వైసీపీ తేల్చుకున్న తొలి తప్పు.. ఇదే...!
ఎందుకిలా జరిగిందనే విషయంపై జగన్ సహా కీలక నాయకులు ఆరా తీస్తున్నారు.
By: Tupaki Desk | 24 Aug 2024 9:30 PM GMTఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా(అంటే.. 2014లో అదికారం దక్కకపోయినా.. 67 స్తానాలు లభించాయి) ఇప్పుడు కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం అయిపోయింది. అయితే.. దీనికికారణం ఏంటనేది.. పార్టీకి ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా కారణాలపై అన్వేషణ అయితే సాగుతోంది. ఎందుకిలా జరిగిందనే విషయంపై జగన్ సహా కీలక నాయకులు ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఒక కీలక విషయం పార్టీలో చర్చకు వచ్చింది. ఇదే తొలి తప్పటడుగుగా.. ప్రధాన తప్పుగా కూడా.. నాయకులు భావిస్తున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు.. జగన్ మూడు వ్యూహాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు.
1) గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో నాయకులను, మంత్రులను కూడా ప్రజల దగ్గరకు పంపించారు. దీనివల్ల పార్టీలో లోపాలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు. దీనివల్ల లోపాలు తెలిసి వచ్చాయి. వాటిని పరిష్కరించారు కూడా. ఈ క్రమంలోనే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులను పోటీ నుంచి తప్పించారు. ఫలితంగా అనేక మంది కొత్త వారికి కూడా అవకాశం కల్పించారు.
2) సిద్ధం సభలు. మొత్తం నాలుగు సిద్ధం సభలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రాంతాల వారీగా ఈ సభలను నిర్వహించడం ద్వారా.. జగన్ ప్రజలకు భరోసా కల్పించారు. ఇది కూడా మంచి ఫలితమే ఇస్తుందని అనుకున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టి మరీ సభలకు వచ్చారు.
ఇక, 3వది.. బస్సు యాత్రలు. ఎన్నికలకు ముందు రెండు మాసాల పాటు.. జగన్ బస్సు యాత్రలు చేశారు. కడప నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర చేసి ప్రజలతో మమేకం అయ్యారు. ఈ మూడు కార్యక్రమాల తర్వాతే.. జగన్ చాలా భరోసాగా తామే గెలుస్తామని చెప్పారు. వాస్తవానికి ఈ సభలకు వచ్చిన జనాలను చూశాక.. ఖాయంగా జగన్ గెలుపుపై అంచనాలు పెరిగాయి. అయితే.. చిట్ట చివరలో జగన్ తీసుకున్న ఏకైక నిర్ణయం కారణంగానే పార్టీ ఘోరంగా ఓడిందనేది తాజాగా జరుగుతున్న చర్చ. అదే మేనిఫెస్టో. ఔను. నిజం. దీనివల్లే పార్టీ చిత్తుగా ఓడిందని అంటున్నారు.
రెండు కీలక పథకాల విషయంలో జగన్ వేసిన రాంగ్ స్టెప్ కారణంగా ఓడిపోయినట్టు నాయకులు తేల్చేశారు. పింఛన్లను పెంచడం.. అమ్మ ఒడి.. ఈ రెండు విషయాల్లోనే జగన్‌పూర్తిగా చేతులు ఎత్తేశారని.. దీంతో ప్రజలు ఆయనను దూరం పెట్టారని అంటున్నారు. కూటమి పక్షాలు పింఛన్‌ను రూ.4000లకు పెంచడం, జగన్ మాత్రం 2028, 29 సంవత్సరాల్లో పెంచుతానని అది కూడా రూ.250 చొప్పున మాత్రమే ఇస్తానని చెప్పడంతో పింఛను దారులు, వారి కుటుంబాలు కూడా దూరమయ్యాయి. ఎంత మంది పిల్లలు ఉన్నా.. తల్లికి వందనం పథకంలో రూ.15000 ఇస్తామన్న ప్రకటనతో కూటమి వైపు మొగ్గు చూపారని లెక్క తేల్చారు. అంటే.. మేనిఫెస్టోనే కొంప ముంచిందని నిర్ణయానికి వచ్చారన్న మాట.