Begin typing your search above and press return to search.

జగన్ మీద సరికొత్త ‘వంటకం’ బయటకొచ్చింది

ఈ విషయాల్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో రాజకీయ పార్టీ అధినేతలు ఉండరు. గెలిచినంతనే గర్వం వచ్చి చేరొచ్చు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 9:43 AM GMT
జగన్ మీద సరికొత్త ‘వంటకం’ బయటకొచ్చింది
X

పరాజయం ఫుల్ స్టాప్ ఎప్పటికి కాదు. జీవనంలో ఫెయిల్యూర్ ఒక కామా మాత్రమే. విజయమనే తీరానికి చేరాలంటే పరాజయం పలుకరిస్తేనే సాధ్యమవుతుంది. అందుకు భిన్నంగా గెలుపు అదే పనిగా పలుకరిస్తుంటే.. జీవితంలో కిక్కు ఏముంటుంది? ఒక వ్యక్తి జీవితంలో కానీ.. వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక ప్రముఖుడి జీవితంలో గెలుపోటములు అన్నవి నాణెనికి ఉండే బొమ్మ.. బొరుసు లాంటివి. గెలుపు కొన్నిసార్లు ఓటమికి దారి తీస్తే.. ఓటమి సైతం గెలుపు దిశగా అడుగులు వేసేలా చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉండేది కాలం మాత్రమే.

ఈ విషయాల్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో రాజకీయ పార్టీ అధినేతలు ఉండరు. గెలిచినంతనే గర్వం వచ్చి చేరొచ్చు. కానీ.. ఓడినంతనే అన్నీ వదిలేసి.. పక్కన పెట్టేసి ఎవరో ఒకరి ఆశ్రయం కోసం చేతులు జాస్తారన్నది తప్పే అవుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ఓటమి తాలుకు వేదనలో ఉన్నారు. ఇది కాదనలేని సత్యం. అంతమాత్రానికే అంతా అయిపోయిందనుకోవటం తప్పే అవుతుంది. ఎందుకంటే యుక్తవయసులోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి.. తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించినప్పుడు.. ఆయన రాజకీయ జీవితంలో మరోసారి ముఖ్యమంత్రి కాలేరనుకోవటం భ్రమే అవుతుంది. అయితే.. అదెప్పుడు అన్నది చెప్పటం అంత ఈజీ కాదు.

ఐదేళ్ల క్రితం చంద్రబాబును తిరస్కరించిన ఏపీ ప్రజలు.. తాజా ఎన్నికల్లో అక్కున చేర్చుకున్నారు. దీనికి కారణం.. ఐదేళ్ల కాలంలో జగన్ సర్కారు చేసిన తప్పులే. పాలకులుగా ఎవరు మంచి? అన్న విషయంలో ప్రజలు ఒక్కోసారి ఒక్కోలా ఆలోచిస్తారు. వారి ఆలోచనల్ని ప్రభావితం చేసినోళ్లకు అధికారం హస్తగతమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ముందున్న దారేంటి? అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటారు. జగన్ విషయానికి వస్తే..ఆయన పని అయిపోయిందని.. చేతిలో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలతో బండి నడపటం అంత తేలిక కాదని వ్యాఖ్యానించేవాళ్లున్నారు.

అదే సమయంలో జగన్ గురించి బాగా తెలిసిన వారు.. ఆయన అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకునే వారు కాదన్న మాటను బలంగా చెబుతుంటారు. పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆయన.. అక్కడే మరో ఆరు రోజుల పాటు ఉంటారని చెబుతున్నారు. ఇలాంటి వేళ.. ఆయన మీద పుట్టిస్తున్న కథనాల వంటకాల ఘాటు దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది. లాజిక్ ను పక్కన పెట్టేసి.. కొందరు కల్పిస్తున్న రాజకీయ కథనాలు చూసినంతనే మిర్చి బజ్జీల మాదిరి ఉండొచ్చు. కానీ.. అవేమీ నిజాలు అయిపోవు.

ఇప్పటికే జగన్ ను మరింత డ్యామేజ్ చేసేందుకు కొన్ని వాట్సాప్ కథనాలు మొదలయ్యాయి. వీడియోలను మార్ఫింగ్ చేసి వదులుతున్నారు. ఈ పనంతా రాజకీయ పార్టీలు చేస్తాయనుకోవటం కూడా తప్పే. ఎందుకుంటే.. ఇవాల్టిరోజున వైరల్ వార్తల్ని పుట్టించటం.. వాటిని వైరల్ చేయటం.. వాటిని సంతోషించే వారు కొందరు ఉంటున్నారు. ఎవరికి తోచినట్లుగా వారు వంటకాలు వండుకోవటం తప్పేం కాదు. కాకుంటే.. అందులో ఎంత నిజం ఉందన్నదే ప్రశ్న. తాజా వంటకం చెప్పే మాటేమంటే.. జగన్ తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారని.. అందుకు ప్రతిగా షర్మిలను తప్పించి తనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తానికి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాయం కోరారన్నది తాజా రూమర్.

ఈ వంటకంలో మిస్ అయిన అసలు పాయింట్ ఏమంటే.. తన జీవితకాలంలో క్షమించని రాజకీయ అధినేతలు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డిలు మాత్రమే. వీరిద్దరి కారణంగానే తాము అధికారాన్ని కోల్పోయామని.. వారి కారణంగా తమకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేదన్న భావనలో గాంధీ ఫ్యామిలీ ఉందని చెబుతారు. అలాంటి వేళలో.. జగన్ ను ఎంకరేజ్ చేసే అవకాశం కించిత్ కూడా ఉండదు.

ఆ మాటకు వస్తే కాంగ్రెస్ గూటికి వెళ్లాలన్న ఆలోచనే జగన్ చేయరని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజుకు ఆయనకు మోడీతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకవేళ మోడీతో పెట్టుకుంటే తనకే నష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ అవసరం మోడీ సర్కారుకు ఉంది. ఇవాల్టి గడ్డు పరిస్థితిని తప్పించుకోవటానికి కాంగ్రెస్ గూటికి వెళితే.. రేపటి భవిష్యత్తు మిస్ అవుతుందన్న చిన్న విషయాన్ని జగన్ ఎందుకు మర్చిపోతారు. తాను తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లటమంటే.. తన రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నట్లే.

ఆ చిన్న విషయం జగన్ కు తెలీకుండా ఉంటుందా? ఒంటరిగా 151 స్థానాల్ని సొంతం చేసుకొని తిరుగులేని స్థాయిలో అధికారాన్ని సొంతం చేసుకున్న ఫార్ములా తెలిసిన జగన్ కు.. అంత బలమైన స్థానం నుంచి పదకొండు స్థానాల్లో మాత్రమే గెలిచే దీనమైన స్థితికి కారణమైన పరిణామాల్ని తాజా ఓటమితో ఆయన అర్థం చేసుకోవటం ఖాయం. సంచలన గెలుపును.. దారుణమైన ఓటమిని చిన్న వయసులో చూసిన జగన్.. ఇప్పుడు ఆ రెండింటిని ఎలా బ్యాలెన్సు చేయాలన్న దానిపై ఫోకస్ చేస్తారే తప్పించి.. పరుగులు తీస్తూ కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటారని చెప్పటం. ఒకవేళ అది చేస్తే రాజకీయంగా ఆత్మహత్యే ఉంటుంది. అయినా.. అంత చిన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తెలీకుండా ఉంటుంది చెప్పండి?