అసలు సమస్య అదే.. గుర్తించావా జగన్..!
పార్టీలు కుప్పకూలడానికి ప్రజలు ప్రత్యక్షంగా కనిపించే ఒక ఆబ్జెక్ట్ మాత్రమే.
By: Tupaki Desk | 15 Jun 2024 4:30 PM GMTపార్టీలు కుప్పకూలడానికి ప్రజలు ప్రత్యక్షంగా కనిపించే ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. కానీ, అసలు పార్టీలు కుంగిపోవడానికి కారణం .. నాయకులు. గతంలో చంద్రబాబు ఓడిపోయినప్పుడుకూడా నాయకులపై ప్రజలు విశ్వసనీయత తగ్గిపోవడమే. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలో ప్రజలు వంగి వంగి దణ్ణాలు పెట్టారు. ఇకమీదట నాయకులు తప్పులు చేయకుండా చూసుకుంటానని.. ఈ ఒక్కసారికి తనను చూసి ఓటేయాలని కోరుకున్నారు.
కానీ, ప్రజలు ఆ ఎన్నికల్లో టీడీపీని ఆదరించలేక పోయారు. ఇక, ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీకి కూడా వచ్చింది. నోరు విప్పితే.. నా కొడుకు.. ఈ నాకొడుకు.. ఆడు, ఈడు అంటూ.. బూతులతో విరుచుకు పడిన నాయకులు ఎక్కువ మందే ఉన్నారు. ఇక, అర్థం పర్థం లేకుండా.. కోడిగుడ్డు వ్యాఖ్యలు చేసి అభాసుపాలై న నాయకులు కూడా ఉన్నారు. వీటికి మించి.. సోషల్ మీడియా వేదికగా విదేశాల నుంచి `పంచ్` ప్రభాకర్ వంటివారు సృష్టించిన దుమారాలు కూడా ఉన్నాయి.
ఇవన్నీ కలిపి కట్టగట్టినట్టుగా ఎన్నికల సమయంలో ప్రభావం చూపించాయి. ఏపీ ప్రజల్లో ఫైర్ లేక పోవచ్చు.. కానీ, ఆలోచన ఉంది. ఇలాంటి వారిని వారు సహించరని అనేక మంది చెప్పుకొచ్చారు. అంతో ఇంతో మర్యాద కోరుకుంటారని కూడా.. మేధావులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ప్రజలు గౌరవానికి ప్రాధాన్యం ఇస్తారు. తాము గౌరవం ఇస్తారు.. కోరుకుంటారు. ఇదే సూత్రం రాజకీయాల్లోనూ వారు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అంటే బూతుల పార్టీ అనే పేరు వచ్చేలా చేసింది.
మేధావుల నుంచి చదువుకున్న వారు వరకు కూడా.. వైసీపీని ఏవగించుకునేందుకు ఇదే కారణంగా మారిపోయింది. జగన్‌పై కోపం లేని వారు కూడా.. ఆయన టీంను అసహ్యించుకున్నారు. ఆదిలోనే కంట్రోల్ చేయాలని కోరుకున్నారు. కానీ, జగన్ వారిని ప్రోత్సహించారు. దీంతో ఫలితం ఏ రేంజ్‌లో వచ్చిందో అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికైనా ఈ సమస్యను గుర్తించి జగన్ సరిదిద్దుకుంటారా? ఇలాంటి నాయకులను కంట్రోల్ చేస్తారా? లేదా? అనేది చూడాలి. దీనిని బట్టే పార్టీ మనుగడ ఉంటుందనేది ఆయన గుర్తించాలని అంటున్నారు మేధావులు.