జగన్ రెట్టింపు వరాలు... పవర్ ఫుల్ గా మ్యానిఫేస్టో...!
విపక్షంలో ఉన్న వారు ఇంకా పెద్ద ఎత్తున జనాలలోకి వెళ్ళి తమ మ్యానిఫేస్టోని పెట్టి మెప్పు పొందే ప్రయత్నం చేస్తారు.
By: Tupaki Desk | 1 March 2024 3:39 AM GMTఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు వరాల జల్లు కురుస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాయి. విపక్షంలో ఉన్న వారు ఇంకా పెద్ద ఎత్తున జనాలలోకి వెళ్ళి తమ మ్యానిఫేస్టోని పెట్టి మెప్పు పొందే ప్రయత్నం చేస్తారు.
ఇదిలా ఉంటే ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి తామే అధికారంలోకి వస్తామని అంటోంది. ఈ నేపధ్యంలో ఎన్నికల హామీలుగా బ్రహ్మాండమైన వరాలను ఏర్చి కూర్చి మ్యానిఫేస్టోని రెడీ చేస్తోంది. ఆ మానిఫేస్టోలో పాత హామీల సొమ్ముని పెంచడం ఉంది.
అలా పెంచిన వాటిని చూస్తే కనుక అమ్మ వొడి పదిహేను వేల నుంచి ఇరవై వేలకు అలాగే నేస్తం స్కీం కింద ఇచ్చే 18,500 రూపాయలను 20 వేలకు అదే విధంగా రైతు భరోసా మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతారని తెలుస్తోంది. ఇక ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ తో పాటు హాస్టళ్లకు చెల్లించే మొత్తాలు కూడా పెంచుతారు అని తెలుస్తోంది.
సామాజిక పెన్షన్ ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల దాకా పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త హామీలలో రైతులకు రుణ మాఫీ రెండు లక్షల దాకా అన్న ప్రకటన ఈసారి అత్యంత కీలకం కాబోతోంది అని అంటున్నారు.
అలాగే డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ ప్రకటన కూడా ఉంటుందని చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా ఉంటుందని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలకే ఇచ్చే విధంగా స్కీం ని అమలు చేయబోతున్నారు అని అంటున్నారు.
మరి ఇవన్నీ కూడా కొత్త హామీలుగా వైసీపీ తీసుకుని వస్తుందని ప్రచారం అయితే సాగుతోంది. ఈ మేరకు పకడ్బంధీగా ఈ మ్యానిఫేస్టోని తయారు చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఇందులోని కొన్ని హామీలు టీడీపీ సూపర్ సిక్స్ లో ప్రకటించింది. ఉచిత బస్సు సదుపాయాన్ని శ్రీకాకుళం రా కదలిరా సభలో చంద్రబాబు ప్రకటించారు. అదే విధంగా మహిళల కోసం కూడా అనేక పధకాలు టీడీపీ ఎన్నికల వరాలుగా ఉన్నాయి.
వాటికి ధీటుగా వైసీపీ కూడా సరికొత్త హామీలతో ముందుకు రాబోతోంది అని అంటున్నారు. మార్చి తొలి వారంలోనే ఈ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేస్తారు అని అంటునారు. చూడాలి మరి ఇవే హామీలు ఉంటాయా లేక వేరే హామీలు ఉంటాయా అన్నది.