Begin typing your search above and press return to search.

పిల్లి వారసుడికి లైన్ క్లియర్ చేసిన జగన్...!

తూర్పు గోదావారి జిల్లాకు చెందిన సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వారసుడికి జగన్ లైన్ క్లియర్ చేశారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 3:37 AM GMT
పిల్లి వారసుడికి లైన్ క్లియర్ చేసిన జగన్...!
X

తూర్పు గోదావారి జిల్లాకు చెందిన సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వారసుడికి జగన్ లైన్ క్లియర్ చేశారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఎంత దాకానైనా వెళ్తాను అంటూ కొద్ది నెలల క్రితం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేయాల్సిన రచ్చ అంతా చేసిన మాజీ మంత్రి పిల్లికి పుత్రోత్సాహం కలిగేలా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాను అనేక సార్లు ప్రాతినిధ్యం వహించిన రామచంద్రాపురం టికెట్ ని పిల్లి కుమారుడికి ఎట్టకేలకు ఇప్పించుకోగలిగారు అని అంటున్నారు. పిల్లి కుమారుడు సూర్యప్రకాష్ కి 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా టికెట్ ని జగన్ కన్ ఫర్మ్ చేశారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కూడా అయిన చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణని సైతం స్థాన చలనం కలిగించేలా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ చాణక్యం ఇపుడు రామచంద్రాపురంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. మంత్రి వేణు కూడా ఒకనాడు బోస్ కి శిష్యుడే. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. అయితే 2019 ఎన్నికల్లో వేణు విజయానికి సహకరించిన బోస్ ఆ తరువాత మాత్రం ఎందుకో గ్యాప్ తో దూరం జరిగారు.

దానికి కారణాలు ఏమైనా ఇద్దరూ మాత్రం ఎడముఖం పెడముఖం అయ్యారు. బోస్ కి పట్టున్న సీటు రామచంద్రాపురం. పైగా ఆయన పక్కా లోకల్. ఇక ఎంపీ సీటు తీసుకుని బోస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా తన కుమారుడికి టికెట్ కావాలని సరైన టైం లో పావులు కదిపారు. దాంతో జగన్ సైతం ఆయన మాటను మన్నించారు. అలా జగన్ వద్ద తన పలుకుబడి ఎక్కడా తగ్గలేదని గట్టిగా నిరూపించుకున్నారు బోస్ అని అంటున్నారు.

అదే టైం లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణకు రాజమండ్రి రూరల్ టికెట్ ని కేటాయించారు. ఆయన కూడా జగన్ మాటకు తల ఒగ్గి తాను అక్కడ నుంచి పోటీకి సిద్ధం అని చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే పిల్లి తన పొలిటికల్ స్టామినా తగ్గలేదని కూడా నిరూపించుకున్నారు అని అంటున్నారు. దాంతో పాటు ఇంటలిజెన్స్ సర్వేలు ఇతరత్రా సర్వేలు అన్నీ పరిగణనలోకి తీసుకున్న జగన్ పిల్లి కొడుక్కి టికెట్ ని ఫైనల్ చేశారు అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పిల్లి మీద ఉంది. ఆయనకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా సహకరిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా గురు శిష్యులుగా చెప్పుకునే పిల్లి వేణుల మధ్యల జరిగిన రాజకీయ యుద్ధంలో పిల్లి గెలిచారు అని అంటున్నారు.