Begin typing your search above and press return to search.

జగన్‌ చివరి ఆశ.. వైసీపీ బ్రహ్మాస్త్రం పనిచేస్తుందా?

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారానికి మే 11 సాయంత్రం 6 గంటలకు తెరపడనుంది.

By:  Tupaki Desk   |   11 May 2024 9:47 AM GMT
జగన్‌ చివరి ఆశ.. వైసీపీ బ్రహ్మాస్త్రం పనిచేస్తుందా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారానికి మే 11 సాయంత్రం 6 గంటలకు తెరపడనుంది. ప్రచారం ముగియడానికి కేవలం మరో కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీకి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం పెద్ద తలపోటుగా మారింది. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఈ చట్టంపై వైసీపీని ఇరుకునపడుతున్నారు. అన్ని పత్రికల్లోనూ పెద్ద ఎత్తున దీనిపైన ప్రకటనలు కూడా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని.. వాటిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటుందని, ప్రజల ఆస్తులు వారికి చెందకుండా పోతాయని, ప్రజల ఆస్తులకు సంబంధించి ఒరిజినల్‌ ధ్రువపత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయని.. ప్రజలకు కేవలం జిరాక్స్‌ కాపీలు మాత్రమే ఇస్తారని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

పాస్‌ బుక్కులపైన, రిజిస్ట్రేషన్‌ దస్తావేజులపైన జగన్‌ బొమ్మ ఇప్పటికే వేసుకున్నారని ప్రతిపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. మన తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులపైన జగన్‌ బొమ్మ ఏమిటని నిలదీస్తున్నారు. ఆ ఆస్తులు ఏమైనా ప్రజలకు జగన్‌ ఇచ్చాడా, జగన్‌ తండ్రి, తాత ఇచ్చారా అని ధ్వజమెత్తుతున్నారు. కూటమి నేతలు తమ పథకాల కంటే కూడా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపైనే ప్రచారం చేస్తూ వైసీపీని ఇరుకునపెడుతున్నారు.

దీంతో ఆత్మరక్షణలో పడిన వైసీపీ నేతలు ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తాము తేలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని కౌంటర్‌ ఇస్తున్నారు. ఇప్పటికే 24 రాష్ట్రాల్లో ఈ చట్టం అమలైందని చెబుతున్నారు. అక్కడ ప్రజల ఆస్తులు ఎవరైనా లాక్కొన్నారా అని నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఇంకా చట్టం అమలు కావడం లేదని గుర్తు చేస్తున్నారు. ఈ చట్టం మంచిది కాకపోతే అసెంబ్లీకి బిల్లుకు టీడీపీ ఎందుకు మద్దతు పలికిందని ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లు శాసనసభలో పెట్టినప్పుడు టీడీపీ తరఫున మాట్లాడిన పయ్యావుల కేశవ్‌ ఈ బిల్లును సమర్థిస్తూ మాట్లాడరని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ చట్టం మంచిది కాకపోతే అప్పుడే దీన్ని తిరస్కరించి ఉండొచ్చు కదా అని నిలదీస్తున్నారు.

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తాము తేలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని టీడీపీ, జనసేన నేతలకు దమ్ముంటే బీజేపీ నేతలతో ఈ చట్టం మంచిది కాదని చెప్పించాలని వైసీపీ సవాళ్లు విసురుతోంది. అలాగే ఆస్తులు కొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారితో తమ అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తోంది. తాము ఆస్తులు కొన్నామని.. ఒరిజినల్‌ డాక్యుమెంట్లే ఇచ్చారని వారితో చెప్పిస్తోంది. బీజేపీ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు వంటివారు కూడా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం బీజేపీ తెచ్చిందేనని చెబుతున్నారు. ఇలా వైసీపీ ఈ చట్టం విషయంలో టీడీపీకి గట్టి కౌంటర్‌ ఇస్తోంది.

మరోవైపు లబ్ధిదారుల ఖాతాల్లో పడాల్సిన వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ సున్నా వడ్డీ తదితర పథకాలకు సంబంధించి 14 వేల కోట్ల రూపాయల నిధులను టీడీపీ ఆపేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయించి లబ్ధిదారులకు అన్యాయం చేసిందని జగన్‌ ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా దీన్ని వైసీపీ అధినేత బ్రçహ్మాస్త్రంగా వాడుతున్నారు. ఈ పథకాలను తాము కొత్తగా తేలేదని గత ఐదేళ్లుగా ఉన్నాయని.. చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేయించి ఈ డబ్బులు జమ చేయించకుండా ఆపారని ఆరోపిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదు పడేలా చేస్తామని చెబుతున్నారు. తద్వారా మరోసారి పథకాలనే బ్రహ్మాస్త్రాలుగా జగన్‌ వాడుకుంటూ తుది ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ బ్రహ్మాస్త్రాలు పనిచేస్తాయో లేదో ఎన్నికల ఫలితాలు వచ్చాక కానీ తెలియదు.