బావమరిదికి జగన్ లక్కీచాన్స్!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు
By: Tupaki Desk | 22 Aug 2024 6:55 AM GMTఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ముఖ్యంగా సొంత జిల్లాలోనే కూటమి ధాటికి వైసీపీ కుదేలైంది. కడప జిల్లాలో ఉన్న మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో కేవలం మూడు స్థానాలనే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సొంత జిల్లా నుంచే పార్టీ బలోపేతం వైఎస్ జగన్ దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తన మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని జగన్ నియమించారు. ఇప్పటివరకు ఈ పదవిలో కడప మేయర్ సురేశ్ బాబు ఉన్నారు. అలాగే అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిని నియమించారు. ఇప్పటివరకు అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యవహరించారు.
ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటివరకు తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కమలాపురం నియోజకవర్గానికి ఇంచార్జిగా తన బావమరిది నరేన్ రామాంజనేయరెడ్డిని జగన్ నియమించారు. నరేన్ మరెవరో కాదు.. రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు.
రవీంద్రనాథ్ రెడ్డి స్వయానా వైఎస్ జగన్ కు మేనమామ. స్వయానా జగన్ తల్లి విజయమ్మకు తమ్ముడు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప మేయర్ గా రవీంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లా కమలాపురం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సృష్టించాలనుకున్నా ఆయన ఆశలు నెరవేరలేదు. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
కాగా కమలాపురం వైసీపీ ఇంచార్జిగా నియమితులైన నరేన్ రామాంజనేయరెడ్డి ప్రస్తుతం కడప జిల్లా చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీ గా ఉన్నారు. మరోవైపు వ్యాపార రంగంలోనూ చురుగ్గా రాణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయనపై వైఎస్సార్ హయాంలో కేటాయించిన కుందు ప్రాజెక్టు భూముల వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. వీటిని అతి తక్కువ ధరకే నరేన్ దక్కించుకోవాలని చూస్తున్నారని కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించాయి. వీటిని నరేన్, ఆయన తండ్రి రవీంద్రనాథ్ రెడ్డి ఖండించారు.
కాగా ఇటీవల ఎన్నికల్లో తన తండ్రి రవీంద్రనాథ్ రెడ్డికి బదులుగా నరేన్ రామాంజనేయరెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే చివరకు ఏమైందో ఏమై మళ్లీ రవీంద్రనాథ్ రెడ్డే పోటీ చేశారు. అయితే ఆయన ఓడిపోవడంతో జగన్ తన బావమరిది నరేన్ ను ఇంచార్జిగా నియమించారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేయనున్నారు.