చంద్రబాబుని ఏమీ అనకుండా జగన్ ని ఆపుతున్నదెవరు ?
మరీ ముఖ్యంగా చూస్తే జగన్ ఫుల్ సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఎంతసేపూ ఎందుకు ఓడిపోయామో అని అంటున్నారు. అంతే తప్ప చంద్రబాబు మీద ఏ రకమైన కామెంట్స్ చేయడంలేదు.
By: Tupaki Desk | 13 Jun 2024 1:30 AM GMTఅంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడిచిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువు తీరింది. టీడీపీ కూటమి 164 సీట్లను సాధించి అపూర్వ విజయం అందుకుంది. మరో వైపు చూస్తే టీడీపీ నేతలు అంతా వైసీపీని విమర్శిస్తున్నారు. చేతిలో అధికారం ఉండటంతో చాలానే అంటున్నారు.
అదే విధంగా వైసీపీ క్యాడర్ మీద చాలా చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. వైఎస్సార్ వైసీపీకి ఆరాధ్య దైవం. ఆయన విగ్రహాలను కూలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ ఉండటం లేదు. న్యాయ పోరాటం అంటున్నారు. రాష్ట్రపతికి ఫిర్యాదులు అని అంటున్నారు. అంతే తప్ప టీడీపీ మీద డైరెక్ట్ గా అయితే కామెంట్స్ చేయలేకపోతున్నారు.
మరీ ముఖ్యంగా చూస్తే జగన్ ఫుల్ సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఎంతసేపూ ఎందుకు ఓడిపోయామో అని అంటున్నారు. అంతే తప్ప చంద్రబాబు మీద ఏ రకమైన కామెంట్స్ చేయడంలేదు. నిజానికి 2014లో అయితే రిజల్ట్ వచ్చిన వెంటనే జగన్ మీడియా ముందుకు వచ్చి గట్టిగానే మాట్లాడారు. ఆ తరువాత కూడా ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేరే విధంగా ఉంది.
ఈసారి ఎందుకు జగన్ టీడీపీ మీద విమర్శలు చేయడం లేదు అన్న చర్చ సాగుతోంది. నిజానికి నాటి కంటే నేడు దారుణంగా వైసీపీ ఓటమి పాలు అయింది. పైగా అనాటి కంటే ఎక్కువగా టీడీపీ వైసీపీని టార్గెట్ చేసింది. ఒక విధంగా సెల్ఫ్ డిఫెన్స్ లో వైసీపీ పడింది. ఈ టైం లో వేయింతలు ధైర్యం ఇస్తూ జగన్ అగ్రెసివ్ మోడ్ లో మాట్లాడాల్సి ఉంది అని అంటున్నారు.
కానీ జగన్ తీరు చూస్తే పూర్తిగా సైలెంట్ గానే ఉంటున్నారు. దానికి కారణాలు ఏంటి అన్న దాని మీద చర్చ సాగుతోంది. అయితే తెర వెనక రాజకీయ బంధాలే జగన్ ని ఆపుతున్నాయా అన్న ఊహాజనితమైన విషయాలతో ప్రచారం కూడా సాగుతోంది. అవేంటి అంటే రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వారి మద్దతు కూడా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కావాలి.
ఒక విధంగా చూస్తే మోడీ క్యాంప్ లో వైసీపీ కూడా రెండవ వైపు ఉందని ప్రచారం కూడా సాగుతోంది. అంటే టీడీపీ కూటమి ఒక వైపు ఉంటే వైసీపీ ఇండైరెక్ట్ గా మరో వైపు మోడీతో ఉంది అని అంటున్న వారూ ఉన్నారు. ఏపీలో చూస్తే బీజేపీ కూడా కలసిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో గబుక్కున కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి జగన్ ముందుకు రావడం లేదా అన్న చర్చ సాగుతోంది.
లేదా ఇట్ ఈజ్ టూ ఎర్లీ అని ఒక స్ట్రాటజీ ప్రకారం జగన్ సైలెంట్ అయ్యారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. కొత్త ప్రభుత్వానికి కొన్నాళ్ళు సమయం ఇచ్చి ఆ మీదట జనంలోకి వెళ్ళి అపుడే విమర్శలు ఎక్కుపెట్టాలి అన్న ఆలోచనలు ఉండి ఉంటాయా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.
అయితే చంద్రబాబు అయితే 2019లో వైసీపీకి ఇంత టైం ఇవ్వలేదు. వైసీపీ అధికారంలోకి రావడమేమిటి ఆయన విమర్శల జడివాన కురిపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు. జగన్ గెలుపు గెలుపే కాదు అన్నారు. చాలా మాట్లాడారు. ప్రత్యేక హోదాను ఏపీకి తీసుకుని రాలేదని తొలి రోజుల్లోనే విమర్శలు సంధించారు.
అలా నెమ్మదిగా ఒక నెగిటివ్ టెంపోని బిల్డప్ చేస్తూ పోయారు. అది తారాస్థాయికి చేరుకుంది. మరి జగన్ అయితే సైలెంట్ గా ఉంటున్నారు. నిజానికి జగన్ చాలా విమర్శలను వదిలేశారు అని అంటున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మెజారిటీ లేదు కాబట్టి ప్రత్యేక హోదా కోసం టీడీపీ పట్టుబట్టాలీ అని ఒక కండిషన్ పెట్టి మద్దతు ఇవ్వాలీ అని జగన్ డిమాండ్ చేయవచ్చు. కానీ అది పూర్తిగా వదిలేశారు అని అంటున్నారు.
అంతే కాదు ఏపీకి కేంద్రం ఇచ్చిన శాఖల విషయంలోనూ ఆయన కామెంట్స్ చేయవచ్చు. అదీ చేయలేదు. ఏపీకి వస్తున్న మోడీ విభజన హామీలపై నోరు విప్పాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద టీడీపీ నిలదీయాలని కోరవచ్చు. అదీ కూడా చేయలేదు.
ఇలా చాలా అవకాశాలు టీడీపీ ఈ వారం రోజులూ ఇచ్చినా జగన్ ఎందుకో వాటిని అలా లైట్ తీసుకున్నారు. మరి ఇలాగే సైలెంట్ గా ఉంటే విపక్ష పాత్రను ఎలా పోషిస్తారు అని అంటున్నారు. ప్రజలు అధికారం అప్పగించింది ఒక పార్టీకి, మరో పార్టీకి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషించమని కూడా అదే తీర్పులో ఆదేశం ఉంది.
మరి దాన్ని వైసీపీ పట్టించుకోవడం లేదా అని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా విపక్షంలో ఉన్నపుడు గట్టిగా మాట్లాడాలి. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపాలి అలా చేయకపోతే పొలిటికల్ గ్రాఫ్ పెరగదు అని అంటున్నారు. మరి జగన్ ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది.
అదే టైం లో జగన్ ని ఆపుతున్నది ఎవరైనా తెర వెనక ఉన్నారా అన్నది ఊహాజనితమైన ప్రచారమే కావచ్చు కానీ అలా కూడా అనుకుంటున్నారుట. చూడాలి మరి జగన్ భవిష్యత్తు రాజకీయ పోరాటాలు టీడీపీ విషయంలో ఎలా ఉంటాయో.