టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్... రాష్ట్రవ్యాప్త పర్యటనపై జగన్ వ్యాఖ్యలు!
ఈ క్రమంలో తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 13 Jun 2024 10:30 AM GMTఏపీలో ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తున్న వైసీపీ అధినేత జగన్... పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తొలుత గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో భేటీ అయిన ఆయన.. అనంతరం ఓడిపోయిన ఎమ్మెల్యేలతోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్లు కనిపిస్తున్న వైసీపీ అధినేత జగన్... భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ పాలనలో జరిగిన మంచిని ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని అన్నారు!
ఇదే సమయంలో 40శాతం మంది ప్రజలు మనవైపే ఉన్నారనే విషయం మరిచిపోవద్దని చెప్పిన జగన్... వైసీపీ సర్కార్ చేసిన మంచి ఇప్పటికీ ప్రజకు గుర్తుందని అన్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన... ఈ దఫా ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని.. ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని తెలిపారు.
రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ఉవ్వెత్తున ఎగిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పిన జగన్... త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేసులు పెట్టినా ఎవరూ భయపడొద్దని.. ఎటువంటి ప్రలోభాలకూ లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు సూచించారు. ఇదే సమయంలో... అసెంబ్లీలో మనల్ని మాట్లాడనివ్వకుండా కట్టడిచేసే అవకాశం ఉందని అన్నారు.
అయినప్పటికీ శాసనమండలిలో గట్టిగా స్వరం వినిపించాలని.. గట్టిగా పోరాటాలు చేద్దామని జగన్ ఎమ్మెల్సీలకు సూచించారు. ఈ క్రమంలో ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోందని చెప్పిన జగన్... వారికి మరికొంత సమయం ఇద్దామని అన్నారు. అనంతరం శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని తెలిపారు.
మరోపక్క... ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో వైసీపీ కార్యకర్తలు, నేతలపై జరిగిన దాడుల నేపథ్యంలో వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఉంటుందని ప్రచారం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే... తాజాగా ఎమ్మెల్సీలతో జరిగిన భేటీలో జగన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇందులో భాగంగా త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని అన్నారు.
కాగా... ఏపీ శాసనమండలిలో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... వైసీపీకి 38 మంది ఎమ్మెల్సీల బలం ఉండగా.. టీడీపీకి 8 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.