నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల విషయంలో జగన్ కీలక నిర్ణయం!
ఇందులో భాగంగా... మాజీమంత్రి జోగి రమేష్ ను తిరిగి మైలవరం ఇన్ ఛార్జ్ గా నియమిస్తూ జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 7 July 2024 4:27 AM GMTఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జగన్ కరెక్షన్స్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు సుమారు 81 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మార్చిన జగన్ కు ఆ అనుభవం ఓ భారీ చేదు జ్ఞాపకంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మార్చారని అంటున్నారు!
అవును... సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జగన్ పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో ఎన్నికల ఇన్ ఛార్జ్ లను మారుస్తూ ఓ ప్రయోగం చేశారు. అది కాస్తా దారుణంగా విఫలమైంది! ఈ నేపథ్యంలో ఆ పొరపాట్లను సరిదిద్దుకునే చర్యలకు ఉపక్రమించారని తెలుస్తుంది.
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో జగన్ సుమారు 81 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు మార్చారు! దీంతోపాటు కేడర్ కు, నేతలకూ సైతం జగన్ దూరంగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై గట్టిగా పడిందని అంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం జగన్.. నేతలను కలుస్తున్నారు.. కేడర్ తో మమేకమవుతున్నారు. అధికార పార్టీ నేతల దాడుల్లో గాయపడినవారిని పరామర్శిస్తున్నారు.
ఇదే సమయంలో నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లనూ మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... మాజీమంత్రి జోగి రమేష్ ను తిరిగి మైలవరం ఇన్ ఛార్జ్ గా నియమిస్తూ జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీలో చేరారు. ఆ సమయంలో జోగి రమేష్ ను పెనమలూరు నుంచి బరిలోకి దింపారు.
అయితే అనూహ్యంగా రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రెండు నియోజకవర్గాల్లోనూ జగన్ మార్పులు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా... జోగి రమేష్ ను మైలవరం ఇన్ ఛార్జ్ గా నియమించిన జగన్... పెనమలూరు ఇన్ ఛార్జ్ గా దేవభక్తుని చక్రవర్తికి బాధ్యతలు ఖరారు చేశారు. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు కన్ఫాం అని చెబుతున్నారు.