని సంధించారు. అంటే ఆయా ప్రశ్నలకు జగన్ ఏమి సమాధానం చెబుతారో అన్నది చూసింది కోట్లాది మంది జనం. మరి జగన్ అయితే చాలా ఈజీగా వై నాట్ 175 అని మాటకు ముందు తరువాత చెప్పడంతోనే జనాలకు ఆగ్రహం వచ్చింది అని అంటున్నారు.
జగన్ చెప్పిన ఈ మాటలు వాస్తవ విరుద్ధంగా ఉండడంతో పాటు మేమే గెలుస్తాం మేము తప్ప ఎవరూ లేరు అన్నట్లుగా మాట్లాడారు అన్న ఒక రకమైన వ్యతిరేక సందేశం జనాల్లోకి వెళ్ళింది అని విశ్లేషిస్తున్నారు. ఆ ఒక్క మాటతోనే ఏపీకి ఈయన అవసరం లేదు అని జనాలు తేల్చేసారా అన్న చర్చ కూడా ఇపుడు నడుస్తోంది.
జనాల ముందు ఎవరైనా ఓట్ల కోసం అర్ధించాల్సిందే. ఎంతటి కొమ్ములు తిరిగిన నేతలు అయినా మాకు ఓటు వేయండి బాబూ అని కోరాల్సిందే. అలా కాకుండా గెలుపు ఎపుడో డిసైడ్ అయిపోయింది అని ఎన్నికలు జస్ట్ లాంచనం అన్నట్లుగా జగన్ మాట్లాడినట్టుగానే జనాలు అర్ధం చేసుకున్నారు. జగన్ మాటలు ఆత్మ విశ్వాసంతో చెప్పవచ్చు కానీ అది కాస్తా జనంలోకి గర్వంతో కూడిన మాటలుగా వెళ్ళాయని అంటున్నారు.
దాని ఫలితమే దారుణమైన రిజల్ట్ అని చెబుతున్నారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిమార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ నాయకుడు అయినా కొన్ని తప్పులు చేస్తే చేసి ఉండవచ్చు అని కూడా ఒప్పుకుంటూనే వాటిని పునరావృత్తం కానీయం అని చెప్పడం వల్ల మేలు జరుగుతుందేమో కానీ అంతా బాగుంది ఏమీ లేదు మేమే అంటే అది జనాలకే కంటగింపుగా మారుతుంది అని అంటున్నారు.
ఇదే ఇంటర్వ్యూలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలోనూ సరైన వివరణ లభించలేదు అన్నది కూడా ఒక విశ్లేషణగా ఉంది. అలాగే వీటితో పాటుగా కుటుంబం గొడవలకు సంబంధించి ఇచ్చిన వివరణ విషయంలో ప్రత్యేకించి మహిళలు ఏ మాత్రం సంతృప్తి చెందలేదని కూడా అనంతర ఫలితాలు నిరూపించాయి.
ఒక ఆడపిల్ల అన్యాయం జరిగింది అని చెబుతూంటే దానికి ఏవో కారణాలు చెప్పి సమర్ధించుకునే ప్రయత్నం చేయడం కూడా బూమరాంగ్ అయింది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అన్నింటి కంటే కూడా వై నాట్ 175 అన్నది అతి పెద్ద దెబ్బ తీసింది అన్నది మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక అంశంగా మారుతోందిట.