Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీతో జగన్ భేటీ ?

ఎన్డీయేతో ఉండాలనుకున్నా అక్కడ ప్రత్యర్ధి టీడీపీ ఉంది. అలాగే జనసేన కూడా ఉంది. . ఈ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీ చేశాయి.

By:  Tupaki Desk   |   22 July 2024 10:06 AM GMT
రాహుల్ గాంధీతో జగన్ భేటీ ?
X

వైసీపీ అధినేత జగన్ రాహుల్ గాంధీతో భేటీ అవుతారా అన్న చర్చ వస్తోంది. అసలు ఇది జరుగుతుందా దానికి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని కూడా చర్చ సాగుతోంది. అయితే ఏపీలో చూస్తే రాజకీయంగా వైసీపీ ఒంటరి అయింది. ఆ పార్టీకి మద్దతుగా నిలిచే పార్టీలు లేవు. అలాంటి పరిస్థితిని వైసీపీ చేసుకుంది.

ఎన్డీయేతో ఉండాలనుకున్నా అక్కడ ప్రత్యర్ధి టీడీపీ ఉంది. అలాగే జనసేన కూడా ఉంది. . ఈ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీ చేశాయి. ఏపీలో కేంద్రంలో కూడా ఈ పొత్తు పార్టీలతో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఎన్డీయే కూటమి వైపు జగన్ చూసినా ప్రయోజనం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది.

జగన్ వినుకొండలో రషీద్ అనే తమ పార్టీ కార్యకర్తను హత్య చేశారంటూ టీడీపీ మీద మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సందర్భంగా జగన్ తమకు ఈ సమయంలో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. తను ఢిల్లీలో వెళ్ళి ఏపీలో జరుగుతున్న విషయాలు వివరిస్తామని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని కూడా చెప్పారు.

అలాగే ఢిల్లీలో ధర్నా చేస్తామని దానికి అన్ని పార్టీలను పిలుస్తామని కూడా చెప్పారు. అయితే జగన్ కి ఢిల్లీలో మద్దతు ఇచ్చే పార్టీలు ఏవీ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో పాటు ప్రధాని మోడీ కానీ హోం మంత్రి అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇస్తారా అన్న చర్చ కూడా వస్తోంది.

తెలుగుదేశం పార్టీతో ఉంటున్న బీజేపీ జగన్ కి ఎలా అపాయింట్మెంట్ ఇస్తుంది అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చేది ఉండదనే అంటున్నారు. జాతీయ స్థాయిలో చూస్తే ఉండేవి రెండే పార్టీలు అని అంటున్నారు. ఎన్డీయే ఏపీలో అధికారంలో ఉంది. ఆ పార్టీ ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. రాజకీయాలు చేయాలీ అంటే వైసీపీ ఎన్డీయేకు ఎదురు నిలవాలి.

అలా జాతీయ స్థాయిలో చూసుకున్నా ఎన్డీయే కూటమి ఇండియా కూటమి ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ ఏమి చేస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే చాలా మంది వైసీపీ నేతల మాట చూస్తే ఇండియా కూటమి వైపు వెళ్తేనే మేలు అన్నట్లుగా ఉంది అంటున్నారు.

అపుడు ప్రతీ విషయంలో వాళ్ళ మద్దతు దొరుకుతుంది అని అంటున్నారు. అయితే జగన్ కి కేసుల వ్యవహారం కూడా ఉంది అని అంటున్నారు. ఒక్కసారి కనుక ఇండియా కూటమి వైపు జగన్ వెళ్తే బీజేపీ టీడీపీ రెండూ పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తాయి. అంతే కాదు జగన్ కేసులను వేగవంతం చేయడమే కాదు బెయిల్ రద్దుకు సైతం ప్రయత్నాలు చేస్తారు అని అంటున్నారు.

అపుడు బెయిల్ కనుక రద్దు అయితే జగన్ జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి జగన్ జైలుకు వెళ్తే అసలుకే ఎసరు వస్తుంది అని అంటున్నారు. గతంలో జగన్ జైలులో ఉన్నపుడు తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల ఆ పార్టీ జెండాను పట్టుకుని జనంలోకి వచ్చారు. ఇపుడు ఆ పరిస్థితి అయితే లేదు. జగన్ ఒంటరిగా ఉన్నారు.

ఆయన తరువాత వైసీపీని నడిపించే పరిస్థితి ఆ స్థాయిలో ఎవరికీ లేదు. దాంతో వైసీపీని భూస్థాపితం చేస్తామని టీడీపీ అంటున్న మాటలే నిజం అవుతాయని అంటున్నారు. అయితే ఇపుడైనా జగన్ కి ఎన్డీయే సహకారం ఏ మేరకు ఉంటుందో ఎవరికి తెలుసు అంటున్నారు. సమయం వచ్చినపుడు జగన్ ని ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసులను తిరగతోడవచ్చు అని అంటున్నారు. దాంతో ఇండియా కూటమి వైపే జగన్ వెళ్ళడం దీర్ఘకాలిక రాజకీయాలలో బెటర్ అని అంటున్నారు. అపుడు ఎటు నుంచి ఏమి వచ్చినా ఇండియా కూటమి ఫుల్ సపోర్టు వైసీపీకి ఉంటుంది అని అంటున్నారు.

ఇక జగన్ ప్రధానిని కలుస్తామని అంటున్నారు. ప్రధాని కనుక అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ వెంటనే అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీనే కలవాల్సి ఉంటుందని అంటున్నారు. రాహుల్ గాంధీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం మీద లోక్ సభలో గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. దేశంలో జరిగే అనేక పరిణామాలను కూడా ఆయన లోక్ సభ దృష్టికి తెస్తూ ఎండగడుతున్నారు.

రాహుల్ గాంధీని కలిస్తే కనుక లోక్ సభలో ఏపీ అంశం పెద్ద ఇష్యూ అవుతుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదని చెప్పేందుకు వీలు కుదురుతుంది అని అంటున్నారు. మరి జగన్ రాహుల్ ని కలుస్తారా అన్నది చూడాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి జగన్ వ్యూహాలను మార్దినట్లు అయితేనే వైసీపీకి మేలు అని అంటున్నారు. మరి జగన్ రాహుల్ భేటీ ఉంటుందా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు.