ఎంపీ సీట్లలో బీసీలకు సింహ భాగం...జగన్ మాస్టర్ ప్లాన్ !
వైసీపీ అధినేత జగన్ ఆలోచనలను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అన్నట్లుగా ఉంది. ఏపీ రాజకీయాల్లో జగన్ డైనమిక్ లీడర్ గా మారి పాలిటిక్స్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 16 Dec 2023 2:30 AM GMTవైసీపీ అధినేత జగన్ ఆలోచనలను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అన్నట్లుగా ఉంది. ఏపీ రాజకీయాల్లో జగన్ డైనమిక్ లీడర్ గా మారి పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా బీసీలకు జగన్ ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్లలో సైతం పెద్ద పీట వేయబోతున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే సింహ భాగం వారికే ఇవ్వబోతున్నారు.
ఏపీలో మొత్తం పాతిక ఎంపీ సీట్లు ఉంటే అందులో 11 సీట్లు కేవలం ఓబీసీలకే జగన్ కేటాయించదలచుకున్నారు. ఆ సీట్లు చూస్తే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ,నర్సారావుపేట, కర్నూల్, అనంతపురం, హిందూపురం ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో బీసీలకే జగన్ ఇవ్వబోతున్నారు. అంటే ఇక్కడ బీసీ అభ్యర్ధులు పోటీ చేస్తారు అన్న మాట.
ఇక ఏపీలో అయిదు సీట్లు రిజర్వుడు కేటగిరీలో ఉన్నాయి. అందులో నాలుగు ఎస్సీ, ఒక ఎస్టీ గా ఉన్నాయి. అవి చూస్తే కనుక ఎస్టీలో అరకు, ఎస్సీ సీట్లలో అమలాపురం, తిరుపతి, బాపట్ల, చిత్తూరు ఉన్నాయి. అంటే అటు పదకొండు ఇటు అయిదు మొత్తం పదహారు సీట్లు బీసీలు ఎస్టీ, ఎస్టీలకు పోతే మిగిలిన తొమ్మిది సీట్లలోనే రెడ్డీస్, కమ్మాస్, మైనారిటీస్, ఇతర ఓసీ వర్గాలకు ఇవ్వాల్సి ఉంటుంది.
జగన్ ఈ విధంగా ఇస్తే కనుక వైసీపీలో సామాజిక న్యాయం పీక్స్ కి చేరుకుంది అని చెప్పాల్సి ఉంది. మాటలతో కాదు, చేతలతోనే రుజువు చేయాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ అంటే ఇలాగే ఉంటుంది అని వారు అంటున్నారు.
జగన్ రాజకీయం చూసి విపక్షాలు ఏమైనా అనుకోవచ్చు కానీ ఆయన అనుకున్న టార్గెట్ ని రీచ్ కావడానికి సమాజంలో బలంగా ఉన్న వర్గాలకు సముచితమైన స్థానం కల్పించడానికి ఆయన చేస్తున్న కృషిని మాత్రం ఎవరూ తప్పుపట్టలేరు అని అంటున్నారు పైగా ఆయనలా చేయాలంటే గట్స్ కావాలని అంటున్నారు. మొత్తానికి జగన్ పాలిటిక్స్ ఎన్నికలు ముంగిట్లో ఉండగా మారుతోంది. దాంతో విపక్షం రియాక్షన్ కూడా విమర్శలకే పరిమితం అయ్యేలా ఉంది అని అంటున్నారు.
ఏపీలో ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ కూడా బడుగు బలహీన వర్గాలను పెద్దగా సంతృప్తి పరచలేదని, జగన్ నూరు శాతం వారికి ఆ సంతృప్తితో పాటు సరైన న్యాయం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు ఇది రాజకీయంగా వైసీపీని మరింత పటిష్టం చేస్తుంది అని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అనుసరిస్తున్న ఎత్తులు జగన్ మాస్టర్ ప్లాన్స్ అన్నీ ఇపుడు అతి పెద్ద చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి.