Begin typing your search above and press return to search.

జగన్ ది నా రక్తమే కానీ...చెల్లెలు చెబుతోందేంటి...!?

ఇలా అన్ని విషయాలూ కలగాపులగం చేస్తూ మాట్లాడుతున్న షర్మిల వల్ల ఆమె సారధ్యం వహిస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగలేదు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 3:23 PM GMT
జగన్ ది నా రక్తమే కానీ...చెల్లెలు చెబుతోందేంటి...!?
X

అన్నా చెల్లెళ్ల మధ్య వివాదం ఉంది అని జనాలు అనుకుంటున్నారు. దానికి కారణం వైఎస్ జగన్ మీద షర్మిల ప్రతీ రోజూ ఏపీలో సభల పేరుతో చేస్తున్న ఆరోపణలే. ఆమె కుటుంబ విషయాలు చెబుతున్నారు. మధ్యలో ఆస్తుల గొడవలు తెస్తున్నారు. ఇలా అన్ని విషయాలూ కలగాపులగం చేస్తూ మాట్లాడుతున్న షర్మిల వల్ల ఆమె సారధ్యం వహిస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగలేదు అని అంటున్నారు.

దాంతో ఆమె టోన్ మార్చారు. తనకు జగన్ అంటే ద్వేషం లేదని సెంటిమెంట్ డైలాగులు వదిలారు. ఆయనది తనదీ ఒక్కటే రక్తం అన్నారు. అయితే తన అన్న పరిపాలన బాగాలేదని మాత్రమే తాను పోరాడుతున్నాను అని క్లారిటీ ఇస్తున్నారు. ఇది సిద్ధాంత బద్ధమైన పోరాటం అంటున్నారు.

విశాఖ జిల్లాలో షర్మిల పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన తండ్రి వైఎస్సార్ ఆశయాలను జగన్ నిలబెట్టడం లేదని ద్వజమెత్తారు. ఆయన బీజేపీతో తెర వెనక పొత్తులు కుదుర్చుకుంటున్నారు అని మండిపడ్డారు.

జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో భేటీలు వేశారు అని అన్నారు. ఎన్నికల ముందు జాతీయ పార్టీతో తెర వెనక అవగాహనకు రావడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నదే ఆయన ఉద్దేశ్యం అని హాట్ కామెంట్స్ చేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని జగన్ కలిశారు అని అన్నారు.

ఏపీలో చూస్తే బీజేపీకి ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, కానీ ట్రయాంగిల్ లవ్ మాత్రం ఏపీలో సాగుతోందని అన్నారు. అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం రెండూ కూడా బీజేపీతో కలసి నడవాలని చూడడం విడ్డూరం అన్నారు. బీజేపీ నేతల దగ్గర వరసగా ఏపీ నేతలు క్యూ కట్టడం ఏంటని ఆమె మండిపడ్డారు

ఏపీ ప్రజలు చూస్తే అంతకు ముందు ఐదేళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత ఐదేళ్లు జగన్ వైపు మొగ్గు చూపారని, అయితే వారిద్దరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విజయం సాధించలేదని షర్మిల విమర్శిస్తున్నరు. అలాగే ఈ ఇద్దరు నేతలు, రెండు పార్టీలు కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు ఏపీకి రాజధాని నిర్మాణంలో కూడా విఫలమయ్యారని ఆమె మండిపడ్డారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు వైసీపీ టీడీపీ ఏపీకి మేలు చేయని పార్టీలు అని షర్మిల విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే జగన్ అంటే వ్యక్తిగత ద్వేషం లేదని షర్మిల చెప్పడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది అంటున్నారు.

ఆమె సొంత అన్నకు 2019 ఎన్నికల ముందు ప్రచారం చేసి వైసీపీ గెలవాలని కోరుకుంది. ఈ మధ్య కాలంలో ఏమి జరిగిందో ఆమె అటు నుంచి ఇటు వచ్చి వైసీపీకి ప్రత్యర్ధిగా మారిపోయారు. మరి ఏపీ ప్రజల కోసం అయితే వైసీపీ అయిదేళ్ల పాలన ముగిసేవరకూ ఆమె ఏపీకి ఎందుకు రాలేదు ఎందుకు పోరాడలేదు అన్న ప్రశ్నలు జనాల నుంచి వస్తున్నాయి. మొదట తెలంగాణాలో పార్టీ పెట్టి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని మూసేసి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ ఎన్నికల ముందు వచ్చి ప్రజల కోసం అంటే నమ్మే జనాలు ఉన్నారా అని అంటున్నారు.