చంద్రబాబుతోనే అంటున్న జగన్...!?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రత్యర్ధులను ఎంచుకోవడంలోనూ ఒక రకమైన విధానం అవలంబిస్తారు
By: Tupaki Desk | 10 May 2024 9:18 AM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రత్యర్ధులను ఎంచుకోవడంలోనూ ఒక రకమైన విధానం అవలంబిస్తారు. ఆయన ఎక్కువగా ఎవరినీ పేరు పెట్టి కూడా సభలలో విమర్శించరు. ఆయన అలా విమర్శించే ఒకే ఒక్క పేరు చంద్రబాబు. ఆయన చంద్రబాబు మీదనే సూటిగా ధాటిగా విమర్శలు చేస్తారు. అది కూడా మొత్తం తన గంట ప్రసంగంలో చివరి పది నిముషాలు మాత్రమే.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ జగన్ ని ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పదే పదే ఎందుకు మీరు టార్గెట్ చేస్తారు అన్న ప్రశ్న జగన్ ని సూటిగా యాంకర్ అడిగారు. దానికి జగన్ ఇచ్చిన సమాధానం చూస్తే ప్రత్యర్ధుల విషయంలో ఆయన వైపు నుంచి ఎలాంటి కొలమానాలు ఉంటాయన్నది అందరికీ అర్ధం అయింది.
తాను ఎపుడూ పెద్దగా పవన్ ని విమర్శించను అని జగన్ స్పష్టం చేశారు. తాను ఆయన గురించి చాలా తక్కువగా మాట్లాడుతాను అని కూడా చెప్పేశారు. తన ఫోకస్ ఎపుడూ చంద్రబాబే అని కూడా జగన్ స్పష్టం చేశారు. దీని అర్ధమేంటి అంటే జగన్ తన ప్రత్యర్ధిని ఎంచుకుని మరీ విమర్శిస్తారు అని.
తాను విమర్శ చేసే ప్రత్యర్ధి విషయంలోనూ ఆయన అనేక కొలమానాలు పాటిస్తారు అని. అందుకే జగన్ నోటి వెంట ఏ ఇతర నాయకుడి మీద కనీసం విమర్శలు ఉండవు. ఒకవేళ ఉంటే గింటే ఆయా సందర్భాల బట్టి ఒకటి రెండు సెటైర్లు మాత్రమే ఉంటాయి.
ఇదంతా ఎందుకు అంటే జగన్ మంగళగిరికి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. జగన్ ఎన్నికల ప్రచార సభలు అన్నీ ఒక ఎత్తు అయితే మంగళగిరి ఒక ఎత్తు అని అంతా అనుకుంటూ వస్తున్నారు. అక్కడ పోటీ చేస్తోంది నారా లోకేష్. టీడీపీకి భావి వారసుడు.
అంతే కాదు అయిదు మంత్రిత్వ శాఖలను నిర్వహించిన వారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు తరువాత టీడీపీకి అంతటి వారు. ఇక రేపటి రోజున టీడీపీ గెలిస్తే భావి సీఎం గా ఆయన పేరు కచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి నారా లోకేష్ గురించి ఒక్క మాట కూడా విమర్శగా జగన్ చేయకపోవడం విశేషం.
దాదాపుగా గంట సేపు మాట్లాడిన జగన్ చివరిలో అన్నదేంటి అంటే తాను ఓసీ క్యాండిడేట్ అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ని పక్కన పెట్టి మరీ బీసీ మహిళ అయిన మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చాను అని చెప్పారు. మంగళగిరి బీసీ సీటు. ఇక్కడకు పెద్ద వాళ్ళు చాలా మంది పోటీ చేయడానికి వస్తున్నారు. బీసీల సీటు అంటే గెలవవచ్చు అని వారు అనుకుంటున్నారు.
కానీ అలా జరగకూడదు, బీసీలు అత్యధిక శాతం ఉన్న మంగళగిరిలో బీసీలే గెలవాలని జగన్ నినదించారు. చంద్రబాబు దగ్గర దోచుకో దాచుకో అన్నట్లుగా డబ్బులు చాలా ఉన్నాయి. ఆయన వాటిని జనాలకు పంచుతారు. అయితే ఆ డబ్బులు తీసుకోండి, వైసీపీకే ఓటు వేయండి అని జగన్ పిలుపు ఇచ్చారు. మొత్తానికి చూస్తే నారా లోకేష్ మీద ఒక్క కామెంట్ కానీ సెటైర్ కానీ లేకుండానే జగన్ సభను ముగించేశారు.
ఇక జగన్ మరో ఎన్నికల సభ ఉంది. అది శనివారం పిఠాపురం లో జరగనుంది. ఈ సభలో కూడా జగన్ చంద్రబాబు మీదనే విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తారు అన్నది నో డౌట్. ఇక ఆ సీటులో పవన్ పోటీ చేస్తున్నారు. ఆయన పేరుకు బదులు దత్తపుత్రుడు లేదా ఒక రీల్ హీరో పోటీ చేస్తున్నారు అని ఒక్క మాటతో సెటైర్లు వేసి ముగించేసే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు.
మొత్తానికి చూస్తే జగన్ తన రాజకీయ ప్రత్యర్ధిగా ఏపీలో చంద్రబాబునే ఎంచుకుంటున్నారు. ఆయన పేరునే పదే పదే మాట్లాడుతున్నారు. అది కూడా జగన్ స్ట్రాటజీయే అంటున్నారు. అంతే కాదు జగన్ తో సీఎం పదవికి పోటీ పడుతున్నది కూడా బాబు మాత్రమే కావడంతోనే ఇలా ఆయన పేరుని ముందుకు తెచ్చి విమర్శిస్తున్నారు అని అంటున్నారు.
ఇక సొంత చెల్లెలు పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల విషయంలోనూ జగన్ ఎక్కడా పేరు పెట్టి మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా ఉంది. కాంగ్రెస్ కూడా బాబు జేబులో పార్టీయే అని ఆయన పంచులు పేలుస్తున్నారు తప్ప ఆ పార్టీకి ఏపీలో ఎవరు లీడర్ అన్నది సైతం ప్రస్తావించడంలేదు అని గుర్తు చేస్తున్నారు.
మొత్తానికి తూకం రాళ్ళు దగ్గర బాగానే పెట్టుకుని జగన్ ఒక పద్ధతి ప్రకారమే ప్రత్యర్ధుల మీద విమర్శలు చేస్తారు అని అంటున్నారు. అది కూడా మొత్తం మీటింగులో కేవలం అయిదు నుంచి పది నిముషాలు. మరి జగన్ స్పీచు లలో ఇంత తక్కువ టైం ప్రత్యర్ధులకు ఇస్తూంటే అవతల విపక్షం మాత్రం గంటల సేపు ఉపన్యాసాలలో జగన్ గురించే తొంబై శాతం టైం ఇచ్చేస్తున్నారు అని తేడా చూపిస్తున్నారు.