జగన్ మారిపోయిన సార్ అంట... తెరపైకి కొత్త కారణం!
ఫలితంగా... గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతుందని తెలుసుకునే అవకాశాన్ని జగన్ చేజేతులా మిస్ చేసుకున్నారు
By: Tupaki Desk | 13 July 2024 6:45 AM GMTప్రతిపక్షంలో ఉన్నంత కాలం ఎండనకా కొండనకా, వాననకా చలి అనకా అన్నట్లుగా జనాల్లో తిరిగిన జగన్ ఒక్కసారి కుర్చీ ఎక్కాక క్యాంప్ ఆఫీసుకు, పరదాల చాటుకు పరిమితమైపోయారు! సామాన్య ప్రజానికం సంగతి దేవుడెరుగు.. కనీసం సొంతపార్టీ ఎమ్మెల్యేలకు సైతం దర్శనభాగ్యం కలగడం లేదనేది అతిపెద్ద ఆరోపణ. ఫలితంగా... గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతుందని తెలుసుకునే అవకాశాన్ని జగన్ చేజేతులా మిస్ చేసుకున్నారు.
ఐప్యాక్ టీం చేప్పిందే వేదం.. సజ్జల చెప్పిందే సత్యం.. ధనుంజయ్ రెడ్డి చేసిందే గవర్నెన్స్ అన్నట్లుగా పాలన సాగించారనే తీవ్ర వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే... అసలు నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలు, కార్యకర్తల మనోభావాలు ఎమ్మెల్యేల నుంచి తెలుసుకునే ప్రయత్నం జగన్ చేయలేదనేది అతిపెద్ద ఆరోపణ. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీలైన ఎమ్మెల్యేలు ఈ విషయాలు చెబుతున్నారు.
ఉదాహరణకు మద్యంపాలసీపై ఊర్లో జనాలు తిట్టుకుంటున్నారని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని సజ్జలకు సమాచారం ఇచ్చామని.. అయితే అది జగన్ ద్వారా ఆచరణలోకి రాలేదన్నట్లుగా వైసీపీ కీలక నేతలు చెబుతూ ఇటీవల వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... మాడు పగిలితే కాని తత్వం బోదపడలేదు అన్నట్లుగానో ఏమో కానీ... జగన్ జనాల్లోకి వెళ్లాలని.. పరదాలు లేకుండానే జనల్లో తిరగాలని, వారికి కలవాలని భావిస్తున్నారని అంటున్నారు.
అవును... ఇప్పటికే తన సొంత నియోజకవర్గం పులివెందులలో విసృతంగా తిరుగుతున్న జగన్.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను, ప్రజలను కలవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ నెల 15 నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "ప్రజా దర్బార్" నిర్వహించడానికి వైసీపీ అధినేత జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ... జగన్ ఈ దిశగా సమాయత్తమవుతున్నారని అంటున్నారు.
ఇందులో భాగంగా ప్రతీరోజూ ప్రజలను కలిసేందుకు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్న సమయంలో... స్పందన, ప్రజాదర్బార్, రచ్చబండ, పల్లెబాట ఇలా రకరకాల పేర్లతో ప్రజలను కలిసే కార్యక్రమాలు వార్తల్లోకి వచ్చినా.. అవి మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే... ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఈ కార్యక్రమానికి తెరలేపారని అంటున్నారు.
దీంతో... విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ఒక్కసారిగా... "మీరు మారిపోయారు సార్!" అని కామెంట్ చేస్తున్నారని అంటున్నారు. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది కదా అన్నా అంటూ ఫ్యాన్స్ స్పందిస్తున్నారంట.