జగన్‌ను ముంచిన వారే.. మచ్చికవుతున్నారా? వైసీపీలో రచ్చ..!
ఎవరైతే.. అప్పట్లో సలహాదారులుగా అధికారికంగా వ్యవహరించారో.. ఇప్పుడు కూడా వారే.. అనధికారికంగా.. పార్టీ నాయకులుగా సలహాలు ఇస్తున్నారు.
By: Tupaki Desk | 19 July 2024 11:30 AM GMTఎన్నికలకు ముందు వైసీపీకి కొందరు ఇచ్చిన సలహాలే.. ఆ పార్టీని అంతం చేశాయని వైసీపీ నాయకులు బాహాటంగానే విమర్శించారు. 151 స్థానాలు న్న వైసీపీ 11 స్థానాలకు పడిపోయింది. ఇది ఘరో పరాజయం. అందరూ చెప్పే మాట ఇదే. అయితే.. ఆ ఓటమి తర్వాతైనా.. వైసీపీలో మార్పు కనిపించిందా? అంటే.. కనిపించడం లేదు. ఎవరైతే.. అప్పట్లో సలహాదారులుగా అధికారికంగా వ్యవహరించారో.. ఇప్పుడు కూడా వారే.. అనధికారికంగా.. పార్టీ నాయకులుగా సలహాలు ఇస్తున్నారు.
దీంతో ఇలాంటివారిని తక్షణం పక్కన పెట్టాలని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీని గాడిలో పెట్టాలి. ముఖ్యంగా.. ప్రజలను కలుసుకోవాలి. ఈ రెండు విషయాలు కూడా.. వైసీపీకి అత్యంత కీలకం. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఈ దిశగానే జగన్ అడుగులు వేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఈ విషయంలో కొందరు సలహాదారులు రంగ ప్రవేశం చేశారు. అరెరె.. ఇప్పుడే ప్రజలను కలుసుకోవద్దని ఓ కీలక సలహాదారు సలహా ఇచ్చారట.
అంతే.. అప్పటి వరకు ప్రజలను కలుసుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం జగన్ వెంటనే ఆ కార్యక్ర మాన్ని రద్దు చేసుకున్నారు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు కొందరు చేసిన వ్యాఖ్య. ఇక, పార్టీ కార్యకర్తలను కలుసుకునేందుకు జగన్ రెడీ అయ్యారు. కార్యకర్తలతో జిల్లాల వారీగా సమావేశం అవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. దీనికి కూడా మరో సలహాదారు గండి కొట్టారు. ఇప్పుడే కాదని చెప్పేశారట. దీంతో ఆ కార్యక్రమం కూడా వాయిదా పడిపోయింది.
ఇక, ప్రభుత్వ పరంగా చూస్తే.. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదనితెలిసి కూడా.. లేఖ రాసిన విషయం తెలిసిందే. స్పీకర్ అయ్యన్నకు జగన్ సుదీర్ఘ లేఖ రాశారు. ఇలా రాయమని చెప్పింది కూడా ఓ సలహాదారేనట. కానీ, ఈ లేఖ రాసిన తర్వాత.. జగన్ మరింత బద్నాం అయ్యారు. అదేసమయంలో స్పీకర్ స్థానంలో అయ్యన్నను కూర్చోబెట్టే విషయంలోనూ `మీరు వద్దని` ఓ సలహాదారు కీలక సలహా ఊదాడట. దీంతో జగన్ ఆ కార్యక్రమానికి దూరమయ్యారు. పోనీ వేరే వారిని కూడా పంపించలేదు. దీంతో అప్పుడు కూడా బద్నాం అయ్యారు. మొత్తానికి జగన్‌ను నిండా ముంచిన వారే.. ఇప్పుడు కూడా ఆయనకు సలహాలు ఇస్తూ.. మరింత బద్నాం అయ్యేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.