సార్ ఎలా ఉన్నారు.. కేసీఆర్ కు జగన్ పరామర్శ!
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు
By: Tupaki Desk | 4 Jan 2024 7:27 AM GMTతెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జనవరి 4న ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన జగన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ తరఫున స్వాగతం పలికారు.
బేగంపేట నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో నివాసం ఉంటున్న కేసీఆర్ వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ఆయనను పరామర్శించారు. కేసీఆర్ నివాసంలో జగన్ కు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జగన్ కు స్వాగతం పలికి లోపలకు తీసుకెళ్లారు. సీఎం జగన్ కేసీఆర్ కు పుష్పగుచ్చం అందించారు. ‘ఎలా ఉన్నారు సార్.. ఆరోగ్యం ఎలా ఉంది’ అని అడిగి తెలుసుకున్నారు.
కాగా గత నెలలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జారిపడటంతో ఆయన తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలోనే కేసీఆర్ చికిత్స తీసుకున్నారు. డిసెంబర్ 15న బంజారాహిల్స్ నందినగర్ లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. అక్కడే కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు పార్టీల నేతలు, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పరామర్శించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. ఆయనతోపాటు వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు.
కాగా తెలంగాణ భవన్ లో బుధవారం లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ నియోజకవర్గాల సమీక్ష ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమీక్షలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఈ నెలాఖరుకు ప్రజాక్షేత్రంలోకి వస్తారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తారని వెల్లడించారు. తెలంగాణ భవన్ నుంచి కూడా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు.
అయితే కేసీఆర్‌ను జగన్ మర్యాదపూర్వకంగానే కలిశారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. వారి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయి అన్నది తెలియాల్సి ఉంది.