Begin typing your search above and press return to search.

జగన్ ఓవర్ స్మార్ట్ తోనే ఓడిపోయారా ?

జగన్ ఓవర్ స్మార్ట్ తోనే ఓడిపోయారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 11:11 AM GMT
జగన్ ఓవర్ స్మార్ట్ తోనే ఓడిపోయారా ?
X

జగన్ ఓవర్ స్మార్ట్ తోనే ఓడిపోయారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవి ఏమిటి అన్నది చూస్తే కనుక ఎన్నికలకు ముందు మద్య పాన నిషేషం అని జగన్ ప్రకటించారు. దాని కంటే ముందు ఊరూరా పాదయాత్ర చేసినపుడు కూడా ఇదే మాట అన్నారు.

మందు రేట్లు బాగా పెంచేసి మెల్లగా జనాలను మందుకు దూరం చేస్తామని కూడా జగన్ హామీ ఇచ్చారు. దాంతో జనాలు నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను పెట్టారు. వాటి ఈక్విటీ తీసుకుని 30 ఏళ్ళకు ఇంత రావచ్చు అని ఒక అంచనా వేసి దాని మీద పెద్ద ఎత్తున ఏపీకి అప్పు తెచ్చారు.

అదే సమయంలో ఏపీలో ఉన్న బ్రాండెడ్ మద్యాన్ని చాలా వరకూ తగ్గించి తాను అనుకున్న బ్రాండ్లను జగన్ ప్రవేశపెట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారం చేస్తున్నపుడు ఎక్కడా జనాల నాడిని అయితే ఆయన కనీసంగా కనిపెట్టలేకపోయారని అంటున్నారు.

ఇలా మద్యం మీద చేసిన విన్యాసాలతో ఏకంగా మహిళలతో పాటు మద్యం ప్రియులు అంతా కూడా రివర్స్ అయ్యారు. మద్య పాన నిషేధం అని చెప్పి దానిని కొనసాగించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే టైం లో తమకు అనుకూలమైన బ్రాండ్లను ఇవ్వకుండా రేట్లు పెంచేసి నాసి రకం మందును అమ్మడంతో మద్యం ప్రియులు ప్రభుత్వం మీద కసి పెంచుకున్నారు.

ఇలా చూస్తే కనుక ఏకంగా 20 శాతం మంది జగన్ ప్రభుత్వం మీద అసమ్మతితో దూరం అయ్యారు. అదే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించింది అని అంటున్నారు. వారంతా కూడా కూటమి ప్రభుత్వానికి జై కొట్టడానికి మద్యం విషయంలో ప్రభుత్వ పాలసీ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం అయింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఇసుక పాలసీ కూడా జగన్ ఏలుబడిలో బెడిసికొట్టింది అన్నది కఠినమైన విశ్లేషణగా ఉంది. ప్రజలకు ఇసుక సమస్యను దూరం చేస్తారని భావించారు. కానీ దానినే బిజినెస్ గా వైసీపీ మనుషులే మార్చుకునేలా పాలసీ ఉందని అంటున్నారు. ఇసుక విషయంలో బంగారం కంటే ఎక్కువగా చేసి కార్పోరేట్ బిజినెస్ గా మార్చేశారు అని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.

ఆఖరుకు భవన నిర్మాణ కార్మికులు సైతం పని దొరకక పస్తులు ఉండే పరిస్థితి జగన్ గద్దెనెక్కిన తొలి ఆరు నెలలలోనే జరిగింది. అయినా దాని మీద కనీసంగా ఆలోచించకుండా అలాగే ముందుకు పోయారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పేదరికం తో బాధపడే వారు అంతా తన జీవిత కాలం కల అయిన సొంతింటి ముచ్చటను నెరవేర్చుకోలేకపోయారు అన్నది నిజమైంది. ఇలా ఇసుక పాలసీ వల్ల పేదలు మధ్యతరగతి వర్గాలు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

మరో వైపు చూస్తే పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఏపీ ప్రజలకు ఒక అద్భుతమైన కల. దానిని సాకారం చేస్తారని ఎవరైనా చూస్తారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుని కట్టకపోగా రివర్స్ టెండరింగ్ పేరుతో ముందుకు పోయింది. అలాగే అనేక సాగు నీటి ప్రాజెక్టులకే కాదు ఇతర కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఉన్న కాంట్రాక్టర్లను మార్చేసుకుంటూ పోయారు.

ఇలా రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టుకు ధనం వేస్ట్ కాకుండా ఎంతో సేవ్ చేశమని చెప్పుకోవడం తప్ప ఆయా ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నది కూడా గత ప్రభుత్వం మీద ఘాటు విమర్శగా ఉంది. ఆఖరుకు ఎంతదాకా వ్యవహారం వెళ్ళింది అంటే ప్రాజెక్టుల మెయింటెయినెన్స్ కూడా నిధులు ఇవ్వని పరిస్థితి ఉంది. ఇక అయిదేళ్ళ పాలనలో ఒక్క ఎకరాకు నీరు లేకుండా చేశారు అని రైతులు గగ్గోలు పెట్టడం కూడా వైసీపీ ప్రభుత్వం పతనానికి కారణం అని అంటున్నారు.

వీటికి తోడు జగన్ చెప్పుకునే సంక్షేమం కూడా సీరియస్ నెస్ లేకుండా పోయింది. అర్హులకు కాకుండా అనర్హులకు అలాగే అడగని వారికి సైతం ఓటు బ్యాంకు రాజకీయంతో పధకాలు అమలు చేసి నేరుగా బటన్ నొక్కి వారి ఇంటికే నగదును అందచేయడం వల్ల అంతా పుచ్చుకున్నారు. కానీ వారికి ఇదంతా అక్కర కంటే కూడా సర్కార్ ఇస్తోంది కదా తీసుకుందామన్న ధోరణి మాత్రమే కనిపించింది.

దాంతోనే వారు పధకాలు తీసుకున్నారు. ఓట్ల దగ్గరకు వచ్చేసరికి తన నిర్ణయాన్ని చెప్పి వైసీపీని ఓడించారు అని అంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ పేరుతో కొత్త దాన్ని తెచ్చి స్విగ్గి మోడల్ లో పధకాలను ఇంటికి అందించడం కూడా అతి చేసింది అని అంటున్నారు. ప్రతీ వారూ తమ ఇంటికి వాలంటీర్ల సేవలు కోరుకోలేదనే అర్ధం అవుతోంది. వృద్ధుల వరకూ పెన్షన్ ఇవ్వడం బాగానే ఉన్నా మిగిలిన వారికి మాత్రం వాలంటీర్లేంటి బాబూ మధ్యలో అని జనాలు అనుకునే నేపథ్యం ఉంది.

ఇక ఏపీ కేబినెట్ లో ఆర్ధిక మంత్రి అన్నది చాలా బరువైన పదవి. ఎంతో బాధ్యత కలిగిన పదవి. అలాంటి ఆర్ధిక మంత్రిని ఢిల్లీలోనే ఉంచి నెల మొత్తం అప్పులు తెచ్చుకోవడానికి మాత్రమే వాడుకోవడం కూడా జనాలకు ఏ మాత్రం నచ్చలేదని అంటున్నారు. పైగా ఏపీ అంటే అప్పుల రాష్ట్రం అని అందరికీ తెలియ చేసే లాగానే ఇది ఉందని కూడా అంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులను వేధించడం అన్నది అత్యంత కీలకమైన కారణం అని అంటున్నారు. ప్రభుత్వంలో అంతర్భాగమై ఏకంగా మూడున్నర దశాబ్దాలకు పైగా బంధం కలిగిన వారి మీద కేసులు కూడా పెట్టడం, వారికి జీతాలు ఆలస్యం చేయడమే కాదు రిటైర్ అయ్యాక వచ్చే బెనిఫిట్స్ ని కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం వంటివి కూడా వైసీపీని పూర్తిగా అధికారం నుంచి దూరం చేశాయి.

ఉద్యోగులు అడగకపోయినా రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడం తద్వారా నిరుద్యోగుల పొట్ట కొట్టడం వల్ల కూడా రెండిందాలా వైసీపీ వ్యతిరేకతను తెచ్చుకుందని అంటున్నారు. అలాగే టీచర్ పోస్టులను తీస్తామని మెగా డీఎస్సీ అని చెప్పి మోసం చేయడం, ఏటేటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి దాని ఊసే మర్చిపోవడం కూడా వైసీపీ నుదుట ఓటమిని రాశాయని అంటున్నారు. తన టార్గెట్ ఓటర్లు ఫలానా అని భావించి మిగిలిన ఓటర్లను సెక్షన్లను నిర్లక్ష్యం చేయడం ఆ టార్గెట్ ఓటర్లు కూడా ఏ విధంగా ఉన్నారు అన్న నాడిని పసిగట్టలేకపోవడం వల్ల సైతం వైసీపీ దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుందని అంటున్నారు.