పిఠాపురం విషయంలో జగన్ మరో కీలక నిర్ణయం... ఈసారి సిట్టింగ్ వంతు!
ఈ క్రమంలోనే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది.
By: Tupaki Desk | 21 March 2024 12:46 PM GMTఅభ్యర్థుల ఎంపికలో జగన్ గతంలో ఎన్నడూ లేనంతగా మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లోక్ సభ, శాసన సభకు కలిపి సుమారు 99 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో అసంతృప్తులను బుజ్జగించే విషయంలో జగన్ ఏమాత్రం లైట్ తీసుకోవడం లేదు! అసంతృప్తులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది.
అవును... ఈ దఫా పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో వచ్చిన ఫలితాలు ఈసారి రానివ్వకూడదని, ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ గేటు తాకాలని పవన్ బలంగా ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో... ఈసారి కూడా ఓడించి పవన్ పొలిటికల్ ఫ్యూచర్ కి శుభం కార్డు వేయాలని వైసీపీ అదేస్థాయిలో ఫిక్సయ్యిందని అంటున్నారు! దీంతో... ఇప్పుడు రాష్ట్రంలోని హాట్ సీట్లలో పిఠాపురం టాప్ ప్లేస్ లో ఉందనే చెప్పాలి!
వాస్తవానికి గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అభ్యర్థి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మపై 14,992 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పుల్లో భాగంగా ఈసారి పెండెం దొరబాబును ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీతను రంగంలోకి దింపారు. ఈ సమయంలో పెండెం దొరబాబు నుంచి వ్యతిరేకత రాకుండా వైసీపీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అసమ్మతి వినిపించకుండా, అసంతృప్తి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన తాడేపల్లికి బయలుదేరారు!
ఈ సమయంలో భేటీలో భాగంగా... వంగ గీత గెలుపుకు సహకరించేలా పెండెం దొరబాబుకు జగన్ సూచించనున్నారని తెలుస్తుంది. ప్రధానంగా పవన్ పై గెలుపు విషయంలో పార్టీ నేతలంతా ఒకేమాటపై ఉండాలని చెప్పబోతున్నారని సమాచారం! దీంతో.. పెండెం దొరబాబు కూల్ అయ్యే అవకాశం ఉందని.. ఈ సమయంలో ఆయన కూడా మనసుపెట్టి గీత కోసం పనిచేస్తే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని అంటున్నారు!