జగన్ కు మైనస్ అవుతుందా ?
అలాంటిది తప్పును దిద్దుకోకపోవటం మరింత పెద్ద తప్పు. పాలకమండలి సభ్యుడిగా శరత్ ను జగన్ తొలగిస్తారని అనుకున్నారు
By: Tupaki Desk | 6 Sep 2023 10:21 AM GMTఅధికారంలో ఉన్నపుడు పాలకులు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునేటపుడు కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తారు. ఆ నిర్ణయం చిన్నదే అయినా తర్వాత దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు తాము తీసుకున్న నిర్ణయం ఎంత తప్పుడుదో అర్ధమవుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) ట్రస్టు బోర్డు సభ్యుడిగా శరత్ చంద్రారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అసలు శరత్ ను నియమించటమే జగన్ చేసిన అతిపెద్ద తప్పు.
అలాంటిది తప్పును దిద్దుకోకపోవటం మరింత పెద్ద తప్పు. పాలకమండలి సభ్యుడిగా శరత్ ను జగన్ తొలగిస్తారని అనుకున్నారు. కానీ దాని విరుద్ధంగా శరత్ పాలకమండలి సభ్యుడి ప్రమాణస్వీకారం చేసేశారు. అంటే తన తప్పును జగన్ సరిదిద్దుకోవాలని అనుకోవటంలేదని అర్ధమైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే పాలకమండలిలో సభ్యుడిగా శరత్ నియామకం ఎందుకు తప్పు ? ఎందుకంటే శరత్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు ఇరుక్కున్నాడు. బెయిల్ మీద బయట తిరుగుతున్నారు.
స్కామ్ లో అప్రూవర్ గా మారిన తర్వాత, భార్యకు అనారోగ్యం అని చెప్పిన తర్వాతే కోర్టు శరత్ కు బెయిల్ ఇచ్చింది. జరిగిన స్కామ్ లో అప్రూవర్ గా మారటమంటేనే తాను నేరంచేశానని అంగీకరించటమే. నేరంచేశానని అంగీకరించిన వ్యక్తిని, రేపే మోపో మళ్ళీ బెయిల్ రద్దయితే జైలుకు వెళ్ళాల్సిన వ్యక్తిని జగన్ బోర్డులో నియమించటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇదే శరత్ ను ఇంకేదైనా పోస్టులో నియమించినా పెద్దగా అభ్యంతరాలు ఉండేదికాదు. కానీ ప్రపంచంలోని హిందువులందరు ఎంతో భక్తిగా కొలిచే తిరుమల శ్రీవారి ట్రస్టుబోర్డులో సభ్యుడిగా నియమించటమే ఇబ్బందిగా ఉంది. టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు కూడా లిక్కర్ వ్యాపారి డీకే ఆదికేశవుల నాయుడును ఛైర్మన్ గా నియమించారు. అయితే ఆయన ఎక్కడా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోలేదు. అప్పటికే వహాలా ముడుపుల ఆరోపణలపై కేసులు నమోదైనా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఆదికేశవుల నాయుడు నియామకంపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తంకాలేదు. నిజానికి ఆదికేశవులను అప్పట్లో ఛైర్మన్ గా నియమించకుండా ఉంటే బాగుండేదని అనుకునే వాళ్ళున్నారు. కానీ శరత్ లాగ మరీ అన్యాయమైన వ్యక్తయితే కాదు.