Begin typing your search above and press return to search.

రాహుల్ కి జగన్ కి మధ్యలో !?

దేశానికి ఏదో నాటికి ప్రధాని కావాలని గాంధీ వంశంలో ఐదవ తరం వారసుడు రాహుల్ గాంధీ గట్టి పట్టుదలగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   27 July 2024 3:47 AM GMT
రాహుల్ కి జగన్ కి మధ్యలో !?
X

దేశానికి ఏదో నాటికి ప్రధాని కావాలని గాంధీ వంశంలో ఐదవ తరం వారసుడు రాహుల్ గాంధీ గట్టి పట్టుదలగా ఉన్నారు. ఆయన సునాయాసంగా వచ్చిన ప్రధాని పదవిని 2009లో వదిలేసుకున్నారు. అదే పదవి కోసం గత పదేళ్లుగా ఆయాసపడుతూ పోరాడుతున్నారు. 2014 కంటే 2019 బెటర్ పెర్ఫార్మెన్స్ తో 2024లో ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ తో కాంగ్రెస్ పార్టీ ఉంది, నాయకుడిగా రాహుల్ కూడా బెటర్ అనిపించుకుంటున్నారు.

అయినా సరే అధికారం అన్నది అందని పండుగానే ఉంది. ఇదిలా ఉంటే దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నుంచి వేరుపడి పుట్టినవే. అలాగే మరి కొన్ని పార్టీలు 1977లో ఏర్పడిన జనతా అనే తానులో ముక్కలుగా ఈ రోజుకీ మిగిలి అస్థిత్వాన్ని చాటుకుంటున్నాయి. తెలుగుదేశంతో పాటు డీఎంకే తెలంగాణా రాష్ట్ర సమితి వంటి ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యల ప్రాతిపదికగా అజెండాను రూపకల్పన చేసుకుని ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా మనగలుతున్నాయి.

మరో వైపు చూస్తే కాంగ్రెస్ తో విభేదించి ఏర్పాటు చేసుకున్న ప్రాంతీయ పార్టీలలో కొన్ని తమ సత్తాను చాటుకుంటూ వస్తున్నాయి. అలా మహారాష్ట్రలో దిగ్గజ నేత శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అదే విధంగా పశ్చిమ బెంగాళ్ లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ని స్థాపించారు. ఏపీలో వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

ఈ ముగ్గురూ కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే కావడం విశేషం. శరద్ పవార్ అయితే సోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నించి 1998 ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అలాగే సోనియాగాంధీతో పెట్టుకునే మమత కొత్త పార్టీని ఏర్పాటు చేసారు జగన్ కూడా తన తండ్రి వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ తో విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు.

ఇందులో చూస్తే మమతా బెనర్జీ బెంగాల్ లో మొత్తం రాజకీయ స్పేస్ ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ని చిన్న పార్టీగా చేసేశారు. మహారాష్ట్రలో మొత్తం ఎన్సీపీ కాకపోయినా తన ప్రభావం చాటుకుంటూ శరద్ పవార్ ఉన్నారు. వైసీపీ ఏపీలో కాంగ్రెస్ ని తుడిచిపెట్టి ఆ ప్లేస్ లో ఎదిగింది.

ఇక్కడ చిత్రం ఏమిటి అంటే శరద్ పవార్ సోనియాను విభేదించినా మళ్లీ యూపీయే జట్టులో కలిసి కేంద్ర మంత్రి అయ్యారు. మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా నాటి కాంగ్రెస్ కూటమిలో ఉంటోంది. జగన్ విషయంలోనే అది జరగడం లేదు. దానికి జగన్ వైపు నుంచి కాంగ్రెస్ ని ఈ రోజుకీ శత్రువులా చూడడమే అని అంటున్నారు.

మరో వైపు చూస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. అది గుర్తెరిగిన చంద్రబాబు 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణా ఎన్నికల్లో పోటీకి దిగారు. ఫలితం ఎలా ఉన్నా ఆయన రాజకీయ పంధా అలా సాగింది. దానికి భిన్నంగా జగన్ కాంగ్రెస్ మూలాల నుంచి ఏర్పాటు చేసిన వైసీపీని బీజేపీకి చేరువ చేసే ప్రయత్నం చేశారు అని విమర్శలు ఉన్నాయి.

బీజేపీ భావజాలానికి వైసీపీ మూల భావజాలానికి ఎక్కడా పొసగదు. దాంతోనే 2024 ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు కూడా వైసీపీకి దూరం అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో జగన్ కాంగ్రెస్ తో బంధం పెనవేసుకోవడానికి ఏ మేరకు ప్రయత్నాలు చేసారో తెలియదు. అదే టైంలో కాంగ్రెస్ కూడా ఏపీ మీద ఇపుడు ఫోకస్ ఎక్కువగా పెడుతోంది.

తాము వైసీపీ వల్ల నష్టపోయాం కాబట్టి ఆ పార్టీని లేకుండా చేస్తేనే కాంగ్రెస్ ని మనుగడ అన్న ఆలోచనలతో కాంగ్రెస్ ఉంది. ఏపీలో కాంగ్రెస్ కి వైసీపీ తో ఎంతవరకూ రాజకీయ బంధాలు అవసరం అన్నది ఈ రోజుకు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే తామే ఏపీలో కూటమికి ఆల్టర్నేషన్ గా ఉండాలని చూస్తోంది. పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమించడం వెనక జగన్ తో ఘర్షణ తప్ప సయోధ్య కాదని కాంగ్రెస్ చెప్పకనే చెప్పినట్లు అయింది అంటున్నారు.

మరో వైపు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నాయకులు ఎపుడూ జగన్ కి రాజకీయంగా ప్రత్యర్థులే. దాంతో పాటు కాంగ్రెస్ లో చేరి సీఎం గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా జగన్ కి యాంటీగానే ఉంటారని అంటారు. దాంతో కాంగ్రెస్ తో వైసీపీ పొత్తులు కలపాలని చూసినా ఆ మేరకు సానుకూలత అయితే లేకుండా పోతోందని అంటున్నారు.

జగన్ మీడియా సమావేశంలో దీని మీదనే మాట్లాడుతూ కాంగ్రెస్ తో చంద్రబాబు టచ్ లో ఉన్నారని హాట్ కామెంట్స్ చేసారు. ఇక జగన్ తానుగా తగ్గి వస్తే కాంగ్రెస్ ఏమైనా ఆలోచన చేస్తుందేమో కానీ లేకపోతే ఏపీలో తనకు ఉన్న ప్లాన్స్ ని అమలు చేస్తూ వైసీపీని దూరం పెట్టే దిశగానే సాగుతుంది అని అంటున్నారు. మహారాష్ట్ర బెంగాల్ లలో కాంగ్రెస్ వట్టిపోయింది కానీ ఏపీలో ఇంకా అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.దానికి తోడు జగన్ వీక్ అయ్యారని కూడా ఊహిస్తోంది. ఇక రాహుల్ కి జగన్ కి మధ్య ఏముంది అంటే పొలిటికల్ గా ఇగోలు ఉంటాయనే అంటున్నారు. వాటిని మరింత పెంచి పబ్బం గడుపుకునే పార్టీలూ ఉంటాయి.

ఇండియా కూటమిలో జగన్ చేరకుండా చేస్తూ 2029 ఎన్నికల నాటికి తెలుగుదేశమే ఈ వైపునకు మొగ్గుతూ వన్ షాట్ టూ బర్డ్స్ లాగ మరోసారి ఏపీలో కేంద్రంలో అధికారం అందుకోవడంతో పాటు వైసీపీని వాషౌట్ చేసే ఎత్తుగడలకు పదును పెట్టకుండా ఉంటుందని ఎలా అనుకోగలరు అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి ఇండియా కూటమిలోకి జగన్ వెళ్తారా అంటే ఈ ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.