జగన్ వరకూ ఓకే....నేతల మాటేంటి ?
గత అయిదేళ్ల ప్రభుత్వంలో అవినీతి అంటూ చాలా మందిని టార్గెట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 16 Jun 2024 1:30 PM GMTవైసీపీ ఇక మీదట సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలి. ప్రతిపక్షంలో నిండా అయిదేళ్ళు. అంటే 1825 రోజులు అన్న మాట. కళ్ళు మూసుకుంటే ఎంతసేపు అని అధినేత జగన్ అనవచ్చు. అవి ఓదార్పుని ఇచ్చే మాటలు గానే చూస్తున్నారు. కానీ ఏపీలో అధికారంలో టీడీపీ కూటమి ఉంది. గత అయిదేళ్ల ప్రభుత్వంలో అవినీతి అంటూ చాలా మందిని టార్గెట్ చేస్తున్నారు.
ఇక మీదట దూకుడు వేరే లెవెల్ లో ఉండవచ్చు అని కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు వైసీపీలో నేతలు చాలా మంది డీలా పడుతున్న నేపథ్యం ఉంది అని అంటున్నారు. జగన్ వరకూ ఓకే. ఆయన దేనిని అయినా తట్టుకుని నిలబడే సామర్థ్యం కలిగిన వారు.
ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లుగా వయసు ఉంది. ఒంట్లో సత్తువ ఉంది. ఓపిక కూడా చాలానే ఉంది. మరి ఆయనకు ఉన్న ఆ ధైర్యం వయసు అన్నీ ఇతర నేతలకు ఉన్నాయా అన్నదే ఇక్కడ ప్రశ్నలుగా వినిపిస్తున్నాయి. అన్ని రకాల కష్టాలను తట్టుకుని తీరం చేరామని అనుకున్న వేళ మళ్లీ పాతాళంలోకి జారడం అంటే ఎవరైనా తప్పకుండా నైరాశ్యంలో పడతారు.
పైగా రాజకీయాలు గతంలోలా లేవు. అయిదేళ్ల పాటు కష్టపడి పనిచేయడం అన్నది చాలా మందిలో తక్కువ. క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెప్పుకునే టీడీపీ లోనే చాలా మంది నేతలు మొదటి మూడేళ్లు బయటకు రాని పరిస్థితిని అంతా చూశారు. మరి కొందరు నేతలు అయితే ఎన్నికల వేళనే ముఖం చూపించారు అని కూడా విమర్శలు వచ్చాయి.
ఇంకొందరు నేతలు వైసీపీకి టచ్ లోకి వచ్చేశారు. వర్తమానంలో అందరికీ వ్యాపారాలు ఇతర వ్యవహారాలు ఉంటూ వస్తున్నాయి. రాజకీయాలలో అటుపోట్లు ఎదురైతే అది వారి వ్యాపారాల మీద దెబ్బ తీస్తుంది. 2014 నుంచి 2019 దాకా పరిస్థితి వేరు. అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఉండేది. దాంతో వైసీపీ నేతలకు ఎంతో కొంత ఊరటగా ఉండేది.
ఇపుడు అలా కాదు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పైగా చంద్రబాబు ఒకనాటి శిష్యుడు రేవంత్ రెడ్డి అక్కడ సీఎం గా ఉన్నారు. దాంతో వైసీపీ నేతలకు ఊపిరి ఆడని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అందుకే చాలా మంది నేతలు రిజల్ట్స్ వచ్చి పది రోజులు పై దాటినా బయటకు రాని నేపథ్యం ఉంది.
అయిదేళ్ల పాటు తాము బతికి బట్టకట్టాలీ అంటే అధికార పార్టీకి ఎదురెళ్ళడం కంటే తగ్గి ఉండడమే మంచిదన్నది చాలా మంది ఆలోచన అని కూడా అంటున్నారు. పైగా టీడీపీ వ్యూహాలు కూడా పక్కాగా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీని ఇదే సమయంలో లేకుండా చేయాలని వీలైతే ఉనికికే ముప్పు తేవాలని కూడా ఆలోచిస్తారు.
రాజకీయంగా ఇది సహజమైనదే అని అంటున్నారు. ఎవరి చేతిలో కర్ర ఉంటే వారిదే బర్రె అన్న నీతి ఎపుడూ అమలులో ఉంటుంది. ఈ క్రమంలో చూసుకున్నపుడు మాత్రం వైసీపీ నేతలకు జగన్ మాటలు ఎంతవరకూ ధీమాను ఇస్తాయన్నది చూడాల్సి ఉంది.
పార్టీ అధినేతగా జగన్ కి వైసీపీ భారం తప్పదు. కానీ ఇతర నేతలకు అలా కాదు, వారు తమకు ఇబ్బంది అయితే తమ దారి తాము చూసుకుంటారు. ఇది అంతటా జరుగుతున్న విషయమే. పైగా చాలా చోట్ల వైసీపీలో ఆరున్నర పదుల వయసు దాటిన వారు ఇక రాజకీయాలు అవసరమా అన్న వేదాంత ధోరణిలో పడిపోయారు అని అంటున్నారు.
మరి కొందరు అయితే దిగింది రాజకీయాల్లో కాబట్టి వదిలేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొనసాగాలంటే అందుకు అనువైన మార్గాలు ఏమిటి అన్నది ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. విజయవాడ నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని నాకొద్దీ రాజకీయాలు అని ఓటమి తరువాత దూరం అయిపోయారు. ఒక వైపు ఆ తరహా నేతలు ఉంటే మరో వైపు పక్క చూపులు చూసే నేతలు ఉన్నారు.
ఇంకోవైపు పూర్తిగా వ్యాపార వ్యవహారాలు అయిదేళ్ళూ చూసుకుందామని భావించేవారూ ఉన్నారు. అందువల్ల జగన్ ఇచ్చిన ధైర్యాన్ని అందిపుచ్చుకుని రానున్న అయిదేళ్ల పాటు జనంలో ఉంటూ పోరాడే వారు ఎంతమంది ఉంటారు అన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. అయితే వైసీపీ అధినాయకత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని కొత్త వారిని ప్రోత్సహించాలి. యువతను ముందుకు తేవాలి. అలాగే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులను ముందు వరసలో పెట్టి పోరాటం చేయాలి.
టీడీపీ గత అయిదేళ్ళలో అదే చేసింది. జూనియర్లకే బాధ్యతలు అప్పగించింది. వారిలో రాజకీయ దూకుడు ఉంటుంది. దాన్ని సమర్థంగా వాడుకుంది. వైసీపీ కూడా అదే రూట్ లో వెళ్లడం బెటర్ అని అంటున్నారు. పదవులు చేసిన వారు హోదాలు అందుకున్న వారిలో ఎంతమంది కష్టకాలంలో వైసీపీ వైపు ఉంటారు అన్నది రానున్న రోజులలో మెల్లగా తెలుస్తుంది అని అంటున్నారు.