Begin typing your search above and press return to search.

లేఖ రాసే ముందు పాత వీడియోలు చూడాల్సింది జగన్!

మనం ఎప్పుడు ఏం అనుకుంటే అదే జరగాలనుకోవటం మన వరకు బాగానే ఉంటుంది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 4:05 AM GMT
లేఖ రాసే ముందు పాత వీడియోలు చూడాల్సింది జగన్!
X

మనం ఎప్పుడు ఏం అనుకుంటే అదే జరగాలనుకోవటం మన వరకు బాగానే ఉంటుంది. ఒక సాదాసీదా వ్యక్తి అనుకుంటే ఫర్లేదు. ఐదేళ్లు ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉపనిషత్తులు.. సుద్దులు చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి పవర్ ఫుల్ అధినేతకు అలాంటివి కుదరదు. ఎందుకంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు తర్వాతి రోజుల్లో ఆయన మాట్లాడే మాటలకు రిఫరెన్సు అవుతుంటాయి. అవసరానికి అనుగుణంగా మాటలు మార్చే విషయంలో జగన్ కున్న టాలెంట్ ఈ మధ్యన పాత వీడియోల రూపంలో తరచూ బయటకు వస్తోంది.

ప్రధానప్రతిపక్ష హోదా అన్న అంశంపై జగన్ ఫోకస్ పెట్టిన వైనం తాజాగా ఆయన స్పీకర్ కు రాసిన లేఖను చూసినప్పుడు అర్థమవుతుంది. సుదీర్ఘంగా లేఖ రాసిన ఆయన.. పలు అంశాల్ని ప్రస్తావించారు. చూస్తుంటే.. జగన్ రీసెర్చ్ టీం బాగానే వర్కవుట్ చేసినట్లు కనిపిస్తోంది. కాకుంటే.. వారు మిస్ అయిన లాజిక్ ఏమంటే.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత లేఖ రాయటం.

ఎన్నికల ఫలితాలు వెలువడి అసెంబ్లీలో వైసీపీ బలం 11 ఎమ్మెల్యేలకు పరిమితమైన వేళ.. ప్రధానప్రతిపక్ష హోదాకు అవసరమైన విధివిధానాలేంటి? అన్నవిషయాన్ని ప్రభుత్వం కొలువు తీరటానికి ముందే చర్చకు పెట్టి ఉంటే బాగుండేది. కానీ.. అదేమీ చేయకుండా ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత.. తాను విశ్రాంతి తీసుకునే వేళలో సావధానంగా లేఖ రాయటం ఒక ఇబ్బంది అయితే.. ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో తాను చేసిన వ్యాఖ్యలను మర్చిపోవటం కూడా మైనస్సే.

23 మంది ఎమ్మెల్యేలు ఉన్న వేళలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపిని.. దాని అధినాయకుడ్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చట్టం ఏం చెబుతోంది? రూల్ బుక్ ఏం మాట్లాడుతుంది? లాంటి అంశాలు ఇప్పుడు గుర్తుకు వచ్చినట్లే.. సీఎం హోదాలో సభలో మాట్లాడేటప్పుడు కూడా ఉండాలి కదా? గతంలో అయితే మాట మార్చినప్పుడు.. దానికి సంబంధించిన పాత వ్యాఖ్యల రికార్డుల్ని చూపించటం కష్టంగా ఉండేది. ఈ డిజిటల్ ప్రపంచంలో క్లిక్ దూరం సమస్త సమాచారం అందుబాటులో ఉన్న వేళ.. గతంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉండే బలం.. ఆ బలం గురించి తాను మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకొని ఉంటే.. ఈ లేఖతో అభాసుపాలయ్యే ఛాన్సు మిస్ అయ్యే వారేమో.

జగన్ అంటే సవాలచ్చ పనుల్లో బిజీగా ఉండొచ్చు. కానీ.. స్పీకర్ కు తాజాగా రాసిన ఆయన టీం సభ్యులైనా సరే.. పాత వీడియోల గురించి ఒక లుక్ వేయాలి కదా? ఒకవేళ వారు ఆ పని చేయనప్పుడు జగన్ సైతం పాత వీడియోల్ని చెక్ చేసి.. నవ్వులుపాలు కాకుండా ఉండేలా డ్రాప్టు చేయమని చెప్పి ఉండాల్సింది. అదేమీ లేకుండా ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా తనకు అవకాశం చిక్కిన ప్రతిసారీ తనదైన వాదనను వినిపిస్తూ మాట్లాడే మాటలతో మరింత పలుచన అవుతానన్న చిన్న విషయాన్ని జగన్ మర్చిపోవటం ఏమిటి?

తమకు అనువైన వాదనను తమ సొంత మీడియా సంస్థలో వినిపించుకోవచ్చు. తప్పేం కాదు. రాజకీయ అంశాల్లో ఇలాంటివి వర్కువుట్ అవుతుంటాయి. కానీ.. ఒక స్పీకర్ కు లేఖ రాసేటప్పుడు.. అది కూడా రూల్ పొజిషన్ గురించి ప్రస్తావించేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఎందుకుంటే.. జగన్ లేఖ నేపథ్యంలో సభలో ప్రతిపక్ష హోదాకు సంబంధించిన రూల్ పొజిషన్ స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడున్నపరిస్థితుల్లో అయ్యో.. ప్రతిపక్షంలో ఉన్న జగన్ ను ఎంతలా టార్గెట్ చేశారన్న సానుభూతి కలిగేలా ఉండాలి. అంతే తప్పించి.. అధికార పక్షాన్ని అడ్డగోలు వాదనలతో ఇరుకున పెట్టేలా చేస్తున్నారన్న ఇమేజ్ అస్సలు మంచిది కాదు. అందునా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు.. అందులో తాను సీఎం హోదాలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల్ని జగన్ ఒకసారి చూసుకుంటే మంచిది. ఎందుకంటే అందరికి అన్నిఅందుబాటులో ఉన్న వేళ.. తాను రాసిన లేఖ లోని విషయాలు తన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తాయన్న ఆలోచన కూడా చేయకపోవటం దేనికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి?