Begin typing your search above and press return to search.

జగన్‌ నిర్వేదం.. వెళ్లేవారు వెళ్లనీ.. పోయేవారు పోనీ!

ఈ నేపథ్యంలో తాజాగా తనను కలిసిన కొంత మంది నేతలతో వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారని టాక్‌ నడుస్తోంది. పార్టీలో ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారని చెప్పినట్టు తెలిసింది.

By:  Tupaki Desk   |   4 July 2024 8:03 AM GMT
జగన్‌ నిర్వేదం.. వెళ్లేవారు వెళ్లనీ.. పోయేవారు పోనీ!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. వై నాట్‌ 175 అని చివరకు 11 స్థానాలకే పతనమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలతో గత కొద్ది రోజులుగా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా తనను కలిసిన కొంత మంది నేతలతో వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారని టాక్‌ నడుస్తోంది. పార్టీలో ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారని చెప్పినట్టు తెలిసింది. మొదట్లో వైసీపీని మొదలుపెట్టినప్పుడు తాను, తన తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నామని జగన్‌ గుర్తు చేశారట. తాను, తన తల్లితో మొదలైన పార్టీని ఇక్కడ వరకు తీసుకొచ్చామని జగన్‌ పార్టీ నేతలతో చెప్పారని తెలుస్తోంది.

ఇప్పుడు ఎవరైనా పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లినా తనకొచ్చే ఇబ్బంది ఏమీ లేదని.. మళ్లీ పార్టీని మొదటి నుంచి పునర్నిర్మిస్తానని చెప్పినట్టు తెలిసింది. విలువలు, విశ్వసనీయత, నైతికత ఉన్నవారు పార్టీలో ఉంటారని.. ఇవి లేనివారు వేరే పార్టీల్లోకి పోతారని జగన్‌ వ్యాఖ్యానించారట.

వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం అది వారిష్టమని జగన్‌ తనను కలిసిన నేతలతో చెప్పారని సమాచారం. ముఖ్యంగా శాసనమండలిలో వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్సీలు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్‌ తనను కలిసిన పార్టీ నేతలతో ఈ వ్యాఖ్యలు చే సినట్టు సమాచారం.

చంద్రబాబు ఎన్నికలలో గెలవడానికి చాలా హామీలు ఇచ్చారని.. వాటిని ఆయన ఎలా అమలు చేస్తారో చూద్దామని జగన్‌ అన్నట్టు సమాచారం. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెలా ఇస్తానన్న ఆర్థిక సాయం ఎంతవరకు చేయగలరో చూద్దామన్నట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇద్దామని.. హామీలను అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని జగన్‌ అన్నట్టు తెలిసింది.

మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని.. అప్పటివరకు నేతలు ఓపికగా ఎదురుచూడాలని జగన్‌ చెప్పినట్టు సమాచారం. గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి పోయారని.. వారిలో ఎంతమంది ఇప్పుడు అధికారంలో ఉన్నారని జగన్‌ అన్నట్టు తెలిసింది. ఇలా అటూఇటూ పార్టీలు మారేవారు ఎటూ కాకుండా పోతారు.. ఎవరిష్టం వారిదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.

మండలిలో వైసీపీకి బలం ఉంది కాబట్టి.. కొంతమంది ఎమ్మెల్సీలకు తమ పార్టీలో చేరాలని టీడీపీ నేతల నుంచి ఫోన్లు వచ్చి ఉంటాయని జగన్‌ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ క్రమంలో కొందరు టీడీపీలోకి వెళ్లొచ్చని.. అయితే విలువలు, నైతికత ఉన్నవారే రాజకీయాల్లో మనగలరని ఆయన చెప్పినట్టు సమాచారం.