Begin typing your search above and press return to search.

2024 ఫలితాలు జగన్ లో తెచ్చిన తొలిమార్పు ఇదేనా?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్... తాజాగా ఎదురైన ఘోర ఓటమి అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 12:30 PM GMT
2024 ఫలితాలు జగన్  లో తెచ్చిన తొలిమార్పు ఇదేనా?
X

జీవితంలో జరిగే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా మనిషిలో సరికొత్త మార్పుకు నాంది పలుకుతాయని అంటారు. జరిగింది చేదు జ్ఞాపకం అయినప్పటికీ.. అది తీపి మార్పుకు నాంది పలికితే కచ్చితంగా స్వాగతించొచ్చు. అయితే... అది ఎంతకాలం ఉంటుంది.. నిజమైన మార్పేనా అనే సందేహాలు కొన్ని రోజులు ఉన్నప్పటికీ.. ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సదరు అధినేతపై ఉంటుంది.

అవును... ఇంతకాలం కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో లేరని.. వారికి కూడా కలిసే అవకాశమే ఉండేది కాదనే విమర్శలు ఎదుర్కొన్న ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్... తాజాగా ఎదురైన ఘోర ఓటమి అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... శనివారం (జూన్ 22) ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా... వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరితోనూ భేటీ కానున్నారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్ కు పోటీ చేసిన అభ్యర్థులను ఆహ్వానించారు. వీరీందరితోనూ జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించనున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్ పూర్తిగా పరదాలకు పరిమితం అయిపోయారనే కామెంట్లు వినిపించాయి. ప్రజల సంగతి దేవుడెరుగు.. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అనే కామెంట్లు వినిపించేవి. పలు సందర్భాల్లో మంత్రులకు సైతం చేదు అనుభవాలు ఎదురైన పరిస్థితి.

కట్ చేస్తే.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జగన్ & కో కి జీవితానికి సరిపడా షాకిచ్చాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కారణం ఏమైనప్పటికీ... జగన్ తన పార్టీ నేతలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా... క్షేత్రస్థాయిలో వైసీపీ సర్కార్ గురించి జనాలు ఏమనుకుంటున్నారు.. ఈ ఘోర ఓటమికి సర్వే సంస్థల నుంచి కాకుండా, స్థానిక నేతల నుంచి సమాచారం తెలుసుకోవాలని భావిస్తున్నారంట.

దీంతో... ఈ పనేదో కనీసం ఎన్నికలకు ఏడాది ముందు నుంచి చేసినా ఈ పరిస్థితి వచ్చేది కాదుగా జగన్ అని పలువురు వైసీపీ నేతలు చెవులుకొరుక్కుంటున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... 2024 ఎన్నికల ఫలితాలు జగన్ లో ఇంత పెను మార్పు తీసుకొస్తాయని అనుకోలేదు... థ్యాంక్యూ ఏపీ పీపుల్ అని మరికొంతమంది ప్రస్ట్రేటెడ్ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.

ఏది ఏమైనా... ఈ మార్పు మంచిదే అనేది ఫైనల్ మాటంట! అయితే... ఈ మార్పు ఎప్పటికీ ఉండాలనేది కోరికని తెలుస్తుంది.