మరోసారి బెంగళూరుకు జగన్.. అసలు కారణమిదే!
అలాగే మరణించిన తన సమీప బంధువులు, వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శించారు.
By: Tupaki Desk | 15 July 2024 7:00 AM GMTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన జూన్ 24 నుంచి జూలై 1 వరకు బెంగళూరు నివాసంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తిరిగొచ్చాక రెండుసార్లు తన సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. పులివెందులలో మూడు రోజులపాటు ఉండి నేతలు, కార్యకర్తలను కలుసుకున్నారు. ప్రజల వద్ద పలు వినతులు స్వీకరించారు. అలాగే మరణించిన తన సమీప బంధువులు, వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శించారు.
మళ్లీ జూలై 8న తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వైఎస్ జగన్ పులివెందుల వెళ్లారు. తన తండ్రి సమాధికి నివాళులు అర్పించాక తాడేపల్లికి తిరిగొచ్చారు.
కాగా జూలై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి రారని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. అలాగే కడప ఎంపీగా జగన్ పోటీ చేస్తారని టాక్ నడిచింది. అయితే ఈ వార్తలను వైసీపీ నేతలు ఖండించారు.
ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో జగన్ బెంగళూరు పర్యటన మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయన బెంగళూరులో కొద్ది రోజులు ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానట్టేనని చెబుతున్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పాదానికి గాయమైందని.. అది తగ్గలేదని.. దానికి బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. గత నెలలో బెంగళూరు వెళ్లి దాదాపు వారం రోజులు ఉండి వచ్చింది కూడా కాలి చికిత్స కోసమేనని చెబుతున్నారు,
ఇప్పుడు తాజాగా మరోసారి బెంగళూరుకు వెళ్తోంది కూడా కాలికి అయిన గాయానికి సంబంధించిన చికిత్సకేనని తెలుస్తోంది. వాస్తవానికి జూలై 15 నుంచి జగన్ ప్రజాదర్బార్ నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రజల సమస్యలను వినడం, వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించడం చేస్తారని వైసీపీ ఇప్పటికే వెల్లడించింది.
అలాగే అన్ని నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలను కూడా కలవాలని జగన్ సంకల్పించారని ఆ పార్టీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే వైసీపీ, టీడీపీ పరస్పర దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను జగన్ పరామర్శించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఈవీఎంను బద్దలుగొట్టి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటన చేసి వైసీపీ శ్రేణులకు భరోసా ఇస్తారని నేతలు భరోసా ఇచ్చారు. కానీ జగన్ ఉన్నఫలంగా బెంగళూరుకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో జగన్ ప్రజాదర్భార్ కార్యక్రమం కూడా వాయిదా పడింది. జగన్ బెంగళూరు నుంచి తిరిగొచ్చాకే దీనిపై స్పష్టత రానుంది.