ఏం చేద్దాం.. వెళ్దామా.. వద్దా? జగన్ అంతర్మథనం!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సంకటంలో పడ్డారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన.. ప్రమాణ స్వీకారం తర్వాత.. తనకు కేటాయించిన ఛాంబర్‌కు వెళ్లిపోయారు.
By: Tupaki Desk | 21 Jun 2024 9:57 AM GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సంకటంలో పడ్డారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన.. ప్రమాణ స్వీకారం తర్వాత.. తనకు కేటాయించిన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. ఇదేసమయంలో వైసీపీ తరఫున విజయం దక్కించుకుని.. ప్రమాణ స్వీకారం చేసిన.. వారిని కూడా.. అక్కడకు పిలిచారు. ఈ సమయంలో కీలక నేతలు.. సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆయన సోదరుడు, ఎమ్మెల్యే ద్వారకా నాథ్‌రెడ్డిలు ఉన్నారు.
వీరితోపాటు.. ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా `ఏం చేద్దాం?` అంటూ.. అసెంబ్లీ సమావేశాలపై జగన్ ప్రశ్నించారు. వారి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు సమావేశాలు లేవు. కానీ, శనివారం కీలకమైన ఘట్టం ఉంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటారు. సభలో బలం లేదు కాబట్టి వైసీపీ పోటీ పెట్టే అవకాశం లేదు. దీంతో ఇవి ఏకగ్రీవంగానే జరగనున్నాయి. అయితే.. సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నాయకుడు.. స్పీకర్‌ను ఆయన ప్లేస్ వరకు సాగనంపాలి.
గత 2019లో స్పీకర్ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను వైసీపీ ఎన్నుకుంది. ఆయనను సీటు వరకు చేర్చే క్రమంలో చంద్రబాబు రాకుండా.. అచ్చెన్నాయుడును పంపించారు. ఇదివిమర్శలకు దారితీసింది. ఇక, ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీకి వచ్చింది. తాను స్వయంగా వెళ్లి స్పీకర్‌ను అభినందించాలి.. ఆయనను సీటు వరకు తీసుకువెళ్లి.. ఆ సీటులో కూర్చునే వరకు ఉండాలి.
దీనిపైనే తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయం కోరారు మాజీ సీఎం. అయితే..ఎవరికివారు.. మీ ఇష్టం అంటూ.. ఆయన ఇష్టానికే సబ్జెక్టును వదిలేశారు. ఎలానూ ప్రతిపక్ష హోదా లేనప్పుడు.. తాను వెళ్లి నా, వెళ్లకపోయినా.. ఒక్కటే అంటూ.. జగన్ వ్యాఖ్యానించారు. చివరకు ఏమీ తేలకుండానే సమావేశాన్ని ముగించారు. అయితే.. స్వయంగా జగనే హాజరయ్యే అవకాశం ఉంది. లేకపోతే.. మరిన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ హాజరై.. స్పీకర్‌ను ఆయన సీటు వద్దకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి వెళ్లిపోయే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.