ఏపీకి వస్తూనే ఢిల్లీకి... జగన్ ప్లాన్ ఏంటి...?
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. పది రోజుల పాటు సాగే ఈ టూర్ పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనది
By: Tupaki Desk | 11 Sep 2023 8:47 AM GMTఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. పది రోజుల పాటు సాగే ఈ టూర్ పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనది. ఇదిలా ఉంటే సక్సెస్ ఫుల్ గా తన టూర్ ని కంప్లీట్ చేసుకున్న జగన్ సోమవారం అర్ధరాత్రికి విజయవాడ చేరుకుంటారని తెలుస్తోంది. అంటే ఆయన మంగళవారం ఉదయం నుంచే తన సీఎం విధులలో భాగం అవుతారని అంటున్నారు.
జగన్ ఏపీకి వచ్చాకా చాలా విషయాల మీదనే రివ్యూస్ ఉంటాయని అంటున్నారు. అటు పార్టీకి సంబంధించి చూసినా ఇటు ప్రభుత్వానికి సంబంధించి చూసినా ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ నేపధ్యంలో లా అండ్ ఆర్డర్ విషయం మీద జగన్ మంగళవారం అర్జంట్ గా సమీక్ష చేస్తారని అంటున్నారు.
ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. బాబు వంటి కీలక నేత అరెస్ట్ అయ్యారు. దాంతో విపక్షాలు రోడ్డు మీదకు వచ్చాయి. ఈ క్రమంలో లా అండ్ ఆర్డర్ ని పకడ్బందీగా ఉండేలా చూసేందుకు సీఎం జగన్ ఆ దిశగానే ఫోకస్ పెడతారు అని అంటున్నారు
అదే విధంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల మీద పార్టీ ముఖ్యులతో ఆయన చర్చిస్తారు అని అంటున్నారు. ఇక జగన్ ఏపీకి వచ్చీ రాగానే ఈ నెల 13న అంటే బుధవారం అర్జంటుగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఇదే ఇపుడు ఆసక్తిని పెంచుతోంది. ఒక్క రోజు కూడా ఏపీలో ఉండకుండా వచ్చిన వెంటనే ఢిల్లీకి ఎందుకు సీఎం వెళ్తున్నారు అన్నదే చర్చకు వస్తోంది.
అయితే పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి నిధులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర నిధుల విడుదల కోసం సీఎం జగన్ కేంద్ర పెద్దలను కలవనున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఏపీలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు చంద్రబాబు అరెస్ట్ వంటి వాటి మీద కేంద్ర పెద్దలతో జగన్ చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఏపీలో బీజేపీ స్టాండ్ ఏంటో ఇంకా వెల్లడి కాలేదు, అదే టైం లో ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి. అందులో జమిలి ఎన్నికల బిల్లుతో పాటు ఇతర కీలక బిల్లులు కూడా ప్రవేశపెడతారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో జగన్ కేంద్ర పెద్దల మధ్య ఆయా అంశాలతో పాటు ఏపీ రాజకీయాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. మొత్తం మీద జగన్ ఢిల్లీ టూర్ అయితే ఈ కీలక సమయంలో ఇంటరెస్టింగ్ గానే ఉంది అని అంటున్నారు. నిజంగా కేంద్ర పెద్దలతో ఏ విషయాలు చర్చిసారో చూడాల్సిందే అంటున్నారు.